పాతికేళ్ల అనితరసాధ్యుడు

భారతీయ చిత్ర పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని నిరూపిస్తూ, తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం జక్కన్న.

బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? తెలుగులో కూడా విజువల్స్ వండర్స్ సృష్టించగలమని అనుకున్నామా? ఓ తెలుగు సినిమా ఆస్కార్ వేదికపై మెరుస్తుందని కలలోనైనా ఊహించామా? వీటన్నింటినీ నిజం చేసి చూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి.

భారతీయ చిత్ర పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని నిరూపిస్తూ, తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం జక్కన్న.

ఆయన పరిశ్రమకొచ్చి పాతికేళ్లయింది. చేసినవి చాలా తక్కువ సినిమాలు. కానీ దాన్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. ఎందుకంటే, ప్రతి సినిమాతో ఆయన సంచలనం సృష్టించాడు. ఆయన టైమ్ తీసుకుంటున్నాడంటే ఏదో అద్భుతం రాబోతోందని అర్థం.

ఆయన కేవలం కథలను తెరకెక్కించడమే కాదు, ప్రేక్షకులను ఒక అద్భుతమైన దృశ్య లోకంలోకి తీసుకువెళ్లి సరికొత్త అనుభూతిని పంచుతాడు.

రాజమౌళి సినీ ప్రయాణం సాధారణ విజయం కాదు, పట్టుదల, అంకితభావం, అసాధారణ ప్రతిభకు నిలువెత్తు రూపం. రాజమౌళికి ముందు, రాజమౌళి తర్వాత అన్నట్టుగా సినిమా మేకింగ్, ప్రమాణాల్ని పూర్తిగా మార్చేశాడు.

దర్శకుడిగా ఆయన ప్రయాణం ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో ప్రారంభమైంది. తొలి సినిమాతోనే తనదైన ప్రతిభను చాటుకున్న ఆయన, ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’ వంటి మాస్ చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, రాజమౌళి అక్కడికే పరిమితం అయిపోలేదు.

తిరుగులేని మాస్ దర్శకుడిగా కొనసాగుతున్న టైమ్ లోనే ‘మగధీర’ లాంటి అతిభారీ ప్రయోగం చేశాడు. ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అదే కోవలో ఆయన తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా, అతడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక చిన్న ఈగ ప్రధాన పాత్రలో ప్రతీకారం తీర్చుకునే కథాంశాన్ని ఊహించడం, దానిని ప్రేక్షకులు నమ్మేలా తెరకెక్కించడం కేవలం రాజమౌళికే సాధ్యం. గ్రాఫిక్స్ కు భావోద్వేగాలు జోడిస్తే ఎలా ఉంటుందో ఈగతో చూపించాడు.

ఇక ‘బాహుబలి’ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రాలు భారతీయ సినిమా మార్కెట్ సరిహద్దులను చెరిపివేశాయి. ఈ భారీ దృశ్యకావ్యం, దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ సంచలనం సృష్టించింది.

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ఒకే ఒక్క సస్పెన్స్ ప్రశ్నతో దేశం మొత్తం ఎదురుచూసేలా చేయడంలో రాజమౌళి మార్కెటింగ్, ప్రతిభ అందరికీ తెలిసొచ్చింది.

‘బాహుబలి 2’ సినిమా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల మైలురాయిని దాటిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో రాజమౌళి పేరు బాలీవుడ్ లో మార్మోగిపోయింది. అదే టైమ్ లో అంతర్జాతీయంగా కూడా ఆయన పాపులర్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి తన విజన్ ను మరింత విస్తరించాడు. ఓ కల్పిత కథతో అతడు సృష్టించిన విజువల్ వండర్ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల్ని సైతం విస్మయపరిచింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించడం ద్వారా రాజమౌళి తన సత్తా చాటాడు.

రాజమౌళి సినిమాల విజయ రహస్యం కేవలం భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ మాత్రమే కాదు, ఆయన రాసుకునే బలమైన భావోద్వేగాలు. ఎంత పెద్ద యుద్ధ సన్నివేశమైనా,యాక్షన్ సీన్ అయినా, దాని వెనక ఎమోషన్ పెడతాడు జక్కన్న. అందుకే అతడి సినిమాలు అంత సక్సెస్ అవుతాయి.

ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ దర్శక ధీరుడు, ఇప్పుడు వారణాసి సినిమాతో మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు.

తన మేకింగ్, ప్రచారంతో భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ప్రమాణాలు సెట్ చేయబోతున్నాడు. ఏం చేసినా ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే అతడు పాతికేళ్ల అనితరసాధ్యుడు.

18 Replies to “పాతికేళ్ల అనితరసాధ్యుడు”

    1. సరే నువ్వు కాపీ కొట్టి ఒక్క మూవీ కనీసం అవేరేజ్ గా ఆడితే అప్పుడు మాట్లాడు 

  1. సింహాద్రి తో మొదట రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం.. బాహుబలి తో  దేశ వ్యాప్తంగా సంచలనం.. RRR తో ప్రపంచం మొత్తం సంచలనం..

    ఇంక వారణాసి విడుదలైతే ఎలా ఉంటుందో ఊహకి అందట్లేదు..

    ఇప్పుడు కొన్ని జాగిలాలు కాపీ అంటాయి నాస్తికం అంటాయి

    అవే 1st day 1st show చూస్తాయి

    ఎవరేమన్నా రాజమౌళి కి పోటీ రాజమౌళి నే

Comments are closed.