తనపై మీడియాలో, సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూ తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారంటూ బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, తనను వేధిస్తున్న సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన ముంబయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో సూరజ్ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి తర్వాత సూరజ్ పంచోలీపై విమర్శలు వెల్లువెత్తాయి. దాన్నుంచి బయట పడేందుకు సూరజ్ నానా తిప్పలు పడాల్సి వచ్చింది. అతనిపై కేసు కూడా నమోదైంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సూరజ్ అదృశ్యమయ్యాడు. అదో పీడకలగా పరిణమించింది.
ఆ వ్యవహారం నుంచి బయటపడకనే…బాలీవుడ్ హీరో సుశాంత్, ఆ తర్వాత అతని మేనేజర్ దిశా సెలియన్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దిశ మరణం సూరజ్‌కు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఏం జరిగినా సూరజ్‌ను లింక్ పెట్టి సోషల్ మీడియాతో ఇతరత్రా సంస్థలు, నెటిజన్లు కథనాలు, ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఇదెక్కడి గొడవంటూ సూరజ్ ఆవేదనకు గురవుతున్నాడు.
ఈ నేపథ్యంలో సూరజ్ ఓ విజ్ఞప్తి చేశాడు. తనపై ఇప్పటికే ఓ కేసు ఉందని, నిరాధారమైన కథనాలతో తనను ఈ కేసులోకి లాగవద్దని సూరజ్ చేసుకున్న వేడుకోలును ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా అతనిపై ట్రోల్స్ పెరగడం ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో సూరజ్ విసిగిపోయి ముంబయ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై అనవసర కథనాలు ప్రసారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి ఏమవుతుందో చూద్దాం.