వారెవ్వా.. చంద్రబాబు మెంటల్లీ మహాస్ట్రాంగ్!

రెండు పూర్తి రోజులు సీఐడీ అధికారులు విచారించినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన సంగతి ఒకే ఒక్కటి- ‘అసలు తప్పు అనేదే జరగలేదు. మీరు అనవసరంగా తప్పు జరిగినట్లుగా చూపిస్తూ కేసులు నమోదు చేశారని’…

రెండు పూర్తి రోజులు సీఐడీ అధికారులు విచారించినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన సంగతి ఒకే ఒక్కటి- ‘అసలు తప్పు అనేదే జరగలేదు. మీరు అనవసరంగా తప్పు జరిగినట్లుగా చూపిస్తూ కేసులు నమోదు చేశారని’ ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. 

మామూలుగా సైకాలజీ శాస్త్రవేత్తలు ఓ విషయం చెబుతారు! మానసికంగా ఎంతో బలమైన వ్యక్తి అయితే తప్ప.. తడబాటు లేకుండా అబద్ధం చెప్పడం సాధ్యం కాదు- అని! ఆ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు.. చంద్రబాబునాయుడు మెంటల్లీ మహాస్ట్రాంగ్ అని మనకు అర్థం అవుతుంది. ఆయన చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెబుతూ.. ఏమాత్రం తడబాటు లేకుండా.. అధికారుల్నే బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన పలువురిలో వినిపిస్తోంది.

తన రాజకీయ వ్యవహార సరళిలో.. చంద్రబాబునాయుడు , చరిత్రలో హిట్లర్ ప్రభుత్వంలోమంత్రి అయిన గోబెల్స్ ను ఆరాధించే వ్యక్తి అని పలువురు ఎద్దేవా చేస్తుంటారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలతో దానిని నిజమని నమ్మించవచ్చు అనేది హిట్లర్ సర్కారులోని గోబెల్స్ సిద్ధాంతం. 

చంద్రబాబునాయుడు తన నలభై నాలుగేళ్ల రాజకీయ జీవితాన్ని ఇదే సిద్ధాంతం ఆలంబనగా నడిపించారు. దీనిని ఆయన కాస్త ఇంప్రొవైజ్ చేసి, ఒకే అబద్ధాన్ని పదే పదే , పదిమందితో చెప్పించడం ద్వారా ప్రజల్ని బురిడీ కొట్టింవచ్చుననే తీరుగా మార్చారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టడం ప్రారంభిస్తే.. ఆయన అనుచర, వందిమాగధ గణాలన్నీ కూడా.. ఇక అదే పని మీద ఉండేవి. అదే డప్పు కొడుతూ ఉండేవారు.

ఇప్పుడు అరెస్టు అయిన తర్వాత కూడా ఆయన గోబెల్స్ వ్యూహ చాతుర్యం అనేది మారలేదు. కాకపోతే అరెస్టు అయిన తొలినాడు చెప్పిన దానికి, సీఐడీ రెండురోజుల కస్టడీ విచారణలో చెబుతున్న తీరుకు పాట కాస్త మార్చారు. తొలినాడు.. ఆయన తాను ఏ నేరమూ చేయలేదు- అనే మాటకు కట్టుబడి ఉన్నారు. పద్నాలుగు రోజుల జైలుజీవితం కలిగించిన అవగాహన, ములాఖత్ లలో అందిన సలహాలు ఎలాంటి ప్రభావం చూపించాయో తెలియదు గానీ.. ఇప్పుడు అసలు స్కిల్ కార్పొరేషన్ లో ఎలాంటి తప్పు, నేరం జరగనే లేదనే వాదన ఎత్తుకున్నారు. 

అసలు జరగని నేరానికి కేసులు నమోదు అయ్యాయనేది చంద్రబాబు ఏకైక సమాధానంగా ఉంటుంది. ఇంతటి మానసికంగా బలమైన  వ్యక్తి.. సీఐడీ ఎన్ని విధాలుగా అడిగినా.. ఒకేతీరుగా సమాధానాలు చెబుతూ ఉంటే.. రెండు రోజుల విచారణ ఎలా సరిపోతుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన రిమాండును కోర్టు పొడిగించిన నేపథ్యంలో.. మళ్లీ కస్టడీ విచారణకు సిఐడి తాజాగా దాఖలు చేయబోయే పిటిషన్ కు కూడా అనుమతి లభించవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.