నేడు పులివెందుల‌లో ఏం జ‌ర‌గ‌నుందో?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల నివురుగ‌ప్పిన నిప్పులా వుంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల నివురుగ‌ప్పిన నిప్పులా వుంది. ఎప్పుడేం జ‌రుగుతుందో అనే భ‌యాందోళ‌న అక్క‌డ నెల‌కుంది.

పులివెందుల మున్సిపాల్టీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు వేసేందుకు నేడు ఆఖ‌రి రోజు. మొద‌టి రోజు వైసీపీ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థి వైఎస్ ప్ర‌మీల‌మ్మ‌, మ‌రికొంద‌రు అభ్య‌ర్థులు మాత్ర‌మే నామినేష‌న్లు వేయ‌గ‌లిగారు.

రెండో రోజు నామినేష‌న్లు వేసేందుకు వెళ్లిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు అభ్య‌ర్థుల్ని పోలీసులే అడ్డుకోవ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. బ‌హుశా ఇలాంటి విచిత్ర ఘ‌ట‌న మ‌రెక్కడా జ‌రిగి వుండ‌దేమో.

మున్సిపల్ కార్యాల‌యం వ‌ద్ద టీడీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్లు, క‌ర్ర‌లు, క‌త్తులు ప‌ట్టుకుని వుంటే, వారిని త‌రిమి శాంతిభ‌ద్ర‌త‌ల్ని కాపాడాల్సిన పోలీసులు, త‌మ‌ను అడ్డుకున్నార‌ని ఎంపీ అవినాష్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

పోలీసులు బాష్ప‌వాయువు ప్ర‌యోగించ‌డం, గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌డంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌బ్బ‌ర్ బుల్లెట్లు కూడా త‌గిలాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ వైసీపీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల కార్య‌క్ర‌మం స‌జావుగా సాగుతుందా? లేదా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

ఆదివారం తెల్లారేస‌రికి వైసీపీ కార్యాల‌యం చుట్టూ పోలీసులు ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి నుంచి వైసీపీ కార్యాల‌యానికి చేరుకున్నారు. కార్యాల‌యం చుట్టూ ముళ్ల కంచెల ఏర్పాటుపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మండిప‌డుతున్నారు.

ఇక్క‌డ ఇవ‌న్నీ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని పోలీసుల్ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే, చివ‌రి రోజు కూడా నామినేష‌న్లు వేయించ‌డానికి వెళ్ల‌కుండా అడ్డుకునే కుట్ర క‌నిపిస్తోంద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద భారీగా రౌడీ మూక‌ల్ని మోహ‌రించి, మ‌రోవైపు పోలీసుల ద్వారా వైసీపీ అభ్య‌ర్థుల్ని నిలువ‌రించే కుట్ర జ‌రుగుతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుంటే, వైసీపీ ప్ర‌తిఘ‌టించే అవ‌కాశం వుంటుంది. మ‌రోసారి పులివెందుల ర‌ణ‌రంగంగా మారే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.