వైఎస్సార్ జిల్లాలో బిల్డప్ బాబాయ్ ఒకాయన ఉన్నారు. ఆయనకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. అంతా తన చేతల్లో ఉన్నట్టు మాట్లాడేస్తుంటారు. తీరా ఆచరణ విషయానికి వచ్చే సరికి… తూచ్‌తూచ్ అంటుంటారు. ఇంతకూ ఎవరా బిల్డప్ బాబాయ్ అంటే… మాజీ మంత్రి , జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి. వైఎస్సార్ జిల్లాలో ఇప్పుడు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు కంటే, బిల్డప్ బాబాయ్ అంటే వెంటనే గుర్తు పడుతున్నారు. దీన్నిబట్టి ఆయన నడవడిక ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
జమ్మలమడుగు అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తారని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కడప ఎంపీ అభ్యర్థిగా జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి, ఆది అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి పోటీ చేస్తారని టీడీపీ ప్రకటించింది. అయితే ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటనలతో మీడియాను ఆకర్షించారు. తాను కడప ఎంపీగా పోటీ చేయడానికైనా సిద్ధమని, భూపేష్ జమ్మలమడుగు నుంచి పోటీచేసేలా ఇరుపార్టీల అధిష్టానాలతో మాట్లాడ్తానన్నారు.
ఇదంతా ఆదినారాయణరెడ్డి డ్రామా అని వెంటనే జనం చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. జమ్మలమడుగులో తనకు భూపేష్‌రెడ్డి వర్గంతో బాగా పని చేయించుకునేందుకు ఆదినారాయణరెడ్డి ఆడుతున్న నాటకమని తెలిసిపోయింది. తన అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి చెవితో పే…ద్ద కమలం పువ్వును ఆదినారాయణరెడ్డి పెడుతున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పసిగట్టారు. జమ్మలమడుగులో అభ్యర్థి మార్పుపై టీడీపీ ఖండించింది.
అలాగే జమ్మలమడుగులో శుక్రవారం కూటమి నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి ఉంటారనే తేలిపోయింది. ఇరువురు అభ్యర్థులు తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అంతే తప్ప, కడప నుంచి తాను, జమ్మలమడుగు నుంచి భూపేష్ పోటీ చేస్తారనే నాటకానికి ఆదినారాయణరెడ్డి ఫుల్స్టాప్ పెట్టారు.
భూపేష్‌రెడ్డి మూడేళ్లుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో కష్టపడ్డారు. దాని ఫలితాన్ని అందుకునే సమయంలో ఆదినారాయణరెడ్డి తన రాజకీయ స్వార్థంతో అడ్డుకున్నారు. భూపేష్‌రెడ్డి ఎమ్మెల్యే అవుతారని కలలు కంటున్న ఆయన కుటుంబం ఆదినారాయణరెడ్డి రాజకీయ స్వార్థాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అయితే దాన్ని కప్పి పెట్టి, తామంతా ఐక్యంగా ఉన్నామని జనం ముందు ఆదినారాయణరెడ్డి షో చేసేందుకు శ్రమిస్తున్నారు. టీడీపీ శ్రేణులు ముద్దుగా బిల్డప్ బాబాయ్ అని పిలుచుకుంటున్నాయి. తమ నాయకుడిని రాజకీయంగా తడిగుడ్డతో గొంతు కోశారని ఆదిపై భూపేష్ వర్గం రగిలిపోతోంది.