నెల్లూరు రాజకీయాల్లో త్వరలో పెను సంచలనమే జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయకులు… తిరిగి జగన్ చెంతకు చేరనున్నారనే ప్రచారం ఆ జిల్లాలో చక్కర్లు కొడుతోంది. టీడీపీలో ఇమడలేకపోవడం, ప్రజల నుంచి వారికి తగిన ఆదరణ దక్కకపోవడంతో వైసీపీ గూటికి చేరేందుకు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
వైసీపీలో ఆ దంపతులిద్దరికీ ఎంతో గౌరవం ఇచ్చేవారు. నేరుగా సీఎం జగన్‌తో మాట్లాడేంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఆ దంపతులకు వుండేది. భార్యాభర్తలిద్దరికీ పదవులు కూడా దక్కాయి. అయితే క్షణికావేశంలో పార్టీకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా భార్యాభర్తలు బరిలో దిగారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో తాము రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అర్థమైంది.
దీంతో ఆ దంపతులు పునరాలోచనలో పడ్డారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నామినేషన్ల సమయానికి నెల్లూరు జిల్లాలో పెద్ద సంచలనమే జరగనుందని ఆ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేయడం, టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలను భరించలేని స్థాయిలో వుండడంతో హర్ట్ అయ్యారని తెలిసింది. అసలే సున్నిత మనస్కులైన ఆ దంపతులు, అనవసరంగా పార్టీ మారి, అభాసుపాలవుతున్నామనే పశ్చాత్తాపం చెందుతున్నట్టు తెలిసింది.
వైసీపీలో వారిపై వ్యతిరేకత లేకపోవడంతో, తిరిగి తీసుకోడానికి ఎలాంటి అభ్యంతరం వుండదు. అంతేకాదు, ఆ దంపతులకు వైసీపీ సొంత ఇల్లు అనేంత ఆత్మీయ అనుబంధం జగన్‌తో వుంది. కావున నెల్లూరు జిల్లాలో రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. కాలమే అన్నిటికీ జవాబు చెప్పాలి.