తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి వాసుయాదవ్ తన తల్లి రేణుకాతో కలిసి నిరసన చేపట్టారు.
తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జోరు వానలోనే గత రాత్రి నుంచి దీక్షకు దిగడం చర్చనీయాంశమైంది.
వైసీపీ మేయర్ అభ్యర్థి వాసుయాదవ్ తరపున నామినేషన్ వేసేందుకు శనివారం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఎంపీ చేతిలోని నామినేషన్ పత్రాల్ని వారు లాక్కెళ్లారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ నామినేషన్ వేయకుండా తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో రెండోసారి మేయర్ అభ్యర్థి వాసుయాదవ్ను వెంటపెట్టుకుని ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లారు.
టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని, వారి వాహనం ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.
నామినేషన్ గడువు ముగియడంతో తిరుపతి ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధుల్ని పోలీసులు వెనక్కి పంపారు. ఇక నామినేషన్ వేయడానికి కొన్ని గంట సమయం మాత్రమే వుంది.
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్ వేయకపోతే, టీడీపీకి ఏకగ్రీవం అవుతుంది. అయితే నామినేషన్ వేసేందుకు తన కుమారుడు సిద్ధంగా ఉన్నాడని, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని నామినేషన్ వేసేందుకు తగిన పోలీసు భద్రత కల్పించాలని వాసు యాదవ్ తల్లి రేణుకా డిమాండ్ చేశారు.
