తమిళనాడులో వీకే శశికళ ఎవరో చాలామందికి తెలుసు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. ప్రాణ స్నేహితురాలు. జయలలిత హయాంలో శశికళ హవా బాగా నడిచింది. అన్నాడీఎంకే నాయకులకు, కార్యకర్తలకు జయలలిత ఎంతో శశికళ అంతే.
అయితే జయలలిత మరణించాక తానే ముఖ్యమంత్రి కావాలనుకుంది. కాని ఆమె కల నెరవేరలేదు. జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. చివరకు శశికళ సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించింది.
కాని ఆ రాజకీయ పార్టీలోనే ఆమెకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది మార్చి నెలలో స్థాపించిన ‘ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం’ (AIPTMMK) పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చక్రవర్తి సంచలన ప్రకటన చేశారు.
జయలలిత మరణానంతరం, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత అన్నాడీఎంకే (AIADMK) పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, కొత్త పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పునరాగమనం చేయాలని భావించినప్పటికీ ఆమెకు తీవ్ర విఘాతం ఎదురైంది.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ శశికళ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల అనంతరం శశికళ పార్టీ రోజువారీ కార్యకలాపాలకు, కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని ఆరోపించారు.
క్షేత్రస్థాయి నాయకులను, పర్యటనల్లో ఆదుకునే కార్యకర్తలను గానీ ఆమె కనీసం కలవడం లేదని, చివరికి పార్టీ అధినేతగా ఉన్న తనను కలిసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని చక్రవర్తి ఆవేదన చెందారు.
కేవలం పేరుకే ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, నిత్యం ప్రజల్లో లేని నాయకురాలు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తారనే ఉద్దేశంతోనే శశికళను పదవి నుంచి తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేస్తూ ఇప్పటికే భారత ఎన్నికల సంఘానికి (ECI) అధికారికంగా లిఖితపూర్వక లేఖను పంపినట్లు చక్రవర్తి స్పష్టం చేశారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, శ్రేణులకు అందుబాటులో ఉండే వ్యక్తినే త్వరలోనే నూతన ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని ఆయన వెల్లడించారు. జయలలిత వారసత్వం పేరుతో స్థాపించిన పార్టీ నుంచే శశికళ బహిష్కరణకు గురవ్వడం ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఆశ.. ఇంట్లో పనిమనిషి కి కూడా సీఎం కావాలని ఆశ. కనీసం టీ పెట్టడం సరిగ్గా నేర్చుకుంటే MLA అయ్యేది.
ఆంధ్రా శశి సజ్జిల