వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఆచూకీ కనిపించడం లేదు. తిరుపతి జిల్లాకు చెందిన ఈ నాయకుడు కీలకమైన ఎన్నికల సమయంలో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరులో బల్లి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి వుంది. గూడూరు టికెట్‌ను ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ ఆశించారని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం మేరిగ మురళీధర్ వైపు మొగ్గు చూపారు. ఈయన కూడా ఎమ్మెల్సీ కావడం గమనార్హం.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో కల్యాణ్ ప్రచారం చేస్తే బాగుంటుందని వైసీపీ నేతల అభిప్రాయం. కానీ కల్యాణ్ చక్రవర్తి మాత్రం తానో ఎమ్మెల్సీ అని గుర్తు పెట్టుకున్నట్టు లేదు. మరోసారి పార్టీ అధికారంలోకి రావాలనే కోరిక కూడా కల్యాణ్ చక్రవర్తిలో కరువైంది. అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. కల్యాణ్ చక్రవర్తి తండ్రి దివంగత బల్లి దుర్గాప్రసాద్‌రావు. ఈయన తిరుపతి ఎంపీగా వుంటూ అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతరం ఉప ఎన్నికలో డాక్టర్ మద్దిల గురుమూర్తి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
బల్లి దుర్గాప్రసాద్ గూడూరులో 1985లో టీడీపీ తరపున గెలుపొందారు. మొత్తం నాలుగుసార్లు ఈ నియోజకవర్గం నుంచి బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. గూడూరు నియోజకవర్గంలో బల్లి దుర్గాప్రసాద్‌రావుకు చెప్పుకోదగ్గ వర్గం వుండేది. అయితే దాన్ని ఆయన కుమారుడు కాపాడుకోలేకపోయారు. బల్లి కుటుంబంపై ఆ నియోజకవర్గంలో గౌరవం వుంది. అయితే దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ్ అప్పుడప్పుడు మినహాయిస్తే, పెద్దగా జనంతో కలిసి తిరిగిన దాఖలాలు లేవు. కనీసం ఎన్నికల సమయంలో అయినా ఆయన తిరిగితే బాగుండేదన్న అభిప్రాయం వుంది.
వైసీపీ అభ్యర్థులు కూడా తమ పరిధిలోని నాయకులను ప్రచారానికి తిప్పాలనే ఆలోచన చేయడం లేదు. అభ్యర్థులే పిలవకపోతే తామెందుకు వెళ్లాలనే పంతం వైసీపీ ముఖ్య నాయకుల్లో కనిపిస్తోంది. దీంతో పార్టీకి నష్టం జరిగేలా నాయకులు వ్యవహరిస్తున్నారనే చర్చకు తెరలేచింది. వైసీపీ అధికారంలోకి వస్తేనే తమకు పదవులైనా, మరొకటైనా అని వారు గ్రహించడం లేదు.
లోకల్‌గా తమలో తాము ద్వేషించుకుంటూ, ప్రత్యర్థులకు రాజకీయ ప్రయోజనం కలిగిస్తున్నారనే ఆవేదన వైసీపీ కార్యకర్తల్లో వుంది. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా వుంది. వైసీపీలో కాసింత ప్రజాదరణ ఉన్న నాయకుల్ని ప్రచారానికి తీసుకెళ్లేలా అధిష్టానం పెద్దలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.