గుజరాత్‌లో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేర 182 మీటర్ల ఎత్తున సర్దార్ పటేల్ విగ్రహం కడుతున్నారని అందరికీ తెలుసు. ఆంధ్ర రాజధానికి డబ్బులడిగితే లేవంటారు, (ప్లాను వచ్చాక చూద్దామంటారు. పిండి ఎంత వుందో చెపితే దాని ప్రకారం రొట్టె సైజు ప్లాను చేయవచ్చు. నాలుగు లక్షల కోట్ల బజెట్‌తో ప్రాజెక్టు రిపోర్టు పట్టుకుని వస్తే ఏ వెయ్యి కోట్లో విదిలించి సర్దుకోమంటే…?) పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు చాలంటారు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు విదల్చరు. కానీ యీ ప్రాజెక్టును మాత్రం రూ. 2989 కోట్ల వ్యయంతో తలపెట్టారు. 2018 కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో బజెట్‌లో కేటాయింపులు కూడా భారీగానే చేస్తున్నారు. ఎందుకు అంటే దాన్ని టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేస్తారట. అక్కడ ఒక మ్యూజియం, స్మారక ఉద్యానవనం, కన్వెన్షన్ సెంటరు, 'శ్రేష్ఠ భారత్ భవన్' పేరుతో 128 గదుల మూడు నక్షత్రాల హోటలు కడతారు. విగ్రహం చుట్టూ ఒక సరస్సు కూడా వుంటుంది. హుస్సేన్ సాగర్ అప్పటికే వుంది కాబట్టి మధ్యలో బుద్ధవిగ్రహం పెట్టారు. ఇప్పుడు విగ్రహం పెట్టి చుట్టూ 12 కి.మీ.ల కృత్రిమ సరస్సు ఏర్పాటు చేస్తారట. దానిలో బోట్లో తిరుగుతూ విగ్రహాన్ని చూడవచ్చు. లిఫ్ట్‌లో విగ్రహం పైకి వెళ్లి అక్కణ్నుంచి పరిసరాలు పరికించవచ్చు. ఐడియా బాగానే వుంది కానీ యీ సరస్సుకి నీళ్లు ఎక్కణ్నుంచి వస్తాయి? సర్దార్ సరోవర్ డ్యామ్ నుండి నీళ్లు యిటు లాగాలి. లాగి అక్కడే నిలవ వుంచాలంటే నదికి అడ్డుగా ఒక అడ్డుకట్ట (సాంకేతికంగా వియర్ అంటారు) కట్టి నీటిమట్టం పెంచాలి. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కడదామనుకున్నపుడు అక్కడ కట్టబోయే జలవిద్యుత్ ప్రాజెక్టు 12 కి.మీ.ల దిగువన గరుడేశ్వర్ వద్ద అడ్డుకట్ట కట్టి నీళ్లను ఆపి మళ్లీ దాన్ని ఆ ప్రాజెక్టులోకి తోడుదామని అనుకున్నారు కానీ అది కార్యరూపం ధరించలేదు. 1980లలో ప్రాజెక్టు రూపు దిద్దుకుంటున్నపుడు యీ అడ్డుకట్టకు అనుమతులు తీసుకోలేదు. పర్యావరణంపై, ప్రాజెక్టు పటిష్టతపై దాని ప్రభావాన్ని అంచనా వేయించలేదు. ప్రాజెక్టు అయిన తర్వాత దీని సంగతి విడిగా చూద్దామనుకున్నారు. అందువలన 1987లో ప్రాజెక్టుకు యిచ్చిన అనుమతిలో దీని ప్రస్తావన లేదు. ఇప్పుడు యీ విగ్రహం చుట్టూ చెఱువు ఐడియా రాగానే ఆ అడ్డుకట్ట ప్రతిపాదన దుమ్ము దులిపారు.
ఆ అడ్డుకట్ట కడితే 11 గ్రామాలు మునిగి, 11 వేల మంది గిరిజనులు నిర్వాసితులవుతారు. వారి పునరావాసం పెద్ద సమస్య. పైగా యిప్పుడు భూమి అడిగితే వాళ్లు యిచ్చేట్లు లేరు. అందువలన పాత రికార్డులు తీసి చూశారు. 1961లో సర్దార్ ప్రాజెక్టు రూపకల్పన చేసినపుడు ఎందుకైనా మంచిదని చాలా వూళ్లకు అధికారులు వెళ్లి 'మేం మీకు పరిహారం యిచ్చి భూములు తీసేసుకుంటాం.' అని చెప్పారు. ఈ వూళ్లలోనూ అలాగే చెప్పారు. కానీ తర్వాత అవసరం పడకపోవడంతో యిటువైపు రాలేదు. ఇప్పుడు యీ విగ్రహం చెఱవుకోసం అవసరం పడింది కాబట్టి 'అప్పుడెప్పుడో ఖాళీ చేయమని మీకు చెప్పాం కదా, యిప్పటికైనా వెళ్లిపోండి' అంటున్నారు. 'అప్పుడు మీరు అడిగినది సర్దార్ ప్రాజెక్టు కోసం. అది కట్టేయడం జరిగిపోయింది. మీరు యిప్పుడు వచ్చి మా స్థలాల్లో త్రీ స్టార్ హోటలు కడుతూ, 500 కార్ల పార్కింగ్ స్థలం కోసం మమ్మల్ని యిళ్లు ఖాళీ చేయమంటే ఎందుకు చేస్తాం?' అని వీళ్లు ఎదురు తిరిగారు. 'ఎలా వుపయోగించుకుంటామో మీ కనవసరం. అప్పుడు మీరు ఒప్పుకున్నారు, ఖాళీ చేయాల్సిందే' అని వీరు… 'ఒప్పుకున్నట్లుగా మీ దగ్గర పత్రాలు వున్నాయా? మాకు నష్టపరిహారం యిచ్చినట్లు ఋజువులు చూపించగలరా?' అని గిరిజనులు.. అడుగుతున్నారు. అధికారులు తెల్లమొహం వేస్తున్నారు. ఇబ్బంది ఏమిటంటే భూసేకరణ చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు పేరు చెప్పయినా భూమి తీసుకుంటే, పదేళ్ల వరకే గడువు. పదేళ్లలో పూర్తి చేయకపోతే భూమి తిరిగి యిచ్చేయాల్సిందే. పూర్తయిన సర్దార్ ప్రాజెక్టు పేరుతో యిప్పుడు భూములడిగితే నర్మద కంట్రోలు అథారిటీ చట్టం ప్రకారం చెల్లదు. 1961 తర్వాత అధికారులు పరిహారం యివ్వనే లేదు. ఆ భూములు, యిళ్లు ఆ గిరిజనుల పేరే వున్నాయి. వాళ్లు యింటి పన్ను కడుతున్నారు, విద్యుత్ బిల్లులు కడుతున్నారు. 55 ఏళ్ల తర్వాత వచ్చి మీరు ఆక్రమణదారులు అంటే వాళ్లెందుకు ఒప్పుకుంటారు? 'మీకు వేరే చోట స్థలాలు యిస్తాం' అంటే వాళ్లు '15 కి.మీ.ల దూరంలో రాళ్లూ రప్పలు వున్నచోట, 1980లలో పునరావాస కార్యక్రమాలు చేపట్టినపుడు ఎవ్వరికీ అక్కరలేని స్థలాలు చూపించి వెళ్లమంటారా? మేం వెళ్లం' అంటున్నారు.
వారి తరఫున సామాజిక కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తలు, మానవహక్కుల కార్యకర్తలు అందరూ రంగంలోకి దిగి, కేసులు పెడుతున్నారు. ఈ సర్దార్ పటేల్ విగ్రహం ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు రాలేదు. డ్యామ్‌కు పక్కగా అంత పెద్ద విగ్రహం, వేలాది మంది టూరిస్టులు వచ్చిపోయేట్లా నిర్మిస్తే డ్యామ్ సురక్షితంగా వుంటుందో లేదోనన్న భయాలూ వున్నాయి. ఈ అడ్డుకట్ట పొడవు ఎంతో కూడా యిప్పటిదాకా తేల్చలేదు. పునరావాసం అనేది ఎక్కడైనా చికాకు పెడుతోంది. జాతీయప్రయోజనాల పేరు చెప్పి భూమి లాక్కుంటే అదో అందం. కానీ హోటల్ కోసమంటూ లాక్కుంటూంటే వాళ్లెందుకు వూరుకుంటారు? ఇంత పెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వున్నాయా అని రోహిత్ ప్రజాపతి అనే పర్యావరణవేత్త సమాచార హక్కు కింద అడిగితే గుజరాత్ ప్రభుత్వం 'కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20 వేల చ.మీ.ల స్థలం కంటె ఎక్కువ స్థలంలో కట్టే ప్రాజెక్టులకే అనుమతి కావాలి. ఇది అంతకంటె తక్కువ కాబట్టి అక్కరలేదు! విగ్రహం ఎత్తు, బరువు ఎంతున్నా అనుమతులు తీసుకోనక్కరలేదు.' అని జవాబిచ్చింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)