గోడ్సే వాదన – ''సుహ్రవర్దీకి ఆదరణ'' – వేవెల్ నెహ్రూను ఆహ్వానించి ఏర్పాటు చేయమని కోరిన తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగు చేరడానికి నిరాకరించి ప్రత్యక్షచర్య జరపడానికి తీర్మానం పాస్ చేసింది. 1946 ఆగస్టు 16 న కలకత్తాలో బహిరంగంగా హిందువుల సామూహిక సంహారం చెలరేగి మూడు దినాల పాటు అడ్డూ ఆపూ లేకుండా సాగింది. కలకత్తా పోలీసులు ఆపడానికి ఎలాటి ప్రయత్నమూ చేయలేదు. ఇలా అయినా గాంధీ కలకత్తాకు పోయి జరిగిన జన సంహారానికి కారణభూతుడైన వానితో వింత చెలిమి ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి ఆయనే ముస్లిం లీగు సుహ్రవర్దీ పక్షాన కలుగజేసుకున్నాడు. సుహ్రవర్దీని ఆత్మత్యాగ వీరుడని బహిరంగంగా వర్ణించినాడు. ఇట్టి స్థితిలో రెండు నెలల తర్వాత నవ్‌ఖాలీ, తిప్పెరాలలో కనీవినీ ఎరుగనంత ఎత్తున ముస్లిం దౌర్జన్యాలు చెలరేగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆర్యసమాజం యిచ్చిన లెక్క ప్రకారం 30 వేల మంది హిందూ స్త్రీలు ఇస్లాం లోకి బలవంతంగా మార్చబడ్డారు. మూడు లక్షల మంది హిందువులు చంపబడడమో, తీవ్రంగా గాయపడడమో జరిగింది. అప్పుడు గాంధీ పెద్ద ఆడంబరంతో నవ్‌ఖాలీ జిల్లాలో ఒంటరిగా పర్యటన చేయడానికి పూనుకున్నాడు. కానీ ఆయన ఎక్కడకు పోయినా గట్టి రక్షణను సుహ్రవర్దీ ఏర్పాటు చేయడం బహిరంగ రహస్యమే. అంత రక్షణ ఏర్పాట్లలో కూడా గాంధీ ఆ నవ్‌ఖాలీ జిల్లాలో ప్రవేశించడానికి సాహసించ లేకపోయాడు. ఈ అత్యాచారాలన్నీ సుహ్రవర్దీ ప్రధానమంత్రిగా వున్నవుడే జరిగాయి. అట్టి న్యాయహీనుడు, మతోన్మాద విషపూరితుడు ఐన రాక్షసుడికి గాంధీ కోరకుండానే ఆత్మత్యాగవీరుడు అని బిరుదప్రదానం చేశాడు.''
(ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆ నాటి పరిస్థితులు, అప్పటి పాత్రధారుల గురించి కక్షుణ్ణంగా తెలుసుకోవాలి. తూర్పు బెంగాల్‌లో 1946 ఆగస్టులో జిన్నా జరిపించిన మారణకాండ కారణంగానే దేశవిభజన అనివార్యమైంది. జిన్నా తరఫున ఆనాడు బెంగాల్ ముఖ్యమంత్రిగా (అప్పట్లో రాష్ట్రముఖ్యమంత్రులను ప్రధానమంత్రి అనేవారు) వున్న సుహ్రవర్దీ యీ అల్లర్లను జరిపించాడు. శాంతి నెలకొల్పడానికి గాంధీ చేసిన ప్రయత్నాలను విమర్శించాడు. కానీ 1947 ఆగస్టులో ఎప్పుడైతే హిందువులు తిరగబడి ముస్లిములను వూచకోత కోయడం మొదలుపెట్టారో అప్పుడు గాంధీని పిలిపించి శాంతి నెలకొల్పమని ప్రార్థించాడు. గాంధీ కారణంగానే బెంగాల్‌లో అల్లర్లు చల్లారాయి. పంజాబ్‌లో గాంధీ వంటి వ్యక్తి లేనందున అల్లర్లు కొనసాగాయి. పంజాబ్, సింధు రాష్ట్రాలు విభజన సమయంలో దారుణంగా నష్టపోయాయి. ఇవి 1946 ఆగస్టు నుండి 1948 జనవరి వరకు జరిగిన సంఘటనలు. వీటిని ఒక వరుసలో పేర్చుకుంటూ వస్తే తప్ప ఏది ఎందుకు జరిగిందో అర్థం కాదు.
దీనిలో ప్రధానంగా ప్రస్తావించబడిన సుహ్రవర్దీ పేరు యిప్పుడు ఎవరికీ తెలియదు. అందువలన అతని గురించి ముందుగా చెప్తాను. హుస్సేన్ షహీద్ సుహ్రవర్దీ బెంగాల్‌కు చెందిన స్వాతంత్య్ర యోధుడు. చిత్తరంజన్ దాస్ శిష్యుడు. ఉన్నత కుటుంబంలో పుట్టి ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకుని 1921లో ఇండియాకు తిరిగి వచ్చి బారిస్టర్‌గా పనిచేస్తూ కాంగ్రెసులోంచి చీలి వచ్చిన చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు, మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్ పార్టీలో చేరాడు. చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత, బెంగాల్‌లో జిన్నా ప్రాభవం పెరుగుతూండడం గమనించి ముస్లిం లీగులో చేరాడు. ఖ్వాజా నజీముద్దీన్ ప్రభుత్వంలో లేబరు మంత్రిగా, సివిల్ సప్లయిస్ మంత్రిగా పనిచేశాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో చర్చిల్ నాయకత్వంలోని బ్రిటిషు ప్రభుత్వం జపాన్ ఇండియా తీర్పు తీరంపై దండెత్తుతుందని అంచనా వేసి బెంగాల్‌లో ముస్లిం లీగు ఆధ్వర్యంలోని ప్రభుత్వం సహాయం కోరింది. శత్రు సైన్యం దండెత్తి వస్తూంటే వారికి తిండి దొరక్కుండా తమ గ్రామాలలోని పంటలనే తగలబెట్టేస్తారు. దీన్ని స్కార్చ్‌డ్ ఎర్త్ పాలసీ అంటారు. జపాన్ సైన్యం తూర్పుతీరంలోకి రాకుండా వేలాది చేపల పడవలను తగలబెట్టమని, రేవుల్లోకి నౌకలు రాయకుండా దారి మూసేయమని బ్రిటన్ చెప్పింది. బ్రిటిషు వారితో స్నేహం కోరుకునే ముస్లిం లీగు వారు చెప్పినట్లే నడుచుకుంది. దీని వలన 1943లో ఏర్పడిన బెంగాల్ కరువులో ఆహారధాన్యాలు అందక లక్షలాది మంది మరణించారు. ఆ చావులకు సివిల్ సప్లయిస్ మంత్రిగా వున్న సుహ్రవర్దీనే అందరూ తప్పుపట్టారు.
కొన్ని రోజులకు ముస్లిం లీగులో ఛాందసవాదానికి ప్రతినిథులుగా నజీముద్దీన్ నిలిస్తే ప్రగతివాదానికి ప్రతినిథిగా సుహ్రవర్దీ నిలిచాడు. మతపరంగా పంజాబ్, బెంగాల్ రెండేసి ముక్కలవుతాయని స్పష్టం కావడంతో అతను కంగారుపడ్డాడు. బెంగాల్ మొత్తమంతా పాకిస్తాన్‌కే యిస్తారనుకున్నానని తర్వాత చెప్పుకున్నాడు. అప్పటికే మతపరమైన అల్లర్ల తడాఖా రుచి చూశాడు కాబట్టి బెంగాల్‌ను విడగొట్టడం అతనికి సమ్మతం కాలేదు. సుభాష్ చంద్ర బోసు అన్నగారైన శరత్ చంద్రబోసు, యింకా కొందరు హిందూ ముస్లిము బెంగాలీ నాయకులతో కలిసి మొత్తం బెంగాల్‌ను విడి దేశంగా చీల్చి దాన్ని బెంగాలీ కాంగ్రెసు, బెంగాలీ ముస్లిం లీగు కలిసి సంయుక్తంగా పాలించాలని ఒప్పందం చేసుకున్నాడు. సుహ్రవర్దీ 1947 ఏప్రిల్ 27న ఢిల్లీలో ఇండియా, పాకిస్తాన్‌లతో బాటు అవిభక్త బెంగాల్‌ను విడివిడి దేశాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రకటన చేశాడు. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
దేశవిభజన జరిగింది. తూర్పు బెంగాల్ తూర్పు పాకిస్తాన్‌గా మారింది. ముస్లిం లీగు పార్టీ పూర్తిగా ఛాందసవాదంలో మునిగిందని భావించి అతను ఆ పార్టీని వదిలేసి వామపక్ష భావాలతో ఏర్పడిన అవామీ లీగ్‌లో చేరాడు. మౌలానా భషానీ, ఫజుల్ హక్‌లతో కలిసి 1954 ఎన్నికలలో యుక్తా అనే పేర ఫ్రంట్ ఏర్పరచి ముస్లిం లీగును చిత్తుగా ఓడించాడు. పశ్చిమ పాకిస్తాన్‌లోని రిపబ్లికన్ పార్టీతో చేతులు కలిపి 1956లో పాకిస్తాన్‌లో సంయుక్త ప్రభుత్వం ఏర్పరచి యితను అవిభక్త పాకిస్తాన్‌కు 5వ ప్రధానమంత్రిగా అయ్యాడు. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌ల మధ్య వున్న ఆర్థికవ్యత్యాసాన్ని సవరించబూనడం, మిలటరీని నియంత్రించడం, ప్రయివేటు సంస్థలను జాతీయకరణ చేయడం వంటి చర్యలు చేపట్టడంతో మిలటరీ యితన్ని 1957 అక్టోబరులో అధ్యకక్షుడిగా వున్న ఇస్కందర్ మీర్జాతో చెప్పి పదవి నుంచి దింపేసింది. జనరల్ ఆయూబ్ ఖాన్ యితన్ని రాజకీయాల్లో పాల్గొనకుండా బహిష్కరించాడు. చివరకు మాతృదేశానికి దూరంగా 1963లో బీరట్‌లో 71 వ యేట మరణించాడు. హింసామార్గాలతో పాకిస్తాన్ ఆవిర్భావానికి దోహదపడి, చివరకు పాకిస్తాన్‌లో ఏర్పడిన హింసాత్మక సైనికపాలనకే బలి అయ్యాడు. ఇదీ సుహ్రవర్దీ జీవితం గురించి క్లుప్త పరిచయం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)