Advertisement

Advertisement


Home > Politics - Analysis

16 చోట్ల అధికారిక రెబ‌ల్స్.. అన‌ధికారికంగా?

16 చోట్ల అధికారిక రెబ‌ల్స్.. అన‌ధికారికంగా?

కూట‌మిలో సీట్ల స‌ర్దుబాట్ల ర‌చ్చ‌కు తోడు.. తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపులో చెల‌రేగిన విబేధాల‌తో.. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మికి సుమారుగా 16 చోట్ల రెబ‌ల్ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ఘ‌ట్టం వ‌ర‌కూ వీరిని బుజ్జ‌గించి, బ‌తిమాలినా వీరు త‌గ్గ‌లేదు! విశేషం ఏమిటంటే.. వీరిలో కొందిరికి గాజు గ్లాసు గుర్తు కూడా ద‌క్కింది! 175 అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలున్న చోట ఏకంగా ప‌దో వంతు సీట్ల‌లో ఇలా రెబ‌ల్స్ పోటు ఎదుర‌వుతోంది! 

కొంద‌రు రెబ‌ల్స్ అయితే.. మొన్న‌టి వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిలుగా వ్య‌వ‌హ‌రించిన వారున్నారు. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కంతో వారు ప‌ని చేశారు. ద‌క్క‌క‌పోవ‌డంతో రెబ‌ల్ గా బ‌రిలోకి దిగారు. వారిని టీడీపీ స‌స్పెండ్ చేసింది! 

ఈ రోజుల్లో ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగ‌డం అంటే మాటలు కాదు! రాజ‌కీయాలు చాలా కాస్ట్లీగా మారాయి. అయితే ఇన్నాళ్లూ త‌మ చేత ఖ‌ర్చులు పెట్టించి, ఇప్పుడు వేరొక‌రికి టికెట్ ఇవ్వ‌డంతో ఆ ఆక్రోశంతోనే రెబ‌ల్స్ బ‌రిలో ఉన్నారని స్ప‌ష్టం అవుతోంది. ఇన్నాళ్లూ పెట్టిన ఖ‌ర్చుకు తోడు మ‌రి కాస్త ఖ‌ర్చు పెట్టుకుంటే.. గెల‌వ‌లేక‌పోయినా. త‌మ స‌త్తా ఏమిటో చూపించిన‌ట్టుగా అవుతుంద‌నే విశ్వాసంతో రెబ‌ల్స్ బ‌రిలోకి దిగారు! 

ఇన్ చార్జిలుగా ప‌ని చేసిన వారు కావ‌డంతో వీరు క‌నీసం ఐదు వేల ఓట్ల స్థాయి ఓట్ల‌ను చీల్చినా.. అది తెలుగుదేశం కూట‌మికి పెను ప్ర‌మాద‌క‌రంగా మారొచ్చు! ఐదు వేలు అనేది అతి త‌క్కువ అంచ‌నా! స్థాయిని బ‌ట్టి కొంద‌రు ప‌ది, పాతిక వ‌ర‌కూ కూడా పోరాడొచ్చు! అదే జ‌రిగితే.. ప‌దో వంతు సీట్ల‌లో రెబ‌ల్స్ పోటు టీడీపీ కూట‌మికి గ‌ట్టి ఝ‌ల‌క్ ను ఇచ్చే అవ‌కాశం ఉంది. దాదాపు జ‌న‌సేన పోటీకి కేటాయించిన సీట్ల‌కు స‌మానంగా రెబ‌ల్స్ ఉన్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు!

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అన‌ధికారిక రెబ‌ల్స్ మ‌రో ఎత్తు! వీరు పార్టీలోనే గ‌మ్ముగా ఉన్నారు. చాలా చోట్ల ఇన్ చార్జిల‌కు, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన‌ మాజీ ఎమ్మెల్యేల‌కు టికెట్ ల‌ను ఇవ్వ‌లేదు. అలాంటి వారిలో కొంద‌రు మొన్న‌టి వ‌ర‌కూ టీడీపీ ఇన్ చార్జిలుగా వ్య‌వ‌హ‌రించారు. వారు అధికారింగా బ‌య‌ట‌కు వెళ్లి పోటీ చేయ‌క‌పోయినా.. పార్టీలోనే ఉండి అభ్య‌ర్థుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చే అవ‌కాశాలున్నాయి. త‌మ‌ను కాద‌ని, వేరే వాళ్ల‌ను గెల‌వ‌లిస్తే రేపు నియోక‌వ‌ర్గంలో త‌మ‌కు ఉండే విలువెంతో వారికి తెలుసు! ఆఖ‌రి వ‌ర‌కూ త‌మ‌నే ఇన్ చార్జిగా పెట్టి ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా స‌మాచారం ఇవ్వ‌డం కొంత‌మందిని బాగా ర‌గిలిపోయేలా చేయ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు! ఏతావాతా.. కూట‌మికి ఇంటాబ‌య‌ట రెబ‌ల్ పోటు గ‌ట్టిగానే ప‌డేలా ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?