స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు పట్టు ఎంత ఉన్నదో.. ఆయన నాయకత్వం పట్ల, మాట పట్ల పార్టీ శ్రేణులలో ఏ స్థాయి ఆమోదం లేదా ధిక్కారం ఉన్నదో నామినేషన్ల పర్వంలోనే చాలా వరకు తేలిపోయింది.
పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను వ్యతిరేకిస్తూ.. కూటమి పార్టీలు జనసేన, బిజెపిలకి కేటాయించిన స్థానాల్లో కూడా తిరుగుబాటు చేస్తూ తెలుగుదేశానికి చెందిన అనేకమంది నామినేషన్లు వేశారు.
తాజాగా పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు- తిరుగుబాటు అభ్యర్థుల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పార్టీ అధికారికంగా నిర్ణయించిన అభ్యర్థుల విజయానికే అందరూ కలిసికట్టుగా పని చేయాలని.. పార్టీని ధిక్కరించి నామినేషన్లు వేసిన వారిని సహించేది లేదని చంద్రబాబు అంటున్నారు.
అయితే ఆయన ఆగ్రహానికి, ఆదేశాలకు కార్యకర్తలలో ఏమాత్రం చెల్లుబాటు అవుతుందో ఉపసంహరణ సమయంలో తేలిపోతుంది. పైగా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నవారు ఒకవేళ నెగ్గితే.. పార్టీ మళ్లీ వారిని అక్కున చేర్చుకోవడం అనేది వారికి అలవాటే.
ఆ విషయం కూడా చంద్రబాబు ఇప్పుడే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. బరిలో తిరుగుబాట్లుగా కొనసాగేవారిని పార్టీ శాశ్వతంగా బహిష్కరిస్తుందనే హెచ్చరిక మాత్రం ఆయన చేయడం లేదు.
తెలుగుదేశం పార్టీ లో ముఠాలు క్షేత్రస్థాయిలో ఉండే అసంతృప్తులు, ధిక్కారాలు అన్నీ కూడా మునిసిపల్ నామినేషన్ల సమయంలోనే బయటపడ్డాయి.
జనసేన, బిజెపిలకు కేటాయించిన అనేక స్థానాల్లో తెలుగుదేశం వారి నుంచి తలపోట్లు తప్పడం లేదు. కేవలం వారికి మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ లోనే అనేక లుకలుకలు కూడా బయటపడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీని వీడిపోయి అయినా సరే స్థానిక ఎన్నికలలో కొనసాగి తీరాల్సిందేననే పట్టుదలతో కొన్నిచోట్ల అభ్యర్థులు మొండిగా నామినేషన్ వేసి నిరీక్షిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ నిర్ణయించిన వారు తప్ప తతిమ్మా అందరూ ఉపసంహరించుకోవాలనే చంద్రబాబు ఆదేశాలను తిరుగుబాటు అభ్యర్థులు ఏమాత్రం ఖాతరు చేస్తారో వేచి చూడాలి.
అదే సమయంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఈ ఎన్నికలలో సైతం అసంతృప్తి నాయకులు భారీ స్థాయిలో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసే ప్రమాదం ఉంది. వారందరినీ ఊరడించి పోటీ నామినేషన్లు వేయకుండా ఉపసంహరింపజేయడం స్థానిక నాయకత్వానికి తలకు మించిన సవాలే!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అసలు నామినేషన్ వేయనివ్వకుండా అనేక చోట్ల నియంత్రించిన నేపథ్యంలో.. తెలుగు దేశంలోని వర్గాలు కూటమి పార్టీల మధ్యనే పోటీ అనివార్యం అయ్యే పరిస్థితి కూడా ఉంది.
ఒక్కచోట కూడా పార్టీ ఆదేశాలకు భిన్నంగా పోటీలు జరగకుండా చూడగలిగినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయకత్వానికి జనామోదం ఉన్నట్లు లెక్క. లేకపోతే పార్టీ మీద ఆయన పట్టు సడలుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ముందు జగన్ ని షర్మిలతో సఖ్యతతో ఉండాలని చూడు తరువాత కూటమి అభ్యర్థులు సఖ్యతతో ఉంటారు
11 anandam reddi ekada