ఒత్తిడి టీమిండియా మీదనే.!

మ్యాచ్‌ జరిగేది ఆస్ట్రేలియాలోనే అయినా, సిడ్నీ మైదానంలో ఎక్కువగా కనిపించబోయేది భారత క్రికెట్‌ అభిమానులే. ఇది టీమిండియాకి పెద్ద అడ్వాంటేజ్‌. అలాగని, స్వదేశంలో తమ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు మద్దతు పలకరనీ కాదు,…

మ్యాచ్‌ జరిగేది ఆస్ట్రేలియాలోనే అయినా, సిడ్నీ మైదానంలో ఎక్కువగా కనిపించబోయేది భారత క్రికెట్‌ అభిమానులే. ఇది టీమిండియాకి పెద్ద అడ్వాంటేజ్‌. అలాగని, స్వదేశంలో తమ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు మద్దతు పలకరనీ కాదు, వారి మద్దతు తక్కువగా వుంటుందనీ అనుకోలేం.

న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌నే తీసుకుంటే, మ్యాచ్‌ చివరి క్షణాల్లో న్యూజిలాండ్‌కి సపోర్టర్స్‌ ఎక్కువగా కన్పించారు. ‘కమాన్‌ న్యూజిలాండ్‌..’ అంటూ అభిమానులు తమ జట్టుకు కావాల్సినంత ఎనర్జీ ఇచ్చారు. ఇక్కడా సౌతాఫ్రికా అభిమానుల సందడి వున్నా, న్యూజిలాండ్‌ సపోర్టర్స్‌ ముందు వారు వెలవెలబోయారనే చెప్పాలి.

2015 వరల్డ్‌ కప్‌ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ రెండు జట్లలో న్యూజిలాండ్‌ ఫైనల్‌కి దూసుకెళ్ళగా, ఆస్ట్రేలియా 26న టీమిండియాతో తలపడి, ఫైనల్‌లో అడుగు పెట్టాలని చూస్తోంది. అంటే, దాదాపుగా కప్‌, ఆతిథ్య దేశాల్లో ఏదో ఒకదానికి దక్కే అవకాశాలు మెరుగ్గా వున్నాయన్నమాటే కదా. ఆ లెక్కన ఒత్తిడి టీమిండియాపై గట్టిగానే వుండబోతోందన్నమాట.

సిడ్నీలో మ్యాచ్‌ టీమిండియాకి అనుకూల ఫలితాన్నిస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్తుండడం గమనార్హం. పిచ్‌ స్పిన్‌కి అనుకూలిస్తుందని చెబుతున్నారు వారంతా. ఆస్ట్రేలియా కెప్టెన్‌ క్లార్క్‌ కూడా ఇదే విషయం చెబుతున్నప్పటికీ, టీమిండియా ముందస్తు సంబరాల్లో మునిగి తేలడానికి వీల్లేదు. ఏమో, సిడ్నీ పిచ్‌ ఎలా వుంటుందో ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టం. మైదానం ఇలా వుంటుంది, అలా వుంటుంది.. అన్నవి కేవలం ఊహాగానాలు మాత్రమే.

ఇక, ఆస్ట్రేలియా ` టీమిండియా మ్యాచ్‌ అంటే ‘దాయాదుల పోరు’ని తలపిస్తుందన్నది కాదనలేని వాస్తవం. సెమీస్‌లోకి వచ్చిన నాలుగు జట్లలో రెండు ఔట్‌ సైడర్స్‌. అవే టీమిండియా, సౌతాఫ్రికా. రేసులోంచి సౌతాఫ్రికా బయటకు వెళ్ళిపోయింది. మిగిలినవి మూడు జట్లు. అందులో ఒకటి ఔట్‌ సైడర్‌ అయినప్పటికీ, టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌. పైగా ఈ టోర్నమెంట్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి, ఘనవిజయాల్ని అందుకుంది.

ట్రాక్‌ రికార్డ్‌ ఎలా వున్నా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో టీమిండియా ఎంతో కొంత ఒత్తిడికి గురవక తప్పద సెమీస్‌లో. ఆ ఒత్తిడిని అధిగమిస్తే, ఆస్ట్రేలియాని టీమిండియా ఇంటి బాట పట్టించే అవకాశముంది. సౌతాఫ్రికాలా ఒత్తిడికి తలొగ్గితే మాత్రం, టైటిల్‌ ఫైట్‌ ఆతిథ్య దేశాల మధ్యే జరుగుతుంది. చూద్దాం.. ధోనీ సేన ఒత్తిడిని జయించేందుకు ఏం చేస్తుందో, కప్‌ గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతుందో.!