కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన మాటతీరులో, వైఖరిలో, ధోరణిలో ఏమీ మార్పు లేదు. కాకపొతే అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో, పొగరుతో, తలబిరుసుతో మాట్లాడేవాడు. అధికారం పోయాక, పార్టీ చిన్నాభిన్నం అవుతున్న దృశ్యం చూస్తున్నాక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ తో బూతులు లంకించుకుంటున్నాడు.
కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీని, ప్రభుత్వాన్ని మాత్రమే తిడుతున్నాడు. బీజేపీని ఏమీ అనడంలేదు. కూతురు జైల్లో ఉంది కాబట్టి ఎందుకైనా మంచిదని బీజేపీని తిట్టడంలేదేమో. హేతుబద్ధంగా విమర్శలు చేయడం అసలు కేసీఆర్ కు అలవాటులేని పని. కేసీఆర్ ను చూసే కాంగ్రెస్ నాయకులూ బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అంటాడు.
అధికారం పోయాక చాలా కాలం కేసీఆర్ బయటకే రాలేదు. పవర్ పోగానే జనం ముందుకు రాలేక జారిపడి తుంటి విరిగిందని హాస్పిటల్లో చేరాడు. అది నాటకమని కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారనుకోండి. అది వేరే సంగతి. తరువాత రెండో మూడో బహిరంగ సభల్లో మాట్లాడాడు. సూర్యాపేటలో మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఆ తరువాత ఎండిపోయిన పంటలను పరిశీలించడం మొదలుపెట్టాడు. జిల్లాల్లో తిరుగుతున్నాడు.
తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిన పంటలు పరిశీలించాడు. రైతులతో మాట్లాడాడు. ఎప్పటిమాదిరిగానే ప్రభుత్వాన్ని బూతులు తిట్టాడు. ఆయన భాష తెలిసిందే కదా. నోరు తెరిస్తే ముందుగా చవటలు, దద్దమ్మలు అనే అంటాడు. అలాగే అన్నాడు. లత్కోరులు, అసమర్ధులు. చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని అన్నాడు.
చేనేత కార్మికులు బతుకమ్మ చీరల ఆర్డర్ గురించి అడిగితే ఎవరో కాంగ్రెస్ నాయకుడు నిరోధ్ లు అమ్ముకోవాలని అన్నాడట. అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ నిరోధ్ లు అమ్ముకొని బతకాలారా కుక్కల కొడుకుల్లారా… లక్షాలాదిమంది చేనేత కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తారా ? అంటూ మండిపడ్డాడు. తాను ఎక్కడికి పొతే అక్కడ పొలాలకు నీళ్లు వదులుతున్నారని అన్నాడు.
తాను కరీంనగర్ కు పోగానే కాళేశ్వరం పంపుల నుంచి నీళ్లు వదిలారని చెప్పాడు. సూర్యాపేటకు పొతే అక్కడా నీళ్లు వదిలారని చెప్పాడు. సిగ్గులేదా అన్నాడు. ఎన్నికలు కాగానే పదివేలమంది రైతులతో కలిసి మేడిగడ్డకు పోతానని చెప్పాడు. అడ్డగిస్తే తొక్కుకుంటూ పోతానన్నాడు. కాంగ్రెస్ ను తిట్టడంలో కేసీఆర్ చెలరేగిపోతాడు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా బూతులు కురిపించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నే టార్గెట్ చేసుకున్నాడు. బీజేపీ పట్ల మౌనంగా ఉన్నాడు.
కాంగ్రెస్ చేతిలో తాను చావుదెబ్బ తిన్నాననే చేదు నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే కాంగ్రెస్ వాళ్లకు బాగుచేయించడం చేతకావడంలేదా? అని ఇదివరకు ప్రశ్నించాడు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయింది తన హయాంలో అనే సంగతి ఆయనకు గుర్తు లేదేమో. అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు.
మీడియా సమావేశంలో ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళను అవమానించేవాడు. దిమాక్ ఉందా? తలకాయ ఉందా? ఏ పేపర్ నీది? అని పరాభవించేవాడు. ఇప్పుడేమో మీరు తెలివైనవాళ్లు, వివేకవంతులు అంటున్నాడు. అధికారం పోగానే మీడియావాళ్లు వివేకవంతులైపోయారు. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉన్నట్లుంది. అధికారంలో ఉన్నప్పుడు అహకారం ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు నిరాశ, నిస్పృహ చోటుచేసుకున్నాయి.