చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ నాయకులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
30 ఏళ్లకు పైగా టీడీపీ జెండా మోస్తూ, పార్టీ కోసం ఎన్నో కష్ట నష్టాలు, కేసులు ఎదుర్కొన్నామని వారు లేఖలో పేర్కొన్నారు. అయితే చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గౌరవం, గుర్తింపు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల పట్ల చులకన భావంతో మాట్లాడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నట్టు తెలిపారు.
మూడు దశాబ్దాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకుంటే.. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన కుటుంబీకుల వ్యవహారశైలి కారణంగా మరో 30 ఏళ్లపాటు పార్టీ చంద్రగిరిలో గెలవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను ఆ లేఖలో వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఆరు జడ్పీటీసీలకు మూడు స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇది టీడీపీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదని, పులివర్తి నాని, ఆయన కుటుంబ వ్యవహారశైలికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆ లేఖలో స్పష్టం చేశారు.
ఆత్మాభిమానం చంపుకుని పులివర్తి నాని నాయకత్వంలో పని చేయలేమని, తెలుగుదేశంపార్టీలో కొనసాగలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని పేర్కొంటూ టీడీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
రాజీనామా చేసిన వారిలో తిరుపతి రూరల్ మండల టీడీపీ మాజీ కార్యదర్శి బిరుదాల భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సరస్వతి, టీడీపీ సీనియర్ నాయకులు ఎస్.వెంకటేష్‌నాయుడు, టి.లక్ష్మీనారాయణ, పి.మనోహర్ లు ఉన్నారు.
