Advertisement

Advertisement


Home > Politics - National

కొత్త సంవ‌త్స‌రం.. రీప్లేస్ చేసుకోవాల్సిన అల‌వాట్లు!

కొత్త సంవ‌త్స‌రం.. రీప్లేస్ చేసుకోవాల్సిన అల‌వాట్లు!

ఇంకో కొత్త సంవ‌త్స‌రం వ‌స్తోంది. కొత్త ఆశ‌ల‌తో, కొత్త ఆశ‌యాల‌తో సాగిపోవడానికి కావాల్సిన స్ఫూర్తిని సంత‌రించుకోవాల్సిన సంద‌ర్భం ఇది. కొత్త సంవ‌త్స‌రంతో ఏదీ మార‌దు.. క్యాలెండ‌ర్ త‌ప్ప అనేది నిరాశ‌వాదానికి ఒక ప్ర‌తీక‌.  మార్చాల‌నుకుంటే ఏదైనా మారుతుంది, క్యాలెండ‌ర్ తో స‌హా! కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భం నుంచి అల్టిమేట్ గా సంపాదించుకోవాల్సింది స్ఫూర్తి. క్యాలెండ‌ర్ ను మార్చ‌డంతో పాటు మ‌న‌లో మార్చుకోవాల్సిన వాటిని కూడా మార్చుకోవ‌డానికి కొత్త సంవ‌త్స‌రం త‌గిన సంద‌ర్భం కాగ‌ల‌దు. మ‌రి  కొత్త సంవ‌త్స‌రంలో రీప్లేస్ చేసుకోద‌గిన అల‌వాట్ల‌ను ఇప్పుడు ప్ర‌స్తావించుకోవ‌చ్చు.

వాయిదా ప‌ద్ధ‌తిని!

దేన్నైనా వాయిదా వేయ‌డం, చేయాల్సిన ప‌నిని చేయాల్సిన‌ప్పుడు చేయ‌క‌పోవ‌డం రీప్లేస్ చేసుకోవాల్సిన అల‌వాట్ల‌లో ముఖ్య‌మైన‌ది. వాయిదా ప‌ద్ధ‌తికి వీడ్కోలు ప‌లికి.. ఏది చేయాల్సిన సంద‌ర్భంలో దాన్ని చేసేందుకు శ్రీకారం చుట్ట‌డం కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా అలవాటు చేసుకోద‌గిన గొప్ప మార్పు!

సెల్ఫ్ నెగిటివిటీ!

నేనేం చేయ‌గ‌ల‌ను, నేనేం సాధించ‌గ‌ల‌ను, నాతో అవుతుందా? అనే వ్య‌ర్థ‌పు అంచ‌నాల‌ను, ఆలోచ‌నల‌ను ప‌క్క‌న పెట్టి, ఈ సెల్ఫ్ నెగిటివిటీని పూర్తిగా ప‌క్క‌కు తోసి.. సెల్ఫ్ కంప్యాష‌న్ ను అల‌వాటు చేసుకోవాలి. బ‌య‌టి వాళ్లే మ‌న‌ల్ని ఎన్నో విమ‌ర్శిస్తూ ఉంటారు. నెగిటివ్ ఆలోచ‌న‌ల‌ను వేస్తూ ఉంటారు. వాటినే లైట్ తీసుకుని ముందుకు క‌ద‌లాలి. సెల్ఫ్ క్రిటిసిజం మంచిదే, అయితే అది ఏదైనా త‌ప్పులు చేస్తున్న‌ప్పుడు ఉండాలి. ఏదైనా సాధించాల‌నే సంక‌ల్పం ఉన్న‌ప్పుడు మాత్రం నెగిటివిటీని పూర్తిగా దూరం పెట్టాలి. ఇలాంటి అల‌వాట్ల‌ను చేసుకోవ‌డానికి నూత‌న సంవ‌త్స‌ర‌మే ప్ర‌త్యేకంగా అవ‌స‌రం లేదు. కొత్త సంవ‌త్స‌రం అనే ఫీలింగ్ ఉన్న వేళ మార్పుకు ఇదొక శ్రీకారం అవుతుంది.

మ‌జ్జుగా, లేజీగా ఉండ‌టాన్ని!

శారీర‌క శ్ర‌మకు చాలా ఉద్యోగాలు ఇప్పుడు ఆస్కారం ఇవ్వ‌వు. మాన‌సిక శ్ర‌మ‌, కూర్చుని ప‌ని చేయ‌డ‌మే త‌ప్ప శారీర‌క శ్ర‌మ ఉండే ఉద్యోగాలు త‌క్కువ‌! మ‌రి కూర్చుని ప‌ని చేసే వాళ్లు, ఖాళీ దొరిక‌తే మ‌ళ్లీ కూర్చుని విశ్రాంతి తీసుకోవ‌డ‌మే చేసే ప‌ని. అయితే ఈ లేజీనెస్ ను వ‌దిలి శారీర‌క శ్ర‌మ చేయ‌డానికి క‌ద‌లాలి. న్యూ ఇయర్ సంద‌ర్భంగా చాలామంది తాము చేయాల‌నుకుంటున్న మార్పుల్లో జిమ్ లో చేర‌డాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఏదో ఒక‌టీ రెండు రోజుల‌తో ఆ ముచ్చ‌ట ముగుస్తుంది. వ్యాయామం చేయాలంటే జిమ్ కే వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లోనే చేసుకోద‌గిన వ్యాయామం బోలెడంత ఉంది. అలా మొద‌లుపెట్టినా అది మంచి మార్పే అవుతుంది!

అన్ హెల్దీ ఈటింగ్!

ఇది కూడా మార్చుకోవాల్సిన అల‌వాటు. మ‌న శ‌రీర‌రానికి ఏ ఫుడ్ ప‌డుతోంది, ఏది ప‌డ‌టం లేద‌నే స్ప‌ష్ట‌త‌ను  శ‌రీర‌మే ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తూ ఉంటుంది. మారి దాన్ని అర్థం చేసుకుని ఆహార‌పు అల‌వాట్ల‌ను కూడా మార్చుకోవాలి. దీనికి కూడా న్యూఇయ‌ర్ నే మంచి త‌రుణంగా తీసుకోవ‌చ్చు!

మెండ్ లెస్ సోష‌ల్ మీడియా వినియోగం!

రీల్స్ చూస్తూ కూర్చుంటే టైమ్ కూడా తెలియ‌దు! గంట‌ల‌కు గంట‌లు కూడా ఇట్టే గ‌డిచిపోతాయి! మ‌రి అందులో ఉన్న‌ది 90 శాతం చెత్తే! వంద‌కు వంద శాతం కూడా చెత్తే చూసే వాళ్లూ ఉంటారు. సోష‌ల్ మీడియా వినియోగం ప‌రాకాష్ట‌కు చేరింది. మైండ్ లెస్ గా మారింది. మ‌రి దీన్ని త‌గ్గించుకుంటే చాలా మంచిది. ప‌ఠ‌నం పూర్తిగా పోయి, వీడియోలు చూడ‌టం అల‌వాటుగా మారిన వారు దాన్ని మంచి అల‌వాటుతో రీప్లేస్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. న్యూ ఇయర్ సంద‌ర్భంగా చేసుకోదగిన మార్పు ఇది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?