వల వేస్తున్నారు గానీ.. ప్రతి చోటా వర్కవుట్ కావట్లే!

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ అవుతోంది

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ అవుతోంది. ఈ ఎన్నికలను వాడుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా దెబ్బతీయడానికి తెలుగుదేశం వ్యూహరచనలో ఉంది.

వైసీపీకి చెందిన వారిని అసలు నామినేషన్లు వేయనివ్వకుండానే అడ్డుకోవడం ద్వారా.. వారికి ఎలాంటి పదవులూ లేకుండా చూడడం ఒక ఎత్తు మాత్రమే.

అదే సమయంలో.. వైసీపీ ని వీడి తమ పార్టీలో చేరితే రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తామని, వారి బాగోగులు చూసుకుంటామని ప్రలోభాలు కూడా నడిపిస్తున్నారు.

అసలు నామినేషన్లు వేయడానికి కూడా కేండిడేట్లు లేని వాతావరణం వైసీపీలో సృష్టించాలని తపన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్షేత్రస్థాయి నాయకులను ఆకర్షించడానికి వల విసురుతున్నారు గానీ.. ప్రతిచోటా వర్కవుట్ కావడం లేదని.. కొన్నిచోట్ల మాత్రం ప్రలోభాలు పనిచేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. నారా లోకేష్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన నాయకుల కులాలు, మతాలను బట్టి.. వారికి కాస్త ఆశ పుట్టించేలా.. పార్టీ మారినందుకు వారు వెళ్లి తమ తమ సామాజికవర్గాల్లో తమ చర్యను సమర్థించుకునేలా లోకేష్ కొన్ని ఆఫర్లు కూడా కురిపించారు.

నిజానికి మునిసిపల్ ఎన్నికల పర్వం మొదలు కాకముందు కూడా మంగళగిరిలో వైసీపీ నుంచి తెలుగుదేశం లోకి కొన్ని చేరికలు జరిగాయి.

ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల ముంగిట్లో మరికొన్ని చేరికలు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘమైన ప్రలోభాల పర్వం తర్వాతనే ఈ మాత్రం ఛోటా నాయకులు కొందరు పార్టీ మారడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

మంగళగిరి గనుక.. అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది నిధులను అక్కడ కుమ్మరిస్తూ నారా లోకేష్ తన నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే.. వైసీపీ నుంచి వస్తున్న నాయకులకు కూడా అక్కడ భారీ తాయిలాలు ఆశ పెడుతున్నట్టుగా తెలుస్తోంది.

అదే ఫార్ములాను రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వర్తింపజేయలేకపోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకుల్ని తీసుకురావడానికి ప్రలోభాలు మాత్రమే కాకుండా, బెదిరింపుల రూపంలోకూడా నాయకులు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదని తెలుస్తోంది.

రాష్ట్రంలో దాదాపుగా ప్రతి గ్రామం కూడా.. టీడీపీ- వైసీపీ వర్గాలుగా చాలా స్పష్టంగా చీలిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇలాంటి సమయంలో.. చిన్నా సన్నా ప్రలోభాలతో వైసీపీనుంచి వలసలను ఆశించడం అంత ఈజీ కాదని పలువురు అంటున్నారు.

నామినేషన్లు వేయనివ్వకపోయినా సరే.. వైసీపీలోనే ఉండి పోరాడాలని స్థిరంగా ఉన్నవారు కొందరైతే.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచిన తర్వాతనైనా వైసీపీ వారిని తమలో కలిపేసుకోవచ్చుననే వ్యూహాలతో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది.

One Reply to “వల వేస్తున్నారు గానీ.. ప్రతి చోటా వర్కవుట్ కావట్లే!”

  1. మనం ఎటువంటి తాయిలాలు ఇవ్వకుండానే కుప్పం తో సహా ఏకగ్రీవాలు అయ్యాయి అంటావా.. బాల రాజా?

Comments are closed.