కన్నీరు మున్నీరైన సౌతాఫ్రికా ఆటగాళ్ళు

ఆటలో గెలుపోటములు సహజం. కానీ, దురదృష్టం ఎప్పుడూ తమనే వెంటాడుతోంటే, ఆటగాళ్ళలో మానసిక స్థయిర్యం దెబ్బ తింటుంది. సౌతాఫ్రికా విషయంలోనూ అదే జరిగింది. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఎప్పుడూ సౌతాఫ్రికాకి ఇబ్బందికర పరిస్థితులే. వర్షం దెబ్బ…

ఆటలో గెలుపోటములు సహజం. కానీ, దురదృష్టం ఎప్పుడూ తమనే వెంటాడుతోంటే, ఆటగాళ్ళలో మానసిక స్థయిర్యం దెబ్బ తింటుంది. సౌతాఫ్రికా విషయంలోనూ అదే జరిగింది. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఎప్పుడూ సౌతాఫ్రికాకి ఇబ్బందికర పరిస్థితులే. వర్షం దెబ్బ కొట్టడమో, ఇతరత్రా కారణాలో.. వరల్డ్‌ కప్‌లో మాత్రం సౌతాఫ్రాకికి చేదు అనుభవమే ఎదురవుతోంది.

తాజాగా న్యూజిలాండ్‌ చేతిలో సౌతాఫ్రికా పరాజయం పాలయ్యింది. అదీ సెమీస్‌లో. నరాలు తెగే ఉత్కంఠ నడుమ, ఒత్తిడిని న్యూజిలాండ్‌ జయిస్తే, ఒత్తిడిని తట్టుకోలేక సౌతాఫ్రికా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్‌ వన్‌ సైడెడ్‌గా జరిగినా సౌతాప్రికా ఇంత ఆవేదన చెందేది కాదేమో.

2 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో, న్యూజిలాండ్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించగానే, సౌతాఫ్రికా ఆటగాళ్ళు మైదానంలో కుప్పకూలిపోయారు. కొందరైతే ఏడ్చేశారు. న్యూజిలాండ్‌ అభిమానులు కాస్సేపు సంబరాలు చేసుకున్నా, సౌతాఫ్రికా ఆటగాళ్ళ ఆవేదన చూసి చలించిపోయారు. ఈ వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కానీ, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కి చేరలేకపోయింది.

పోన్లే.. అని సరిపెట్టుకోడానికి వీల్లేదు. ఇంకో నాలుగేళ్ళు వరల్డ్‌ కప్‌ పోటీల కోసం సౌతాఫ్రికా ఎదురు చూడాల్సిందే. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్న స్లోగన్‌తో సౌతాఫ్రికా, వరల్డ్‌ కప్‌ పోటీల బరిలో దిగింది. డివిలియర్స్‌, దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ తన టీమ్‌ని ముందుకు నడిపించాడు. అందుకేనేమో, మిగతా జట్టు సభ్యుల్ని ఓదార్చడం మాటెలాగున్నా, ఆయనే ఎక్కువగా.. బోరున విలపించేశాడు.

ఆటలో గెలుపోటములు సహజం. సౌతాఫ్రికా పోరాట పటిమ, మిగతా జట్లకు స్ఫూర్తినిస్తుంది. ఇక, మైదానంలో సౌతాఫ్రికా ఆటగాళ్ళ ఫీల్డింగ్‌ నభూతో నభవిష్యతి. చివర్లో ఒత్తిడి కారణంగా క్యాచ్‌లు, రనౌట్లు మిస్‌ అయినా, ఫీల్డింగ్‌ విషయంలో సౌతాఫ్రికాదే ఎప్పటికీ టాప్‌ ప్లేస్‌.