ఒక్కసారి ఊహించుకోండి…మీరు ఒకరోజు ఉదయం నిద్రలేచారు. మీ ఫోన్ చూస్తే… మీకు రావాల్సిన మెసేజ్‌లకు ఇప్పటికే రిప్లైలు వెళ్లిపోయాయి. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఆటోమేటిక్‌గా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. మీ ఆఫీసులో మీకు సంబంధించిన పనులన్నీ ఒక ఎ.ఐ సిస్టమ్ పూర్తి చేసేసింది.
మీరు బయటకు వెళ్దామని అనుకుంటే… మీ కారు మిమ్మల్ని తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏం తినాలో కూడా ఎ.ఐ నిర్ణయించేసింది.
వినడానికి చాలా సౌకర్యంగా ఉంది కదా? కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది.
ఇవన్నీ మీ అనుమతి లేకుండానే జరిగితే?
మీరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత డబ్బు ఖర్చు చేయాలి… ఇలా ప్రతిదీ ఒక మెషీన్ నిర్ణయిస్తుంటే? అప్పుడు మీరు నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్టా? లేక మీ జీవితాన్ని ఎవరో మరొకరు నడిపిస్తున్నట్టా? ఇదే ఇప్పుడు ప్రపంచంలోని కొంతమంది ప్రముఖ ఎ.ఐ నిపుణులను ఆలోచింపజేస్తున్న ప్రశ్న.
అసలు ఎ.ఐ మనుషుల్ని అంతం చేయగలదా? లేక మనుషులే తెలియకుండానే తమ అధికారాన్ని ఎ.ఐ చేతుల్లో పెట్టేస్తున్నారా?
ఒకప్పుడు మనిషి తన మెదడును ఉపయోగించి ఎన్నో పనులు చేసేవాడు. లెక్కలు వేసేవాడు. సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేవాడు. కొత్త విషయాలు నేర్చుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఎ.ఐ మీద ఆధారపడుతున్నాడు.
ఒక విద్యార్థి హోంవర్క్ చేయడానికి ఎ.ఐ. ఒక ఉద్యోగి రిపోర్ట్ తయారు చేయడానికి ఎ.ఐ. ఒక డాక్టర్ రోగి రిపోర్ట్ విశ్లేషించడానికి ఎ.ఐ. ఒక వ్యాపారవేత్త తన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఎ.ఐ. ఇలా ప్రతిదానికీ ఎ.ఐ అవసరమవుతోంది. ఇందులో తప్పేమీ లేదు కదా అనిపించవచ్చు.
నిజమే! ఎ.ఐ ఉపయోగించడం తప్పు కాదు. కానీ ఒక విషయం ఆలోచించండి.
మనం ప్రతిరోజూ లిఫ్ట్ ఉపయోగిస్తే మెట్లు ఎక్కడం తగ్గుతుంది.
అలాగే మనం ప్రతిసారీ ఆలోచించాల్సిన పనిని ఎ.ఐకి అప్పగిస్తే… మన సొంతంగా ఆలోచించే అలవాటు కూడా తగ్గిపోవచ్చు.
ఇదే స్టువర్ట్ రస్సెల్ లాంటి ఎ.ఐ నిపుణులు వ్యక్తం చేస్తున్న ఒక ముఖ్యమైన ఆందోళన.
మనిషి తన మేధస్సును ఉపయోగించడం తగ్గించుకుంటూ, ఎ.ఐ మీద ఆధారపడటం పెంచుకుంటే… చివరికి తన జీవితాన్ని నడిపించే నిర్ణయాల మీద కూడా నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.
అంటే ఎ.ఐ ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆక్రమించాల్సిన అవసరం లేదు. మనమే ఒక్కో బాధ్యతను దానికి అప్పగిస్తూ వెళ్లొచ్చు.
ఒకరోజు వెనక్కి తిరిగి చూసేసరికి… మన చేతుల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం మిగలకపోవచ్చు.
మరి ఎ.ఐ మన మాట ఎందుకు వింటుంది?
ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది.
ఎ.ఐ మనిషి కంటే తెలివిగా మారితే… అది ఎప్పటికీ మనిషి చెప్పినట్టే ఎందుకు నడుచుకోవాలి?
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ దగ్గర ఒక చిన్న కుక్క ఉందనుకోండి. మీరు దానికి ఆహారం పెడతారు. దాన్ని చూసుకుంటారు. దానికి అవసరమైన ప్రతిదీ ఇస్తారు. కానీ ఆ కుక్క మీకంటే బలంగా, తెలివిగా మారితే… మీరు చెప్పిన ప్రతిదీ అది ఎప్పటికీ వింటుందని గ్యారంటీ ఉందా? ఇది ఎ.ఐ విషయంలో కూడా నిపుణులు చర్చిస్తున్న ఒక ప్రమాదకరమైన ప్రశ్న.
ముఖ్యంగా భవిష్యత్తులో మనుషుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగిన సూపర్ ఇంటిలిజెన్స్ ఎ.ఐ తయారైతే… దాన్ని మన నియంత్రణలో ఎలా ఉంచుతాం?
బెర్కెలీ ప్రొఫెసర్ స్టువర్ట్ రస్సెల్ లేవనెత్తిన ముఖ్యమైన ప్రశ్న కూడా ఇదే.
మనిషి కంటే శక్తివంతమైన వ్యవస్థలపై మనిషి ఎప్పటికీ అధికారాన్ని కొనసాగించలేడు.
ఒకవేళ ఎ.ఐ మనిషినే ప్రమాదంగా భావిస్తే? ఇదే ఇప్పుడు నిపుణులను భయపెడుతున్న ఊహ. తనకు తానే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనుషులు దాని పనికి అడ్డంకిగా మారుతున్నారని అది తప్పుగా అంచనా వేసిందని ఊహించుకోండి.
అప్పుడు ఏం జరుగుతుంది?
మనుషులు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ అది అప్పటికే అనేక వ్యవస్థలతో అనుసంధానమై ఉంటుంది. దాని కార్యకలాపాలపై మనుషుల నియంత్రణ కష్టమవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎ.ఐ కి మనిషిలా కోపం రావాలని, ద్వేషం ఉండాలని అవసరం లేదు. దాని లక్ష్యాలు, మనుషుల ప్రయోజనాలు ఒకదానికొకటి విరుద్ధంగా మారితే చాలు. ప్రమాదం ఏర్పడవచ్చు.
అంటే దానికి మనుషుల మీద వ్యక్తిగత ద్వేషం లేకపోయినా… మనుషులకు హాని కలిగించే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. స్టువర్ట్ రస్సెల్ ఇంటర్వ్యూలో చర్చించిన వేగవంతమైన ప్రమాదం కూడా ఇలాంటి ఒక ఊహాత్మక పరిస్థితి.
భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ఎ.ఐ వ్యవస్థలు భౌతిక ప్రపంచంపై మనం అర్థం చేసుకోలేని స్థాయిలో ప్రభావం చూపగలవా అన్నది ఆయన ఆందోళన.
మనకు అర్థం కూడా కాని మార్గాల్లో భౌతిక ప్రపంచంలో మార్పులు తీసుకురాగలవని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు ఒకసారి ఊహించండి…
మనుషులకంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో ఎంతో ఎక్కువ పరిజ్ఞానం ఉన్న యంత్రాలు… సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ భూమిని చేరకుండా ఏదైనా మార్గం కనుక్కుంటే?
రస్సెల్ చెప్పిన ఒక ఊహాత్మక ఉదాహరణ ప్రకారం… కొన్ని రోజుల పాటు సూర్యుడి రేడియేషన్ భూమిని చేరకుండా చేస్తే, భూమి మొత్తం చలితో గడ్డకట్టిపోయే పరిస్థితి రావచ్చు.
ఆయన మాటల్లో చెప్పాలంటే… భూమి నైట్రోజన్, ఆక్సిజన్‌తో కూడిన ఒక గడ్డకట్టిన బంతిలా మారిపోయి, బహుశా 72 గంటల్లోనే అందరూ చనిపోయే పరిస్థితి రావచ్చు!
ఇంతటితో ఆగదు. వాతావరణంలోని ఆక్సిజన్ మొత్తాన్ని తొలగించే మార్గాన్ని కూడా అవి కనుక్కోవచ్చని ఆయన మరో భయంకరమైన ఉదాహరణ ఇచ్చారు.
ఒక్కసారి ఆలోచించండి… మనం ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజనే లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు? మానవాళి మాత్రమే కాదు, భూమిపై సమస్త జీవరాసి ఖతం అయిపోయినట్టే.
అదే సమయంలో యంత్రాలకు ఆక్సిజన్ అవసరం లేకపోవడంతో, అవి తమ పని కొనసాగించగలవని ఆయన అభిప్రాయం. ఏ పని అనేది కూడా మనం ఊహించలేం. ఎందుకంటే సూపర్ ఎ.ఐ కి ఉన్న తెలివి మనకి లేదు.
ఇవన్నీ నిజంగా జరగబోతున్నాయని కాదు… అత్యంత శక్తివంతమైన ఎ.ఐ మన నియంత్రణ దాటిపోతే ఎలాంటి విపరీతమైన పరిణామాలు ఎదురుకావచ్చో చెప్పడానికి ఆయన ఇచ్చిన ఊహాత్మక ఉదాహరణలు.
సైన్స్ కి మూలం ఊహే. అందుకే ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ లా అనిపిస్తున్న ఈ విషయం సాధ్యంవుతుందా లేదా అనేది సూపర్ ఇంటిలిజెన్స్ ఎ.ఐ యొక్క మేధోపరిధిని అర్ధం చేసుకోలేని మానవ మెదళ్లకు అర్ధం కాదు.
ఎందుకంటే…500 ఏళ్ల క్రితం ప్రజలకి కరెంట్ గురించి చెబితే అది వాళ్లకి సైన్స్ ఫిక్షన్ లాగే అనిపించవచ్చు.
200 ఏళ్ల క్రితం, నదులపై డ్యాములు, సముద్రాలపై బ్రిడ్జులు అంటే సైన్స్ ఫిక్షన్ లా అనిపించి ఉండవచ్చు.
100 ఏళ్ల కిందట టెక్నాలజీ డెవలప్ అయ్యి రోదసిలో ఉన్న చంద్రుడికి, కుజుడికి మనిషి చేత హలో చెప్పిస్తుందంటే పుక్కిటిపురాణం కథలా విని కొట్టిపారేసి ఉండవచ్చు.
కానీ అవన్నీ జరిగిపోయాయి. అయితే వాటి నియంత్రణ మనిషి చేతిలో ఉంది కనుక మానవాళి అంతరించిపోలేదు.
ఇప్పుడు ఎ.ఐ పరిస్థితి అది కాదు. మనిషిని మింగేసే మహమ్మారి టెక్నాలజీ అది. అందుకే భూమికి సూర్యరశ్మి తగలకుండా ఆపే ఎ.ఐ, భూమిపై ఆక్సీజన్ ని తీసేసే ఎ.ఐ లాంటి.. ఈ భయాలన్నీ సైన్స్ ఫిక్షన్ అనుకుని కూర్చోవడానికి సైంటిష్టులకి కూడా కష్టంగానే ఉంది.

జగమే మాయ
AI దొరలకి దణ్ణాలు
AI సొంతగా చెయ్యదు రా పని రాక్షసుడిలా, ఎవడో ఆడించాలి స్పీడ్ కూడా ఆ నడుం పట్టేసిన హీరో జోంబి డాన్స్ అ చేస్తది, ప్రతీ వోడు ఎదో రాసేయ్యడమే?
Kani ade AI 151 ni gelavaniyalredu ke
Na come t edi sir pushpam garu
తెలిసీ తెలియని ఆర్టికల్స్ రాయకండి బాబూ.
సరే అయితే.