స్క్రిప్ట్ వండుతున్నా-వంశీ పైడిపల్లి

ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో…

ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే..

వైవిధ్యమైన కథాంశాలకు,  ఆసక్తికరమైన స్టోరీ టెల్లింగ్ కు ఉదాహరణగా నిలిచే సినిమాల్లో కొన్ని అయినా వంశీ పైడిపల్లి సినిమాలు వుంటాయి. సినిమా సినిమాకు కొత్త కథాంశం పరిచయం చేయడం ఆయన అలవాటు. మహర్షి సినిమా తరువాత ఇంకా మరే సినిమా టేకప్ చేయని ఆయన ఈ కరోనా టైమ్ లో ఏం చేస్తున్నారు? ఓ సారి పలకరిస్తే..

-కరోనా టైమ్ లో దొరికిన ఖాళీని ఎలా  పూరిస్తున్నారు?

ఖాళీ అనేమీ లేదు. సాధారణంగానే నేనే కాదు, ఏ దర్శకులు, రచయితలైనా టైమ్ దొరికితే ఏదో ఒక లైన్ తయారు చేయాలని, స్క్రిప్ట్ ప్లాన్ చేసుకోవాలని చూస్తారు. నేనూ అదే చేస్తున్నా. థాంక్స్ టు టెక్నాలజీ. నేను నా టీమ్ తలో చోట వున్నా కూడా, మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ తయారుచేస్తున్నాం. అయితే అందరూ ఒక దగ్గర వుంటే ఆ డిస్కషన్లు, ఆ ప్రిపరేషన్లు వేరు. మరింత బెటర్ గా వుంటుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు.

-అంటే వంటింట్లోకి వెళ్లడాలు, 'హోమ్' వర్క్ లు లేవన్నమాట.

అబ్బే లేదు. ఎందుకంటే ఇంట్లో అమ్మ, నాన్న, నేను, నా ప్యామిలీ అంతా వుంటాం. సందడిగా సాగిపోతుంది. మొన్న ఒక్కసారి నా వైఫ్ బర్త్ డే అయితే కేక్ తయారచేస్తా అని వంటింట్లోకి వెళ్లాను. కేక్ అయిన తరువాత వంటిల్లు చూసి, ఇక ఎప్పుడు అందులోకి రావద్దని ఫ్యామిలీ మెంబర్లు ఆర్డరేసారు.

-సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి?

నా అంతట నేనుగా వెబ్ సిరీస్ లు  బ్రౌజ్ చేసి చూడను. ఎవరో ఒకరు చూడు, బాగుంది అని చెబితే అప్పుడు చూస్తాను. మలయాళం సినిమాలు చూడడం ఇష్టం.  స్క్రిప్ట్ వర్ఖ్, రైటింగ్స్ స్కిల్స్ బాగా వుంటాయి. చాల సినిమాలు పెండింగ్ లో వుండిపోయాయి. అవన్నీ చూస్తున్నాను. చిన్న లైన్ తీసుకుని, క్యారెక్టర్లు అన్నీ బాగా అల్లుతారు. 

-మీ సినిమాల్లో కూడా ఈతరహా శ్రద్ధ కనిపిస్తుంది?

నిజానికి నేను రైటింగ్ ఫీల్డ్ నుంచి రాలేదు. డైరక్షన్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాను. అయితే మెల్లమెల్లగా రైటింగ్ స్కిల్స్ నేర్చుకుని, మెరుగులు దిద్దుకుంటూ వస్తున్నాను. 

-మీ దృష్టిలో మంచి స్క్రిప్ట్ కు ఏం కావాలి?

ఎమోషన్, డ్రామా అన్నది ఏ స్క్రిప్ట్ కు అయినా అవసరం. నేను డ్రామాను ఎక్కువ నమ్ముతాను. ఏ సినిమా అయినా, ఇంటర్ పర్సనల్ రిలేషన్ షిప్ అనేది ఇష్టం. ఏ సినిమా అయినా మదర్ అండ్ సన్, లేదా మరే విధమైన బంధాలు బలంగా వుంటాయి. ఎమోషన్లనే ఎక్కువగా నమ్ముతాను. ఇవన్నీ కథను కథను బట్టి మారుతూ వుంటాయి. 

-సినిమా సినిమాకు మీరు జానర్ మారుస్తుంటారు?

అంటే బేసిక్ గా డైరక్షన్ ఫీల్డ్ నుంచి రావడం వల్ల, కథను ముందు వెదుక్కుంటాను. సినిమా సినిమాకు మధ్య ఈ పని ఎక్కువ వుంటుంది. అందుకే నాకు సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఏ కథ చెప్పాలి ఈ సారి అన్నిది డిసైడ్ అయితే తప్ప స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించను. వన్స్ స్టోరీ ఏమిటి? అన్నది లైన్ డిసైడ్ అయ్యాక, స్క్రిప్ట్ అల్లిక మీదకు వెళ్తాను. 

-శిఖరం ఎక్కుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా వుండాలి కదా?

నిజమే…మనం ప్రారంభించినపుడు పోగొట్టుకోవడానికి మన దగ్గర ఏమీ వుండదు. కానీ పాపులర్ అవుతున్న కొద్దీ, సక్సెస్ వస్తున్న కొద్దీ జాగ్రత్త అవసరం పడుతూ వుంటుంది. మన మీద మనమే బ్యాగేజ్ పెంచుకుంటూ వుంటాం.

-కొత్తగా సక్సెస్ తెచ్చుకోవడం అనే దాని కన్నా ఇప్పటి వరకు వున్న సక్సెస్ గ్రాఫ్ ను నిలబెట్టుకోవడం సమస్య అవుతోంది అందరికీ అనుకుంటా?

అంటే ఇప్పుడు అందరం చాలా టఫ్ టైమ్ లో వున్నాం. వరల్డ్ ఎక్స్ పోజర్ పెరిగింది. ప్రపంచ సినిమా మొత్తం మన ఇంట్లోకి వచ్చేసింది. చిత్రలహరి కోసం ఎగ్జయిటింగ్ గా చూసే రోజులు కావు. ఇలాంటి టైమ్ లో జనాలను థియేటర్ కు తీసుకురావడమే పెద్ద ఛాలెంజ్. తీసుకువచ్చిన వారిని అన్ని విధాలా సంతృప్తిగా వెనక్కు పంపాలి. ఇది చాలా టఫ్ జాబ్. అంత ఈజీ టాస్కేమీ కాదు.

-అనుభవం, ట్రాక్ రికార్డ్ అన్నవి ఏ మేరకు పనికి వస్తాయి?

గతంలో అయితే ఫిఫ్టీ ఫిట్టీగా సక్సెస్, ఫెయిల్యూర్ వున్నా నడచిపోయేది. డైరక్టర్ ఏదో చేస్తాడులే ఈసారి అన్న ఆలోచన వుండేది. కానీ  ఇప్పుడు ప్రతీ సినిమా లాస్ట్ ఇన్నింగ్స్ నే. ది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. ఈ సినిమా సక్సెస్ అయితేనే మళ్లీ సినిమా వస్తుంది. ఆ సినిమా సక్సెస్ అయితేనే మరో సినిమా వస్తుంది. ప్రతీ సినిమా లాస్ట్ బాటిల్ అన్నంతగా ఫైట్ చేయాల్సిందే. ఈ సీజన్ లో వున్న ప్రతి డైరక్టర్ ఎంత స్ట్రెస్, ప్రెజర్ తో వున్నారో చెప్పలేం. తెల్లవారి లేచిన దగ్గర నుంచి అదే ప్రెజర్. పైకి సక్సెస్ లైన్ లో వున్నారు అని అనిపిస్తుంది. అంతే.

-థియేటర్ ను వదిలి ఓటిటి లోకి సినిమా వస్తుందంటారా?

కష్టం అండీ, మన ప్రేక్షకులకు అన్ని తరహాల ఎక్స్ పీరియన్స్ ఒక్క సినిమాలో కావాలి. షడ్రచుల భోజనం కావాలి. అందువల్ల మన సినిమాల బడ్జెట్ వేరు. అది రికవరీ కావాలంటే జనం థియేటర్ కు రావడం చాలా అవసరం. మన కల్చర్ లో మన సినిమాలో వున్న ఎమోషన్ అనే కీలక ఎలిమెంట్ జనాలను థియేటర్ కు లాగుతోంది. సినిమా మన కల్చర్ లో వుంది. అదే మన సినిమాలకు శ్రీరామరక్ష. 

-మళ్లీ థియేటర్లకు జనం వస్తారంటారా? భయం లేకుండా?

ఇప్పటికిప్పుడు ఆన్సర్ చెప్పలేం. ఎందుకుంటే ప్రపంచానికే ఇది కొత్త అనుభవం. వన్స్ వ్యాక్సీన్ వచ్చేస్తే ధైర్యం వస్తుంది. ఇది ప్రపంచ సినిమాకే హార్డ్ టైమ్. దీని నుంచి తేరుకోవడానికి టైమ్ పడుతుంది. ఎంత టైమ్ అని చెప్పేంత అనుభవం అయితే నాకు లేదు.

-సూపర్ స్టార్ మహేష్ కు అంత దగ్గర ఎలా కాగలిగారు? ఓ ఫ్యామిలీ బాండింగ్ ఎలా వచ్చింది.?

దీన్ని ఇదీ కారణం అని నిర్వచించలేం. అసలు ఏ రిలేషన్ ఎలా ఏర్పడుతుందో, ఎవరు ఎవరికి ఎలా దగ్గరవుతారో అన్నది డిఫైన్ చేయలేం. ఎమోషనల్ ఐడియాలజీ కనెక్షన్, ఎమోషనల్ బాండింగ్ ఇలా చాలా వుంటాయి. 

-మీకు ఆయనకు కామన్ అభిరుచులు ఏమన్నా వున్నాయా?

డెఫినిట్లీ. ఇద్దరు మనషులు ప్రొఫెషన్ దాటి ముందుకు వెళ్లి సాన్నిహిత్యం అయ్యారు అంటే ఏదో మ్యాచింగ్ వుండాలి కదా? మా ఇద్దరి విషయంలో సినిమాలు అన్నది జస్ట్ ఓ కామన్ పాయింట్ మాత్రమే. ఎవ్వరితో అయినా ఎమోషనల్ కనెక్టివిటీ కీలకం అని నమ్ముతాను నేను. బంధాలు కీలకం, నేను చాలా మందితో అలాగే వుండాలని కోరుకుంటాను.

-దిల్ రాజుగారితో కూడా.

అవును. ఆయన నాకు ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ. ఇది కావాలని క్రియేట్ చేస్తే రాదు. అలా దానంతట అది ఏర్పడాలంతే. దిల్ రాజు గారు నేను ఒకరి ఫ్యామిలీలో మరొకరు అన్నట్లుగా వుంటాం.

-కేటీఆర్ తో కూడా సాన్నిహిత్యం వున్నట్లుంది?

యా…ఇండస్ట్రీలోకి రాక ముందే కే టి ఆర్ నాకు మంచి మిత్రుడు. అన్నయ్యా అని పిలుస్తాను. అలాగే దేవీశ్రీప్రసాద్ కూడా. అసిస్టెంట్ డైరక్టర్ గా వర్షం సినిమాకు వర్క్ చేసినప్పటి నుంచే దేవీ నాకు మంచి మిత్రుడు. నిజానికి సోసైటీలో స్మార్ట్ ఫోన్ వచ్చాక, మనిషి ఒంటరి అయిపోతున్నాడు. పక్కన మనిషి వున్నా మాట్లాడకుండా ఫోన్ లో మాట్లాడుకుంటున్నాడు. ఆ విధంగా మనిషి ఒంటరి అయిపోతున్నాడు. ఇలాంటి టైమ్ లో ఆనందం, కష్టం ఏదైనా పంచుకునే వారు మనకంటూ కొందరు వుండాలి.  దీనిని నమ్ముతాను. 

-గ్యాసిప్ లు చదువుతుంటారా?

నేను ఏ వెబ్ సైట్ చదవను. ఇన్ స్టా, ట్విట్టర్ లో యాక్టివ్ గా వుండను.

-ప్రెండ్స్ చెబుతారేమో? సినిమా ఆగింది. సినిమా లేదు ఇలా ఏదో గ్యాసిప్ గురించి.

అది ఎలాగూ వుంటుంది. ఫోకస్ లో వుంటాం కాబట్టి అది తప్పదు. కానీ నా మైండ్ లోకి తీసుకోను. నెగిటివిటీని తీసుకుంటే పాజిటివిటీ తగ్గిపోతుంది. అందుకే అస్సలు పట్టించుకోను. నా దృష్టికి తేవద్దు అని చెబుతాను.

-లాస్ట్ క్వశ్చన్..ఎస్ ఆన్ నో చెప్పండి..మళ్లీ మేము మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ చూస్తామా?

ఎస్.అంతే….అంతకన్నా చెప్పలేను. అన్నీ కన్ ఫర్మ్ అయ్యాక నేనే చెబుతాను. నాకు కూడా మీకన్నా ఆసక్తిగా వుంది.

-థాంక్యూ

థాంక్యూ

..విఎస్ఎన్ మూర్తి