గోడ్సే వాదన – వందేమాతరం గీతాన్ని కొందరు ముస్లింలకు నచ్చలేదనే మిషపై తనకు వీలైన చోట్లలో గాంధీ ఆ పాటను పాడడం తక్షణమే నిలిపివేశాడు. 1905 వంగ విభజన వ్యతిరేక ఉద్యమంలో యీ గీతం ప్రత్యేకమైన ప్రాముఖ్యము, జనాదరణ పొందింది. బ్రిటిషు పాలకులు యీ పాటను కొంతకాలం నిషేధించారు. జాతీయ సమావేశాల్లో యీ పాట పాడటం కొనసాగుతూనే వుండింది. కానీ ఎప్పుడైతే ఒక్క ముస్లిం దీనికి ఆక్షేపణ తెలిపాడో ఆ క్షణం నుంచి గాంధీ దానిని పక్కకు పెట్టి దాన్ని జాతీయగీతంగా చేయాలని కాంగ్రెసు పట్టుబట్టకుండా చేశాడు. ఇప్పుడు వందేమాతరంకు బదులు జనగణమనను స్వీకరించమని మనకు చెప్తున్నాడు. గాంధీ హిందూ-ముస్లిం ఐక్యతకు అర్థమేమిటంటే లొంగిపోవడం, ఓడిపోవడం, ముస్లింలు కోరినదంతా యిచ్చేయడం అని మాత్రమే!
(వందేమాతరంకు ముస్లింల అభ్యంతరం ఏ విధంగా చూసినా సమంజసం కాదు. 1905 వంగ విభజన సమయంలో వందేమాతరం ప్రాముఖ్యత గురించి రాసిన గోడ్సే అప్పుడు ముస్లిములు కూడా దాన్ని ఆలపించారన్న సంగతి ఎందుకోకానీ ప్రస్తావించలేదు. హిందూ-ముస్లింలు వేరువేరు జాతులని జిన్నా ప్రకటించి కాంగ్రెసు విధానం ప్రతీదాన్ని వ్యతిరేకించిన రోజుల్లోనే వందేమాతరంకు అభ్యంతరాలు తెలపడం ప్రారంభమైందని నా వూహ. లోతుగా పరిశోధిస్తే తప్ప కచ్చితంగా చెప్పలేము. అసలు వందేమాతరం (అంటే తల్లికి నమస్కారం) భావనను ముస్లింలు మాత్రం ఎందుకు వ్యతిరేకించాలి అంటే దాన్ని ఒరిజినల్‌గా ''ఆనంద్ మఠ్'' అనే నవలలో అంతర్భాగంగా దేవీమాతను స్తుతిస్తూ రాసిన పాటగా రాశారు బంకించంద్ చటర్జీ. అందువలన ముస్లింలను పాడమని అడగడం భావ్యం కాదు. ఈ యిబ్బంది గుర్తించే ఆ పాటలో మొదటి రెండు చరణాలు మాత్రమే తీసుకుని ప్రస్తుతరూపాన్ని పాప్యులర్ చేశారు. ఇప్పుడున్న పాడుతున్న మేరకు తల్లిని పొగుడుతున్నట్లే వుంటుంది తప్ప మాతృభూమి అని కూడా వుండదు.
అయినా మాతృభూమికి మాతృరూపంగా మూర్తీభావన చేశారు కాబట్టి, ముస్లిములు మూర్తీభావనను వ్యతిరేకిస్తారు కాబట్టి వందేమాతరం వారికి ఆమోదయోగ్యం కాదా? అని కూడా ఆలోచించి చూశాను. అందరూ ఒప్పుకునే 'సారే జహాఁ సే అచ్ఛా..'లో హిందూస్తాన్‌ను పూదోటగా, పౌరులను పూలగా కవి పోల్చాడు కాబట్టి ఓకే అనుకుంటే, ముస్లింలు ఆమోదిస్తున్న జనగణమన అధినాయకుడు ఎవరు? – జనగణాల యొక్క మనసును శాసించే నాయకుణ్ని కీర్తిస్తున్నాం కదా, అది మాత్రం మూర్తీభావన కాదా? 'జనగణమన' పంచమ జార్జిని కీర్తిస్తూ రాసిన కవిత అనేది తప్పు. ఠాగూరు దేశభక్తి శంకించడానికి వీల్లేనిది. ఆయన కీర్తనలు, గీతాలు బ్రహ్మసమాజభావనలచేత, చైతన్యమహాప్రభు వైష్ణవగీతాల చేత ప్రభావితమయ్యాయి కాబట్టి, పురుషారాధన కనబడుతుంది. జనగణమన కూడా ఆ ఒరవడిలో రాసినదే. పురుష మూర్తీభావనను ఆమోదించి, స్త్రీ మూర్తీభావన అయిన వందేమాతరాన్ని నిరాకరించడం దేనికో ముస్లిముల తరఫు నుంచి సరైన వివరణ నేను యిప్పటిదాకా చదవలేదు. కాంగ్రెసు ఔనన్నదానినల్లా కాదంటూ జిన్నా వాళ్లను అన్ని రకాలుగా ముప్పుతిప్పలు పెట్టాడని చూశాం. వందేమాతరంను కాదనడం కూడా యిలాటి పేచీయే అనుకోవాలి. ఇప్పటికీ అనేక ముస్లిం సంఘాలు స్కూళ్లలో వందేమాతరం పాడడాన్ని వ్యతిరేకిస్తూనే వున్నాయి, ఎందుకో సహేతుకంగా చెప్పకుండానే! దీనివలన సాధారణ పౌరులకు సైతం వారి పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప సాధించేది ఏమీ లేదు.
ఇక గాంధీ మాటకు వస్తే – 'వీలైన చోట్లలో గాంధీ ఆ పాట పాడడం తక్షణమే నిలిపివేశాడు' అన్న గోడ్సే ఆరోపణ అస్పష్టంగా వుంది. నాకు తెలిసి సమావేశాల్లో వందేమాతరం ప్రారంభగీతంగా, జనగణమన ముగింపు గీతంగా పాడడం జరుగుతూనే వుంది. గాంధీ తన సమావేశాల్లో వందేమాతరం పాడించలేదనేది నమ్మశక్యంగా లేదు. ఆయన సమావేశాల్లో 'వైష్ణవ జన తే..', మీరా భజనలు వంటి అనేక హిందూ భక్తి గీతాలు పాడగా లేనిది వందేమాతరం పాడడానికి ఎందుకు జంకుతాడు? జాతీయగీతంగా వందేమాతరం బదులు జనగణమనను ఎంపిక చేయడంలో కాంగ్రెసు ముస్లింల మనోభావాలను లెక్కలోకి తీసుకుందనడంలో సందేహం లేదు. జిన్నా నాటిన విభజనబీజాలు లోతుగా వెళ్లిపోయిన తర్వాత, ఏడాదిగా మతకల్లోలాలతో దేశం అతలాకుతలం అయిపోయాక వందేమాతరంను బలవంతంగా రుద్ది ముస్లింలతో వైరం కొని తెచ్చుకోవడం దేనికి అని కాంగ్రెసు అనుకుని వుండవచ్చు. హిందువులు వందేమాతరంను, ముస్లిములు సారే జహాఁ సే అచ్ఛా ను ప్రతిపాదించగా రాజీమార్గంగా జనగణమనను ఎంచుకున్నారేమో కూడా తెలియదు. ఈ నిర్ణయాన్ని గాంధీ నెత్తిన రుద్దడం అనవసరం. గాంధీ చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెసు ముస్లింలకు అనేక కన్సెషన్లు యిస్తూనే వుంది. వాళ్లని ఓటుబ్యాంకుగా చూస్తూ ముస్లింలలో ఛాందసవాదులు ఏదైనా డిమాండ్ చేస్తే వెంటనే తలవొగ్గుతోంది. అందుకే ఉదారవాద ముస్లిములు ఎప్పుడూ బలహీనంగానే వుంటున్నారు. వారిని బలపరిచే ప్రయత్నం కాంగ్రెసే కాదు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా చేయడం లేదు. – వ్యా.)
గోడ్సే వాదన – శివాజీ అమేయమైన శక్తిని, హిందూ ధర్మానికి ఆయన కల్గించిన రక్షణను స్తుతిస్తూ రాసిన 52 పద్యాల సంపుటి ''శివభవాని''ని బహిరంగంగా చదవడాన్ని, గానం చేయడాన్ని గాంధీజీ నిషేధించాడు. పద్యంలోని చివరి లైను 'శివాజీ జో న హోతే తో సున్నత్ హోతీ సబ్‌కీ' – (శివాజీ లేకపోయి వుంటే అందరికీ సున్తీ అయి వుండేది) అనేది సమకాలీన చరిత్రలో లక్షలాది ప్రజలకు సంతోషదాయకం.
(హిందూత్వవాదులు, ఆరెస్సెస్, హిందూ మహాసభ వారు విజయనగర సామ్రాజ్యాన్ని, శివాజీని హిందూమత పరిరక్షకులుగా, మహమ్మదీయులతో నిరంతరం పోరాడినవారిగా చిత్రీకరిస్తారు. వాస్తవం ఏమిటంటే యిప్పటి పాలకులలాగే అప్పటి రాజులు సైతం జనాల్ని తనవైపు సంఘటితం చేసుకోవడానికో, ఎదుటివారిపై పురికొల్పడానికో కొన్ని సందర్భాల్లో మతాన్ని ఉపయోగించుకున్నారు, ఎదుటి మతస్తులను వాటేసుకున్న సందర్భాలూ వున్నాయి. మొదటగా విజయనగర సామ్రాజ్యం గురించి – దాని మొట్టమొదటి రాజైన హరిహరరాయలు బహమన్‌షాకు సైన్య సహాయం చేశారు. బహమనీ రాజ్యం ఏర్పడడానికి కారణభూతుడయ్యాడు. 1426 నుండి 1446 వరకు పాలించిన రెండవ దేవరాయలు తన సైన్యంలో ముస్లిం విలుకాండ్రను చేర్చుకుని వాళ్ల సహాయంతో సాటి హిందూ రాజులైన కొండవీటి రెడ్డి రాజుల్నీ, కటకం గజపతుల్నీ ఓడించాడు. బహమనీ సుల్తాన్ మీద తిరుగుబాటు చేసిన అతని తమ్ముడికి సైన్య సహాయం చేసేడు. ఇలాటివే కాదు, పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇక 1406లో రెండవ దేవరాయలు తన కూతుర్ని బహమనీ రాజుకిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కొడుకు గుల్బర్గా వాడు. అప్పుడు పెళ్లివేదికకు ఆరుమైళ్ల దూరందాకా జరీగుడ్డ పరిచారట. రెడ్ కార్పెట్ వెల్‌కమ్ అంటారు చూశారా, అలాటిదన్నమాట.
ఇక శివాజీ విషయానికి వస్తే – అతని తండ్రి శహాజీ అహ్మద్‌నగర్ నవాబ్ వద్ద ఉద్యోగి. ముస్లిం దగ్గర పనిచేయడమేమిటని అనుకోలేదు. జహంగీరు మరణానంతరం అతని భార్య అయిన నూర్జహాన్ తన అల్లుణ్ని గద్దె కెక్కించాలని చూసింది. జహంగీరు కొడుకు షాజహాన్‌కి అహ్మద్‌నగర్ సుల్తాన్ సాయపడ్డాడు. అతనితో బాటే మాలిక్ అంబర్, శహాజీ కూడా! షాజహాన్ దక్కన్‌లో వుండగా శహాజీ అతనివద్ద మన్సబ్‌దార్‌గా చేరాడు. షాజహాన్‌కి ఢిల్లీ గద్దె లభించి దక్కన్ విడిచి పెట్టాక మాలిక్ అంబర్, యీయనా మళ్లీ అహ్మద్‌నగర్ నవాబ్‌ను ఆశ్రయించారు. తండ్రిమాట సరే, శివాజీ ముస్లిములను ద్వేషభావంతో చూశాడా? లేదే! ఆయన సైన్యంలో ముస్లిములు వున్నారు. ముల్లా హైదర్ ఆయన ఆంతరంగిక కార్యదర్శి. ఇబ్రహీం ఖాన్, దౌలత్‌ఖాన్, సిద్దీ మిశ్రీ ఆయన నౌకాదళ కమాండర్లు. యుద్ధానికి వెళ్లినపుడు మసీదులను ధ్వంసం చేయలేదు. పైగా రాయగఢ్ రాజభవనం ఎదుట ఓ మసీదు కట్టించాడు. మహమ్మదీయ స్త్రీలను చెరపట్టలేదు. ఓ సారి కళ్యాణ్ మీద జరిగిన యుద్ధంలో సుబేదార్ కోడల్ని ఖైదుచేసి సైనికులు తనకు కానుకగా సమర్పించబోతే వాళ్లను తిట్టాడు. 'నా తల్లే యింత అందంగా వుంటే, నా అందం యిలా వుండేది కాదు' అని ఆమెలో మాతృమూర్తిని దర్శించి ఆమెను సగౌరవంగా యింటికి పంపేశాడు. అంతేకాదు, కురాన్ కనబడితే అపవిత్రం చేయవద్దని హిందువులతో సహా అందరికీ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ యిచ్చాడు. ఒకవేళ తన చేతికి కురాన్ వస్తే తన సైన్యంలో ముస్లిములకు యిచ్చేసేవాడు. రాజకీయంగా అవసరమైనప్పుడు ముస్లిములతో చేతులు కలిపాడు. కుతుబ్ షా సుల్తాన్‌తో పొత్తు కుదుర్చుకుని తన సవతి తమ్ముడైన వెంకోజీ భోంస్లేపై దండెత్తాడని మనం గుర్తుంచుకోవాలి.
అలాటివాడు ముస్లిములను పొడిచేశాడని, హిందువులకు ఊడబొడిచేశాడని అనుకోవడం వెర్రితనం. శివాజీయే కాదు, శివాజీ వారసులు కూడా ముస్లిములతో సఖ్యంగా వున్న సందర్భాలూ వున్నాయి.శివాజీ మొగలాయీలతో కలిసి బిజాపూర్ సుల్తాన్‌పై దాడి చేశాడు. శివాజీ కొడుకు శంభాజీ ఔరంగజేబు కొడుక్కి ఆశ్రయం యిచ్చాడు తెలుసా? ఇక్కడ మనం గ్రహించవలసినదేమిటంటే రాజులకు కావలసినది అవతలి వాడు హిందువా, ముస్లిమా, పోర్చుగీసా, ఇంగ్లీషా అని కాదు. వాడు మనకు మిత్రుడా, శత్రువా అన్నదే ముఖ్యం. అందులో కూడా శాశ్వత మిత్రత్వం వుండదు. ఇవాళ సంధి చేసుకుని మర్నాడే కత్తులు దూయవచ్చు. తనను 'రాజు'గా గుర్తించమని శివాజీ ఔరంగజేబుకు అభ్యర్థన పంపుకున్నాడంటే దాని అర్థం – జీవితమంతా ఔరంగజేబు అడుగులకు మడుగులు ఒత్తాడనా? వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అనా? అబ్బే, ఆ సమయంలో శివాజీ తగ్గి వున్నాడు అని అర్థం.
అలాటి శివాజీని తమ రాజకీయ అవసరాల కోసం ముస్లింలను నాశనం చేసేవాడిగా చూపడం అన్యాయం. ''శివభవాని'' గురించి నాకు ఏమీ తెలియదు. కానీ ఆఖరి పాదం మాత్రం తప్పకుండా అభ్యంతరకరం. దీన్ని హిందూమహాసభ సమావేశాల్లో గానం చేసేవారేమో తెలియదు కానీ సాధారణ సమావేశాల్లో చదవడం మాత్రం ఎబ్బెట్టుగానే వుంటుంది. దీన్ని బహిరంగంగా చదవడాన్ని గాంధీ నిషేధించాడనడం హాస్యాస్పదంగా వుంది. ఆయన ప్రభుత్వాధికారి కాదు. తను వున్న సమావేశాల్లో చదువుతానని ఎవరైనా వంటే వద్దనడం సహజం. 'ఈశ్వర్ అల్లా తేరో నామ్' అని పాడుతూ మధ్యలో యిలాటి పాటలు కూడా పాడితే అందరినీ కలుపుకుని పోవడం ఎలా? – వ్యా) – (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)