కివీస్‌ ఫైనల్‌కి.. సౌతాఫ్రికా నిరాశే

వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకోవాలని కలలుగన్న సౌతాఫ్రికాకి నిరాశే మిగిలింది. సెమీస్‌లో ఒత్తిడి తట్టుకోలేక పరాజయం పాలైంది సౌతాఫ్రికా. ఇక, సౌతాఫ్రికాపై గెలిచేందుకు చెమటోడ్చింది న్యూజిలాండ్‌. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ని 43 ఓవర్లకు…

వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకోవాలని కలలుగన్న సౌతాఫ్రికాకి నిరాశే మిగిలింది. సెమీస్‌లో ఒత్తిడి తట్టుకోలేక పరాజయం పాలైంది సౌతాఫ్రికా. ఇక, సౌతాఫ్రికాపై గెలిచేందుకు చెమటోడ్చింది న్యూజిలాండ్‌. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ని 43 ఓవర్లకు కుదించడమూ సౌతాఫ్రికా గెలుపు అవకాశాలకు గండి కొట్టిందనే చెప్పాలి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా, 43 ఓవర్లలో 281 పరుగులు చేసింది. డక్‌ వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం 43 ఓవర్లలో టార్గెట్‌ని 298 పరుగులుగా నిర్ణయించారు. ఓపెనర్‌ మెక్‌కల్లమ్‌ మెరుపు అర్థ సెంచరీతో న్యూజిలాండ్‌ విజయానికి ‘రోడ్‌ మ్యాప్‌’ రెడీ చేశాడు. కోరె అండర్సన్‌తో కలిసి ఎల్లియాట్‌ న్యూజిలాండ్‌ని సేఫ్‌ జోన్‌లోకి చేర్చాడు.

చివర్లో 2 బంతులకు 5 పరుగులు చేయాల్సిన దశలో ఎల్లియాట్‌ భారీ సిక్సర్‌ని బాది, న్యూజిలాండ్‌కి విజయాన్ని అందించడంతో మైదానంలో న్యూజిలాండ్‌ అభిమానుల ఆనందానిక హద్దే లేకుండా పోయింది. మరోపక్క సౌతాఫ్రికా అభిమానులు తీవ్ర ఉత్కంఠను అనుభవించారు. తమ జట్టు పరాజయం పాలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

ఒకరకంగా చెప్పాలంటే వర్షం సౌతాఫ్రికా విజయావకాశాల్ని బాగా దెబ్బతీస్తే, ఒత్తిడిని తట్టుకోలేక సఫారీలు మ్యాచ్‌ని న్యూజిలాండ్‌కి సమర్పించుకున్నారు. చివర్లో రెండు క్యాచ్‌లు జారవిడచడంతోపాటు, మూడు రనౌట్లను మిస్‌ అయ్యారు సఫారీ ఆటగాళ్ళు. అయినాసరే, మెరుపు ఫీల్డింగ్‌తో న్యూజిలాండ్‌కి గట్టి పోటీ ఇచ్చారు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇంతటి ‘టైట్‌’ మ్యాచ్‌ ఇంకోటి జరగలేదంటే అతిశయోక్తి కాదు.

ఫైనల్‌లో ఓ బెర్త్‌ ఖరారైంది. ఇక, రెండో జట్టు ఎల్లుండి ఖరారవుతుంది. ఆస్ట్రేలియా, టీమిండియా ఎల్లుండి తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.