Advertisement

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజు - ఏం జరుగుతోంది?

దిల్ రాజు - ఏం జరుగుతోంది?

వ్యక్తిగా దిల్ రాజు మంచి మనిషి. తన సినిమాలు తనవి, తన వ్యాపారాలు తనవి అంతే తప్ప వేరే యావ లేదు.  కానీ తెలిసో, తెలియకో పర్సనల్ గ్లోరిఫై కోరుకుంటూ తప్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం దిల్ రాజు బ్యానర్ లో చెప్పుకో దగ్గ హీరో సినిమా లేదు. ఇప్పుడు కూడా వున్నవి రెండు ఒకటి నిన్న విడుదలైన ఫ్యామిలీ స్టార్. ఇంకోటి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. తరువాత వుంటే కనుక నాని-బలగం వేణు సినిమా.

కొన్నాళ్ల క్రితం చేతిలో నోటెడ్ హీరో సినిమా లేనపుడు దిల్ రాజు కిందా మీదా పడ్డారు. విజయ్ దేవరకొండ తో సినిమా సెట్ చేసుకున్నారు. కానీ కథ విషయంలో విజయ్ దేవరకొండ అంత సంతృప్తి చెందలేదని వార్తలు వినిపించాయి. కానీ అంతలోనే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఎక్కడ ఏం జరిగింది అన్నది తెలియదు. మొత్తానికి అటు 14 రీల్స్, ఇటు అల్లు అరవింద్ లను కాదని దర్శకుడు పరుశురామ్ సినిమాను దిల్ రాజు కు చేసారు. దీని వెనుక చాలా జరిగింది. అల్లు అరవింద్ ను బతిమాలుకోవడాలు, 14 రీల్స్ కు డబ్బులు కట్టడాలు ఇలా చాలా వార్తలు వినిపించాయి. మొత్తానికి సినిమా స్టార్ట్ అయింది.

దిల్ రాజు దగ్గర రైటర్లు, డైరక్టర్ల టీమ్ వుంటుంది. వీళ్లంతా కలిసి కథలు వండుతారు. సినిమాలు సరి చేస్తారు. చాలా వుంది. కానీ ఇక్కడ వున్నది పరుశురామ్. ఆయన ఎవ్వరి మాటా వినడు. ఆయన అనుకున్నదే తీస్తాడు. ఆయన అనుకున్నదే చూపిస్తాడు. అది ఇండస్ట్రీ జనాలకు తెలిసిన వాస్తవం. అందవల్ల తొలిసగం పట్టుకుని సినిమా మేకింగ్ కు దిగిపోయారు. మలిసగం ఎక్కడిక్కడ వండుకున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాత ఇలాంటివి అస్సలు అంగీకరించరు. కానీ సినిమా చేయాల్సిందే అనే పట్టుదల వల్ల కావచ్చు. తల ఊపారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు 100 కోట్లకు పైగా ఖర్చయింది అని వార్తలు వినిపిస్తుంటే చాలా మంది.. అవునా.. నిజ్జమా.. అంటున్నారు. కానీ కేవలం రెమ్యూనిరేషన్లకే 50 కోట్ల వరకు ఖర్చయింది. సెట్ లు వేసారు. చాలా రోజులు షూట్ చేసారు. రీ షూట్ లు చేసారు. దాదాపు నాలుగు గంటల ఫుటేజ్ వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఎడిటర్ ఏం చెప్పినా, దిల్ రాజు ఏం చెప్పినా దర్శకుడు పరుశురామ్ వినలేదని, దాని మీద చాలా మల్ల గుల్లాలు పడ్డారని కూడా వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీ, గిల్డ్, పొదుపు, కంట్రోలు అని మార్గదర్శనం చేసే దిల్ రాజు పరిస్థితి ఇలా వుంటే ఎలా?

ఇక సినిమా పబ్లిసిటీ స్టార్ట్ అయింది. నిర్మాత దిల్ రాజే సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు కనిపించింది. ఆయనే ఇంటర్వూ చేసేసారు. ఆయనే డ్యాన్స్ లు, ఆయనే పాటలు, ఆయనే మాటలు.. హడావుడి అంతా ఆయనదే. ఆయన సినిమా.. ఆయనే కీ అట్రాక్షన్ అని అలా చేసి వుంటారు అని అనుకోవచ్చు. అనొచ్చు. నిజానికి దిల్ రాజు డ్యాన్స్ చేసినా, పాట పాడినా అది వైరల్ నే. కానీ ఆ వైరల్ కావడం అన్నది ఆయన వరకు పనికి వస్తుంది కానీ సినిమాకు కాదు. సినిమా కు సినిమా యాంగిల్ లోనూ, హీరో, హీరోయిన్ల యాంగిల్ లోనూ ప్రచారం సాగాలి.

దిల్ రాజు డ్యాన్స్ చేసారు, పాట పాడారు అని వార్తలు వచ్చాయి తప్ప ఫ్యామిలీ స్టార్ ప్రచారం కాదు. ఈ రోజు ఓపెనింగ్ తక్కువ వుంది ఎందుకు అనుకుంటున్నారు కానీ సినిమాకు దిల్ రాజు చేసిన ప్రచారం యాంగిల్ కరెక్ట్ కాదు అనుకోవడం లేదు. విజయ్ దేవరకొండ లాంటి హీరో, మృణాళ్ లాంటి హీరోయిన్ ను తీసుకుని, పరుశురామ్ తో దిల్ రాజు సినిమా తీస్తే ఓపెనింగ్ కుమ్మేయాలి కదా? మరి ఎందుకు ఓపెనింగ్ తగ్గింది. కానీ ఆ పాయింట్ జనాల్లోకి పంపకుండా, మిడిల్ క్లాస్… ఆ ఫ్యామిలీ హీరో అంటూ ఏదోదే చెప్పారు. ఎంత సేపూ తన కుటుంబానికి తాను స్టార్.. ఎవరి కుటుంబానికి ఎవరు స్టార్ అంటూ మాట్లాడారు.

ఇవన్నీ జనాలకు అక్కరలేదు. సినిమా ఏంటీ? సినిమాకు మొదటి రోజు మార్నింగ్ షో కి ఎందుకు వెళ్లాలి అనే దిశగా ప్రచారం సాగించలేదు అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మీడియా జనాలను అందరిని తీసుకువచ్చి, ఎవరి ఫ్యామిలీ స్టార్ ఎవరు అంటూ నానా హడావుడి చేసారు. దాని వల్ల సినిమాకు ఒరిగింది ఏమిటి?  ఖర్చు చేసేసారు. కానీ సినిమా పేరు, స్టార్ కాస్ట్ ఈ హడావుడి అంతా జనంలోకి వెళ్లలేదు.

ఇవన్నీ ఇలా వుంచితే మంచి మిడిల్ క్లాస్ పాయింట్ తో సినిమా తీసారు. సంతోషం. సీతమ్మ వాకిట్లో… శతమానం భవతి మంచి ఫ్యామిలీ సినిమాలు. ఫ్యామిలీ లను టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా తీస్తూ, విలన్ ఓ గృహిణిని పట్టుకుని, ఆటో వస్తుంది ఎక్కి రా… గంటలో పంపించేస్తా, బాకీ తీరిపోతుంది లాంటి సీన్ రాయడం అంటే ఏమనాలి? ఇప్పటి వరకు సినిమాల్లోకి రాని ‘మగ వ్యభిచారాన్ని’ తెరమీదకు తీసుకురావడం అంటే ఏమనాలి?

సీతమ్మ వాకిట్లో, శతమానం భవతి ఎంత క్లీన్ గా వుంటాయి. ఆ సంగతి దిల్ రాజు కు గుర్తు లేదా. పరుశురామ్ వినలేదా? ఆవేశంలో సినిమాలు తీయకూడదు. అలా కాదు ఇలా చేసి చూపిస్తా అని తొందరపడకూడదు.  ఇలాంటి పాఠాలు కొన్ని ఫ్యామిలీ స్టార్ నేర్పుతుంది. తొందరలో తప్పులు చేస్తున్నా దిల్ రాజును ఒకందుకు మాత్రం ఎప్పడూ మెచ్చుకొవాలి. మంచి సినిమాలు అందించాలి అనే ఆయన తపనను. అందువల్ల ఆయన బ్యానర్లో మంచి సినిమాల జాబితా అనేది ఒకటి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?