వైఎస్సార్ జిల్లా కమలాపురంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రత్యర్థి మారబోతున్నారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి పేరును మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి కుమారుడే చైతన్యరెడ్డి. యువతకు టికెట్ ఇవ్వాలని అనుకోవడం, అలాగే నాలుగుసార్లు ఓడిపోయిన నరసింహారెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు అభ్యర్థిని మార్చారు.
అయితే తనకే టికెట్ ఇవ్వాలని నరసింహారెడ్డి, అలాగే తన తండ్రికే చివరి అవకాశం కల్పించాలని చైతన్యరెడ్డి టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో పుత్తా చైతన్యరెడ్డికి బదులుగా నరసింహారెడ్డిని బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కమలాపురం అభ్యర్థి మార్పుపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది. అభ్యర్థి మార్పు తప్ప, దీంతో కమలాపురం ప్రజల నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు.
2004 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వరుసగా నరసింహారెడ్డి ఓడిపోతూ వస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ తరపున పోటీ చేసిన పుత్తా నరసింహారెడ్డి ఓటమిని మూటకట్టుకున్నారు. వైఎస్సార్ హయాంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేగా గెలవడం ఆయన జీవితాశయం.
వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈ దఫా అయినా ఆయన కల నెరవేరుతుందా? అనే చర్చకు తెరలేచింది. ఇటీవల కాలంలో కమలాపురం వైసీపీలో విభేదాలను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సర్దుబాటు చేసుకుంటూ వెళ్తున్నారు. పుత్తాకు గెలుపు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. ఏమవుతుందో చూడాలి.