తన సామాజిక వర్గాన్ని, కులపోడిని కాపాడుకోవడంలో చంద్రబాబునాయుడికి 100కి 200 మార్కులు వేయాల్సిందే. ఈ మాట ఆయన సామాజిక వర్గం నాయకులు చెబుతున్న మాట. తాజాగా ఈ అభిప్రాయానికి బలం కలిగించేలా అభ్యర్థుల మార్పు విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు వుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. కనీసం మాట మాత్రమైనా రామకృష్ణారెడ్డికి చెప్పకుండా, అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో న్యాయం కోసమంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వృద్ధురాలైన తల్లిని రిక్షాలో ఊరేగిస్తూ, అలాగే భార్యాపిల్లలతో కలిసి ఊరూరూ తిరుగుతున్నారు.
అనపర్తి సీటు తిరిగి టీడీపీకే ఇస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ వాతావరణం కనిపించడం లేదు. అనపర్తి సీటు మార్చుకునేందుకు బీజేపీ షరతు విధించింది. తమకు ఏలూరు జిల్లా దెందులూరు సీటు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక్కడే చంద్రబాబులోని కులాభిమానం బయట పడింది. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు ప్రకటించారు.
అనపర్తిలో చెప్పా పెట్టకుండా బీజేపీకి కేటాయించినట్టు, దెందులూరులో చంద్రబాబు చేయడం లేదు. చింతమనేని ప్రభాకర్ చౌదరి దగ్గరికి టీడీపీ నేతలను పంపి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. తన సీటు వదులుకోడానికి చింతమనేని ససేమిరా అనడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. దీంతో అనపర్తిని బీజేపీకే విడిచి పెట్టి, నల్లమిల్లి కుటుంబాన్ని రోడ్డున పడేయడానికే చంద్రబాబు మొగ్గు చూపారని అంటున్నారు.
దెందులూరులో బీజేపీ కూడా మరో చౌదరిని నిలబెడుతుందనే కారణంతోనే, ఆ పార్టీకి ఇచ్చేందుకు చంద్రబాబు ముందు కొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరొకరికి టికెట్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి వుంటే, చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే వారు కాదంటున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం నాయకత్వాన్ని కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారనేందుకు అనపర్తి, దెందులూరులో ఆయన వ్యవహార శైలే నిదర్శనం. అందుకే చంద్రబాబును ఆయన సామాజిక వర్గం అమితంగా ప్రేమిస్తుందనే వాదన వినిపిస్తోంది.