మాస్టర్, తొలిప్రేమ చిత్రాల సంగీత దర్శకుడు కన్నుమూత

మూడున్నర దశాబ్దాల పాటు తన సంగీతంతో సౌత్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన దేవా, చెన్నైలో తుదిశ్వాస విడిచారు

కొంతమంది సంగీత దర్శకులు పైకి పెద్దగా కనిపించరు. వాళ్ల పేరు అంతగా వినిపించదు. కానీ వాళ్ల పాటలు మాట్లాడతాయి, అవి దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంటాయి. అరె.. ఈ పాట భలేగా ఉందే అనుకుంటూ సంగీత దర్శకుడి పేరు సెర్చ్ చేస్తాం. అలా ఎంతోమంది ఆరా తీసిన పేరు దేవా.

వివిధ భాషల్లో ఆయన 400కు పైగా సినిమాలు చేశారంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి రెండు కారణాలు, అందులో ఒకటి తెలుగులో ఆయన ఎక్కువ సినిమాలకు పనిచేయకపోవడం, రెండోది తనకుతాను సొంత ప్రచారం చేసుకోకపోవడం.

చిరంజీవి ‘మాస్టర్’ సినిమా రిలీజ్. సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. పాటలు సూపర్ హిట్టయ్యాయి. అంతా దేవా..దేవా అంటూ గోల చేశారు. కానీ ఆయన మాత్రం తెరపైకి రాలేదు. ఎప్పట్లానే తనపని తాను చేసుకుపోయారు.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా అంత పెద్ద హిట్టవ్వడం వెనక పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఆ పాటల్ని కంపోజ్ చేసింది దేవానే. హీరోయిన్ ఇంట్రడక్షన్ బీజీఎం అయితే ఇప్పటికీ చాలామంది ఫోన్లలో రింగ్‌టోన్లుగా వినిపిస్తాయి.

ఇక ప్రేమలేఖ అనే సినిమా తెలుగులో అంత పెద్ద హిట్టయిందంటే దానికి కారణం దేవా పాటలు. అప్పట్లో ఏ టేపు రికార్డర్‌లో విన్నా ఇవే పాటలు. అలా ఆ డబ్బింగ్ సినిమా తెలుగులో కూడా హిట్టయింది. ఇలా చెప్పుకుంటూపోతే 90ల్లో సౌత్ సంగీతాన్ని ఓ మలుపుతిప్పిన మ్యూజిక్ డైరక్టర్‌ దేవా.

తెలుగులో ఆయన 20లోపే సినిమాలు చేశారు. వాటిలో చెప్పుకోదగ్గవి మాస్టర్, తొలిప్రేమ, నాగ, ఆటోడ్రైవర్, గ్రీకువీరుడు లాంటి సినిమాలు. ఇక డబ్బింగ్ రూపంలో ఆయన పాటలు తెలుగులో మార్మోగాయి. రజనీకాంత్ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచిన బాషా, అరుణాచలం లాంటి చిత్రాలకు సంగీతం అందించింది దేవానే.

మెలొడీ, మాస్, జానపదం అనే తేడా లేకుండా ప్రతి పాటపై తనదైన ముద్రవేశారు దేవా. ఏ తరహా పాట కంపోజ్ చేసిన అది వినసొంపుగా ఉండేలా దేవా కంపోజిషన్ ఉండేది. ఇక దేవా, ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంబినేషన్‌ సూపర్ హిట్. దేవా సంగీత సారధ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆలపించారు బాలు.

ఇలా తమిళ సినీ ప్రపంచంలో ఓ చెరగని అధ్యాయాన్ని లిఖించారు దేవా. మూడున్నర దశాబ్దాల పాటు తన సంగీతంతో సౌత్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన దేవా, చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.

4 Replies to “మాస్టర్, తొలిప్రేమ చిత్రాల సంగీత దర్శకుడు కన్నుమూత”

Comments are closed.