Advertisement

Advertisement


Home > Politics - National

కేంద్రం పరువు ఇలా కూడా పోతుందా?

కేంద్రం పరువు ఇలా కూడా పోతుందా?

కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న ఏకపక్ష పోకడల మీద దేశంలో విపక్షాల నుంచి చాలా చాలా విమర్శలున్నాయి. కానీ పార్లమెంటులో సంపూర్ణమైన మెజారిటీ ఉండడంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ వస్తున్నా.. తోసిరాజనుకుంటూ వారు ముందుకు వెళ్లిపోతూ ఉన్నారు.

అయితే ఇటీవలి అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యంగా మూడు చోట్ల అపురూపమైన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వంలోని దురహంకారం మరింత పెరిగిందా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. పార్లమెంటు నుంచి ఏకంగా 146 మంది సభ్యులను సస్పెండ్ చేసేసి.. సభను నడిపిస్తున్న తీరు, మూడు క్రిమినల్ బిల్లుల వంటి అత్యంత కీలకమైన వాటిని కూడా ప్రతిపక్షాలు లేకుండానే చట్టాలుగా మార్చేయడం వంటి చర్యలు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

మొత్తానికి ఏకంగా 146 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి కార్యకలాపాలను నడిపించడం అనేది మోడీ సర్కారు అహంకార ప్రతీకగా వారి పరువు తీసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ వ్యవహారాలపై చర్చించడానికి రాజ్యసభ ఛైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ , కాంగ్రెసు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలవడానికి చేసిన ప్రయత్నం రెండోసారి కూడా ఫలించలేదు. తనను కలవడానికి రావాల్సిందిగా జగదీప్ రెండోసారి ఖర్గేకు రాసిన లేఖకు కూడా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీలో లేనని, వచ్చిన తరువాత కలుస్తానని ఆయన రిప్లై ఇచ్చారు.

అయితే జవాబుగా రాసిన ఈ లేఖలో ఖర్గే ప్రస్తావించిన సంగతులు ముఖ్యమైనవి. ‘మీ ఛాంబర్లో జరిగే చర్చతో సమస్యకు సమాధానం లభించకపోవచ్చు’ అంటూ ఖర్గే పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం వ్యూహంలో భాగంగానే సస్పెన్షన్లు జరుగుతున్నాయని, ఎలాగోలా సభను నడిపేయాలనే తప్ప.. ప్రతిపక్షాల గొంతుకకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని ఖర్గే విమర్శించారు. సభలో లేని సభ్యుడి మీద కూడా సస్పెన్షన్ వేటు పడడం అనేది సభ అనుసరిస్తున్న అహంకారానికి నిదర్శనం విమర్శల పాలవుతోంది.

అదేసమయంలో.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వెటకారం చేసిన వైనం కూడా సంచలనం అవుతోంది. మిమిక్రీ కూడా భావ వ్యక్తీకరణలో ఒక భాగమేనని, నిరసన తెలియజేసే హక్కు తనకున్నదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన వాదిస్తున్నారు. ఆయన వెటకారాన్ని రాహుల్ గాంధీ వీడియో తీయడాన్ని కూడా .. కాంగ్రెసు నుంచి బయటకు వెళ్లిన సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తప్పులేదని అంటున్నారు.

ఢిల్లీ రాజకీయ పరిణామాలు.. సస్పెన్షన్ల నేపథ్యంలో చాలా వేడిగా ఉన్నాయి. కేంద్రం మెట్టుదిగని వైఖరి మాత్రం వారి ఒంటెత్తు పోకడలకే నిదర్శనంగా ప్రజలు గుర్తిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?