Advertisement

Advertisement


Home > Politics - National

గిన్నిస్ బుక్ 2023.. ఆ 4 రికార్డులు అమోఘం

గిన్నిస్ బుక్ 2023.. ఆ 4 రికార్డులు అమోఘం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. ఏటా చాలా రికార్డులు ఇందులో నమోదవుతుంటాయి. కొన్నింటిని కొంతమంది అధిగమిస్తుంటారు. మరికొన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ అవుతాయి. అలా 2023లో కూడా ఎన్నో రికార్డులు గిన్నిస్ బుక్ లో నమోదయ్యాయి. వీటిలో ఇండియా నుంచి నమోదైన 4 రికార్డుల్ని.. ఈ ఏడాది బెస్ట్ గా చెప్పుకొచ్చింది గిన్నిస్ బుక్.

పేక ముక్కల సౌధాలు.. అర్నవ్ దగా.. కోల్ కతాకు చెందిన ఈ కుర్రాడి వయసు 15 ఏళ్లు. కానీ ఇతడు సాధించిన ఘనత మాత్రం చాలా పెద్దది. పేక ముక్కలతో చాలామంది చాలా రకాల ఆకృతులు చేశారు. కానీ అర్నవ్ చేసిన ప్రయత్నం మాత్రం అమోఘం. ఈ కుర్రాడు ఏకంగా పేక ముక్కులతో అతిపెద్ద కట్టడాల్ని పునఃనిర్మించాడు. రైటర్స్ బిల్డింగ్, షాహిద్ మీనార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చ్ ను ఇతడు పేకముక్కలతో నిర్మించాడు. దీని కోసం ఏకంగా లక్షా 32వేల పేక ముక్కల్ని వినియోగించాడు. పేక ముక్కలతో నిర్మించిన అతిపెద్ద కట్టడాలుగా గిన్నిస్ బుక్ ఎక్కాయి ఈ నిర్మాణాలు.

జుట్టుతో గిన్నిస్ రికార్డ్.. కేవలం తన జుట్టుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది స్మితా శ్రీవాస్తవ. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ మహిళ భారీగా జుట్టు పెంచింది. ఎంతలా అంటే, ఆమె పెంచిన జుట్టు పొడవు అక్షరాలా 7 అడుగుల 9 ఇంచీలు. ఇంత పొడవాటి జుట్టుతో బతికున్న ఏకైక వ్యక్తిగా స్మిత, గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు.

ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్.. సృజనకు అంతులేదంటారు. ఇది కూడా అలాంటిదే. బిహార్ కు చెందిన నవరతన్ ప్రజాపతి అనే వ్యక్తి ఓ చెక్క స్పూన్ చేశాడు. అది అలాంటిలాంటి స్పూన్ కాదు. ప్రపంచంలోనే చెక్కతో చేసిన అత్యంత చిన్న స్పూన్. దాని పరిమాణం కేవలం 0.06 ఇంచీలు. అంటే, దాదాపు కంటికి కనిపించదన్నమాట. చెక్కతో వస్తువులు చేయడం చాలా ఈజీ. కానీ ఇలాంటి అతిచిన్న వస్తువులు చేయడం చాలా కష్టం అంటున్నాడు ప్రజాపతి.

ఏకథాటిగా డాన్స్.. డాన్స్ చాలామందికి ఇష్టం. ఎంతిష్టం అని అడిగితే మాత్రం ఏకథాటిగా 5 రోజుల పాటు డాన్స్ చేసేంత ఇష్టం అని చెబుతుంది సృష్టి. 16 ఏళ్ల సృష్టి సుధీర్, డాన్స్ లో గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. 127 గంటల పాటు స్టేజ్ పై డాన్స్ చేసి ఈ రికార్డ్ సాధించింది. 'లాంగెస్ట్ డాన్స్ మారథాన్' పేరిట ఆమె చేసిన ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ గుర్తించింది.

వీటితో పాటు మరిన్ని రికార్డులు ఈ ఏడాది గిన్నిస్ బుక్ లోకి ఎక్కాయి. ఐదేళ్ల బుడతల నుంచి 50 ఏళ్ల వ్యక్తుల వరకు చాలామంది తమ కఠోర దీక్షతో గిన్నిస్ బుక్ ఎక్కారు. ఇండియాకు సంబంధించి, గిన్నిస్ బుక్ ప్రకటించిన టాప్ రికార్డులు మాత్రం ఈ నాలుగే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?