చంద్రబాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దుతారా?

నియోజకవర్గ అభివృద్ధి నిధి.. సింపుల్ గా చెప్పాలంటే ఎమ్మెల్యే ఫండ్ అంటారు దీన్ని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలో చిన్నచిన్న అభివృద్ధి పనులు చేయడానికి ఎమ్మెల్యేలకు ఆధారంగా…

నియోజకవర్గ అభివృద్ధి నిధి.. సింపుల్ గా చెప్పాలంటే ఎమ్మెల్యే ఫండ్ అంటారు దీన్ని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలో చిన్నచిన్న అభివృద్ధి పనులు చేయడానికి ఎమ్మెల్యేలకు ఆధారంగా ఉన్న ఏకైక నిధి ఇది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఎమ్మెల్యేకు ఈ నిధి అందుబాటులో ఉండేది. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ నిధిని పూర్తిగా తీసేశారు.

కొత్త రాష్ట్రం, రెవెన్యూ లోటు అంటూ ఎమ్మెల్యే ఫండ్ కు తూట్లు పొడిచారు బాబు. తమ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎక్కడ మంచి పేరు కొట్టేస్తారేమో అనే భయంతో చంద్రబాబు ఈ నిధిని నిలిపివేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ ఫండ్ లేకపోయినా ఫర్వాలేదు. ప్రభుత్వం వాళ్లది కాబట్టి ఎలాగోలా నిధులు తెచ్చుకుంటారు. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితేంటి? వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి సంగతేంటి?

నిజానికి ఈ నిధిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు బాబు. నేదురుమల్లి జనార్థనరెడ్డి ప్రవేశపెట్టిన నిధి ఇది. ఆ వెంటనే బాబు వచ్చి దీన్ని ఆపేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిధిని పునరుద్ధరించారు. అంతేకాదు, ఫండ్ ను కోటి రూపాయలకు పెంచారు కూడా. ఆ వెంటనే తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మరోసారి దీన్ని ఆపేశారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ నిధిని రెట్టింపు చేస్తే, చంద్రబాబు మాత్రం ఏపీలో పూర్తిగా నిలిపివేశారు.

గడిచిన ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. అధికారులు సహకరించలేదు. ఎమ్మెల్యే ఫండ్ రిలీజ్ చేయలేదు. అలా వైసీపీ ఎమ్మెల్యేలకు చేతులు కట్టేసినట్టయింది. తమ తమ నియోజకవర్గాల్లో వీళ్లంతా చాలా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాలకు భారీగా నిధులు తెచ్చుకున్నారు. అదే ఎమ్మెల్యే ఫండ్ ఉంటే, వైసీపీ గెలిచిన సెగ్మెంట్లలో కూడా అంతోఇంతో పనులు జరిగేవి. కానీ బాబు ఆ అవకాశం ఇవ్వలేదు.

ఇప్పుడు జగన్ వంతు రానే వచ్చింది. వైసీపీ అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ చెబుతున్న వేళ.. జగన్ ఈ నిధిని మరోసారి పునరుద్ధరిస్తారని అంతా ఆశిస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధిని మరోసారి వెలుగులోకి తీసుకురావడంతో పాటు తండ్రి బాటలో ఆ నిధి మొత్తాన్ని పెంచుతారని అంతా భావిస్తున్నారు. అలా బాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దుతారో లేదో చూడాలి. 

వర్మపై అంత దాష్టికం అవసరమా బాబు