మోహన మకరందం
అనుభవాలూ – జ్ఞాపకాలూ
డా|| మోహన్ కందా
ఇద్దరు రాష్ట్రపతులా? అదెలా!?
అప్పట్లో రాష్ట్రపతిగా వున్న జ్ఞానీ జైల్ సింగ్ గారికి గుండె ఆపరేషన్ జరిగి 45 రోజుల పాటు పని చేయలేకపోయారు.
ఆయన రాష్ట్రపతిగా వ్యవహరించలేకపోతున్నారు కాబట్టి ఉపరాష్ట్రపతిగా వున్న హిదాయతుల్లా గారిని ఆయన స్థానంలో పనిచేయమన్నారు.
గతంలో వి.వి.గిరిగారు ఉపరాష్ట్రపతిగా వుంటూ రాష్ట్రపతిగా పోటీ చేద్దామనుకుని తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి టర్మ్ అప్పటికే అయిపోవడం వలన రాష్ట్రపతిగానూ ఎవరూ లేరు. దాంతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ను రాష్ట్రపతిగా వ్యవహరించమన్నారు. అప్పుడు చీఫ్ జస్టిస్‌గా వున్నది హిదాయతుల్లా గారే. ఆయనను రాష్ట్రపతి కార్యకలాపాలు నిర్వర్తించమని చెపుతూనే 'యాక్టింగ్ ప్రెసిడెంట్' అని అనబోయింది ప్రభుత్వం.
హిదాయతుల్లాగారు ఒప్పుకోలేదు. రాజ్యాంగం ప్రకారం 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అనే పదవే వుంది తప్ప 'యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అనే పదవే లేదు. నేను ప్రెసిడెంటునే అని అలాగే సంతకం పెట్టి వ్యవహరించారట. ఎన్నికలలో వి వి గిరి గారు గెలిచి వచ్చేవరకు అదే ఏర్పాటు సాగింది. ఈ నేపథ్యం నేను కర్ణాకర్ణిగా విన్నాను.
ఆ నేపథ్యం తెలిసినా తెలియకపోయినా ప్రస్తుత పరిస్థితులకు అన్వయించవలసిన అవసరం లేదని గట్టిగా నమ్మాను. ఇప్పుడు ఆయనకు ఓ హోదా కల్పించాలి. ఆ హోదా ''ప్రెసిడెంటు ఆఫ్ ఇండియా'' అని హిదాయతుల్లా గారి నమ్మకం.
కానీ ఆయనకు సెక్రటరీగా వున్న నేను విభేదించాను. ''అయ్యా, ఇప్పుడు ప్రెసిడెంటు అంటూ లేకపోలేదు. ఒకరు వున్నారు. కానీ తన విధులు తను నిర్వర్తించే పరిస్థితిలో లేరు. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యకక్షుడు తన విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ఆయన విధులను నిర్వర్తించవచ్చు. (వైస్ ప్రెసిడెంట్ షల్ డిస్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్) అని వుంది. అందువలన మీరు రాష్ట్రపతి విధులు నిర్వర్తిస్తున్న ఉపరాష్ట్రపతి మాత్రమే'' అని చెప్పాను.
''అంటే నేను 'వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్‌చార్జింగ్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అనే పేరుతో స్టాంపు తయారుచేయించుకుని సంతకాలు పెట్టాలా?'' అని వెటకారంగా అడిగారు.
''అయ్యా, నా ఉద్దేశం అది. జైల్ సింగ్‌గారు వుండగానే మీరు రాష్ట్రపతి అనుకుంటే దేశానికి యిద్దరు రాష్ట్రపతులు తయారవుతారు. రాజ్యాంగం ఒప్పదు కదా'' అని చెప్పి లేచి వచ్చేశాను.
దీ
ప్రభుత్వంతో పనిబడిన వాళ్లందరూ ప్రభుత్వం పెట్టిన రూల్సంటే మండిపడతారు. ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మామీద ఎగిరిపడతారు. నియమనిబంధనలు లేకుండా ఏ సంస్థా వుండదని వారికి ఆ సమయంలో తోచదు. అసలు రూలంటూ వుంది కాబట్టేగా వాళ్లకు ఆ మాత్రమేనా పనులు జరుగుతున్నాయి! లేకపోతే అక్కడున్న అధికారి యిష్టాయిష్టాలపై నిర్ణయాలు ఆధారపడేవి.
ప్రభుత్వంలోనే కాదు, ఏ సంస్థలోనైనా పని గురించి నియమనిబంధనలతో బాటు ఉద్యోగుల నైతికవర్తన గురించి ఎథిక్స్ కూడా వుంటాయి. వాటిని జవదాటకూడదు. వాటిని చిత్తశుద్ధిగా పాటించడంలో ఒక్కొక్కప్పుడు మనం ఎంతో గౌరవించే వారినే నొప్పించే సందర్భాలు వస్తాయి.
కీ||శే|| డాక్టర్ కురియన్ గురించి విననివాళ్లు చాలా తక్కువమంది. దేశంలో క్షీరవిప్లవం తెచ్చిన మహానుభావుడాయన. పాడిపరిశ్రమాభిృద్ధికి ఆయన చేసిన సేవ అంతా యింతా కాదు. పరిశ్రమాభివృద్ధి ఒక్కటే కాదు, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసించకుండా వుండలేం. గుజరాత్‌లోనే కాదు, యావద్భారతంలో అమూల్ పేరు విననివాళ్లు వుండరు. పిల్లలు సైతం. గట్టిగా మాట్లాడితే పిల్లలకే ఎక్కువ గుర్తు, అమూల్ చాక్లెట్లు, చీజ్ కారణంగా!
గుజరాత్‌లో ఖేరా జిల్లాలో ఆనంద్ అనే వూళ్లో పాలవాళ్లందరినీ ఒక సహకార సంఘంగా తయారుచేసి, ఆ పాలను మార్కెటింగ్ చేసి పెట్టే ఉద్యోగిగా తనను తాను భావించుకుంటూ ఉద్యోగం చేశారు. పాల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పెట్టి, యీ పాలవాళ్లందరినీ దానిలో వాటాదారులను చేసి మధ్యవర్తులు ఎవరూ లేకుండా అమ్మి, అమూల్ అనే ఒక బ్రాండ్ సృష్టించి, డైరెక్ట్‌గా ఆ ఫైనల్ వాల్యువేషన్‌లో వచ్చే లాభంలో వాటా కూడా ఉత్పత్తిదారుకి వెళ్లే ఏర్పాటుచేసి, ప్రపంచంలోనే చాలా అద్భుతమైన ఒక ప్రయోగం చేసి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మహానుభావుడాయన.
శారదా ముఖర్జీ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా వుండగా నేను ఆవిడ ఆఫీసులో సెక్రటరీ టు ది గవర్నరుగా వుండగా (1977-79) మా పరిచయం జరిగింది. ఆవిడకి కురియన్‌గారు బాగా తెలుసు. చేతనా సొసైటీ అనే సంస్థ ఆధ్వర్యంలో ఒక వర్క్‌షాప్ పెట్టించి కురియన్‌గారిని పిలిపించారు. బుర్రా వెంకటప్పయ్యగారు, నాయుడమ్మగారు వంటి హేమాహేమీలందరూ ఆ వర్క్‌షాపుకి వచ్చారు. దాని నిర్వహణ నాదే. ఆ సందర్భంలో నన్ను చూసి కురియన్ గారు ముచ్చట పడ్డారు. ఆనంద్‌కు రమ్మనమని పిలిచారు.
అప్పుడు ఆనంద్ వెళ్లి అమూల్ ఫ్యాక్టరీ చూశాను. కురియన్‌గారు, ఆయన భార్య వాళ్లింటికి భోజనానికి కూడా పిలవడం ఓ మరువలేని అనుభవం. ఆనంద్ ఫ్యాక్టరీ చూసి ముగ్ధుణ్నయ్యాను. ఇటువంటివి కలలు కనచ్చు లేకపోతే ఊహల్లో అనుకోవచ్చు, లెక్చర్లు యివ్వవచ్చు. కానీ ఇలా ఇలా చెయ్యాలని చేసి చూపించడమనేది చాలా చాలా అరుదు. అంతటి ఘనకార్యం చేసిన మహానుభావుల్లో భారతదేశంలో ఆయన అగ్రగామి అని చెప్పుకోవడానికి తటపటాయించ నక్కరలేదు. నాకు ఆయనంటే గౌరవం వుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ ఆయనకు నామీద అభిమానం వుండడం నా అదృష్టం.
ఎన్.టి.రామారావుగారు ముఖ్యమంత్రిగా వుండగా ఆయన రాష్ట్రం వచ్చారు. రామారావుగారిని చూశాక ఆయన కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా వున్న నన్ను కూడా చూడడానికి వచ్చారు. నిజానికి కబురు పెడితే చాలు, నేనే వెళ్లేవాణ్ని. కానీ ఆయనకు అదో 'బలహీనత'. స్వయంగా నా గదికి వచ్చి పలకరించారు. సరిగ్గా అప్పుడే నన్ను (జులై 1984) రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటిస్‌గా వేసారు. ఆయనతో మాట్లాడుతూ యిలా పోస్టింగ్ వచ్చిందండి అంటే ''గుడ్ గుడ్, ఐ వాంట్ యు టు ప్రిసైడ్ ఓవర్ లిక్విడేషన్ ఆఫ్ దట్ ఆఫీస్'' (వెళ్లి ఆఫీసు మూసిపడేస్తే సంతోషిస్తాను) అన్నారు.
ఆయనకు యీ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్‌లన్నా, అసలు ప్రభుత్వోద్యోగులన్నా, రాజకీయనాయకులన్నా మహా మంట. వీళ్లందరూ రైతుని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుని పాలసీలు, పథకాలు రూపొందించారని ఆయన ప్రగాఢ విశ్వాసం. వీళ్ళందరినీ దారిలో ముళ్లలా ఏరి పారేస్తే తప్ప రైతు బాగుపడడని చెప్పి ఆయనకి ఒక కన్విక్షన్. మాలాంటి వాళ్లు వెళ్లి అక్కడ సమూలమైన మార్పులు చేపట్టి సొసైటీల రూపురేఖలు మార్చేయాలనే ఉద్ద్దేశంతో ఆయన అలా అన్నారన్నమాట!
1990 ప్రాంతాల్లో నేను వచ్చి ఆయన దగ్గర పనిచేస్తే బాగుండునని ఆయనకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిగారి కార్యాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను.
ఎచ్.ఎమ్.పటేల్ అని ఒక ఐ.సి.ఎస్. ఆఫీసరు వుండేవారు. మొరార్జీ దేశాయ్‌గారికి ఆప్తుడు. జనతా ప్రభుత్వంలో (1977-79) ఆయన ఆర్థికమంత్రి. ఆయన కూతురు అమృతా పటేల్ అని కురియన్‌గారికి చాలారోజులు సెక్రటరీగా వుండేది. తర్వాత ఎన్.డి.డి.బి (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) కి ఆవిడ చైర్మనయ్యారు. ఆవిడ ద్వారా కురియన్ నాకు కబురు పంపించారు.
ఆవిడ హైదరాబాదు వచ్చి నన్ను బంజారా హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచింది. ''ఈ సర్వీసు వదిలిపెట్టి వచ్చేసి, మీరొచ్చి మాతో పనిచేయండి.'' అంది. అమూల్ ప్రాజెక్టుపై ఎంత గౌరవం వున్నా నేను ఐయేయస్ వదులుకోదలచుకోలేదు. అందుకే చెప్పాను –
''నేను ఐ.ఎ.ఎస్. పూర్తిగా వదులుకోమంటే వదలుకోను. లియన్ మీద ఎన్ని సంవత్సరాలు రమ్మన్నా వస్తాను, వచ్చాక హోదాతో సంబంధం లేకుండా ఏం చేయమన్నా చేస్తాను. కాని ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి, నా సర్వీస్ వదలిపెట్టి వచ్చి ఒక ప్రాజెక్టుకే జీవితాంతం అంకితం అయిపోవాలంటే మాత్రం కష్టం. అటువంటిదానికి నేను మానసికంగా సిద్ధంగా లేను.'' అని చెప్పాను.
ఆవిడ వెళ్లి కురియన్‌గారికి ఏం చెప్పిందో తెలియదు కానీ ఆయనకు కాస్త అసంతృప్తి కలిగినట్లుంది. అది నాకు ఎలా తెలిసిందంటే – ఐదేళ్ల తర్వాత నేను ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్‌లో, జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఆయన ఓ కాబినెట్ నోట్ కావాలని కబురంపారు. అది సీక్రెట్ నోట్. రహస్యం అంటే రహస్యమే కదా. దాన్ని పక్క శాఖ మంత్రికి కూడా చూపించం. కురియన్‌గారంటే దేశం గర్వించదగ్గ మహానుభావుడు. మేమంతా ఆయన ముందు ఏ పాటి! అయినా సీక్రెట్ పేపర్సు చూపించలేం. అది మా ఎథిక్స్‌కు విరుద్ధం కదా!
ఇక్కడ తమాషా ఏమిటంటే అమృతా పటేల్‌గారు ఎడిషనల్ సెక్రటరీ హోదాలో మా మంత్రిత్వశాఖతో కనక్షన్ పెట్టుకుని వున్నారు. ఆవిడ ద్వారా ఎన్‌డిడిబికు ఆ నోట్ యిచ్చాం. కావాలనుకుంటే ఆవిడ ఆ నోట్‌ను కురియన్‌గారికి చూపించవచ్చు. ఈయన ఆవిణ్నే అడగవచ్చు. కానీ నన్ను డైరక్టుగా అడిగారు. నేను ఇవ్వలేదని కోపగించుకున్నారు. నిజానికి కురియన్‌గారికి, అమృత గారికి అప్పటికే విభేదాలు వచ్చి వుంటాయి. అందుకని ఆవిణ్ని అడగదలచుకోలేదేమో!
అటువంటి యిరకాటంలో పడేసినందుకు నాపై కోపం వచ్చిందేమో, పైగా ఐదేళ్ల క్రితం ఆయనంతటివాడు ఆహ్వానించగా నేను వెళ్లి చేరలేదన్న అలక కూడా వుందేమో! తెలియదు కానీ నన్ను స్వయంగా కలిసినపుడు కాస్త వెటకారంగా మాట్లాడారు.
అసలే ఆయనకు కోఆపరేటివ్ సొసైటీలంటే మంట అని చెప్పాను కదా. 1984 లో రాష్ట్రస్థాయిలో ఆ శాఖ చూసిన నేను పదేళ్లు తిరిగేసరికి కేంద్రప్రభుత్వ పరిధిలో వుండే సహకార సంఘాల పని చూసేవాణ్ని. అంటే ఇఫ్కో, క్రిబ్కో యిలాటివి నా పరిధిలోనే వుండేవి. ''అవునయ్యా నువ్వు చాలా గొప్పవాడివి కదా..'' అంటూ వెక్కిరించారు. పైకి నవ్వుతూ అన్నా ఆయన మనసులో అసంతృప్తి బయటపడింది.
సరే, నేను మాత్రం ఏం చేయగలను? అంతటి గొప్పవ్యక్తిని నొప్పించవలసి వచ్చిందని బాధపడడం తప్ప! రూల్సుకి బందీలం కదా!
ఇలాగే హిదాయతుల్లా గారి విషయంలో కూడా జరిగిందని చెప్పాను కదా. తర్వాత వెళ్లి లా సెక్రటరీగా వున్న పేరిశాస్త్రిగారిని ధర్మసూక్ష్మం అడిగాను. ఆయన దరిమిలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారు.
''హిదాయతుల్లా గారు ఎంత న్యాయశాస్త్రం తెలిసిన చీఫ్ జస్టిస్ అయినా నువ్వు చెప్పినదే కరక్టు'' అన్నారు శాస్త్రిగారు.
హిదాయతుల్లాగారికి రాష్ట్రపతి అనిపించుకోవాలనే కోరిక మనస్సులో ఎక్కడో ఓ మూల వుండిపోయిందేమో. ఆయనకు నా సలహా రుచించి వుండకపోవచ్చు, నొచ్చుకుని వుండవచ్చు. ఆయనంటే నాకు ఆపారమైన గౌరవం. పండితుడు. పెద్ద మనిషి. నిజాయితీపరుడు. పితృసమానుడు. అయినా ముందే చెప్పినట్టు – మేం రూల్సుకి బందీలం కదా! రేపు చరిత్రకారులు ఆయనను యీ విషయంగా ఎద్దేవా చేయకుండా కాపాడవలసినది మేమే కదా!
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version