సర్ ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫారం-6, ఫారం-7, ఫారం-8లను ఎన్నికల సంఘం మార్చడానికి వీల్లేదని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఓటర్ నమోదు, తొలగింపు, వివరాల నమోదుకు సంబంధించి ఫారాలు-6,7,8లను మార్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఓటర్ల జాబితాలో ఆల్రెడీ పేరున్న వారిని తిరిగి కొత్త ఓటర్‌గా ఎందుకు పరిగణిస్తున్నారు? వాళ్లంతా ఫారం-6 నింపాల్సిన అవసరం ఏంటని ఈసీని సుప్రీంకోర్టు నిలదీసింది.
కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వాళ్లు మాత్రమే ఫారం-6 నింపుతుంటారు. అలాగే చిరునామా మార్పు కోసం ఫారం-8ను వినియోగిస్తుంటారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా గతంలో ఏ ఓటరు జాబితాలో తమ పేరు లేదని ఆల్రెడీ ఓటు నమోదైన వారితో ఫారం-6 నింపించడం ఏంటంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. దీంతో సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్న వేయడం గమనార్హం.
అలాగే అర్హులైన ఓటర్ల వద్దకు ఎన్నికల సంఘమే వెళ్లి, వారి పేర్లు జాబితాలో వుండేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఓటరు జాబితాలో మార్పుచేర్పుల కోసం నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది.
ఫారం నింపలేదనే కారణంతో ఓటు తొలగించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హులకు ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మీదే అని ఈసీని ఉద్దేశించి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.
