Advertisement


Home > Sports - Cricket
కోట్ల పందేరం మళ్ళీ మొదలైంది

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఆటతోనే కాదు, వివాదాలతో కూడా.! అంతేనా, ఐపీఎల్‌ పుణ్యమా అని ఆత్మహత్యలు, హత్యలూ, ఇతరత్రా వేధింపులూ సరికొత్తగా వార్తల్లోకెక్కుతున్నాయి. 

ఓ పదిహేనేళ్ళ కుర్రాడు, ఇంట్లోంచి డబ్బు దొంగిలించి.. ఐపీఎల్‌ బెట్టింగుల్లో ఆ డబ్బుని పోగొట్టుకుని, ఆత్మహత్య చేసుకున్న ఘటన.. 

బెట్టింగ్‌ మాయలో పడి, ఓ మధ్యతరగతి వ్యక్తి అందినకాడికి అప్పులు చేసి.. ఆ అప్పులు కడతీర్చలేక కడతేరిపోయిన సందర్భం.. 

ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటగాళ్ళు జైలుకెళ్ళిన మాయదారి కాలం..

ఇదీ ఐపీఎల్ పుణ్యమా అని ముదిరిన బెట్టింగ్‌, తద్వారా ఆత్మహత్యలు, హత్యలు, అవినీతి, అక్రమాలకీ దారితీసిన వైనం.. 

ఇలా చెప్పుకుంటూ పోతే, ఐపీఎల్‌ అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇవేనా, ఇంకా చాలానే వున్నాయి. ఇంతా చేసి, ఐపీఎల్‌ ఏమన్నా సక్రమంగా జరుగుతోందా.? అంటే అదీ లేదు. ఎందుకు జరుగుతుంది.? బెట్టింగ్‌ వున్న చోటే, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వుంటుంది కదా.! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా పలువురు ఆటగాళ్ళు క్రికెట్‌కి దూరమైపోయారు. ఫలితంగా ఇండియన్‌ క్రికెట్‌ అభాసుపాలైపోయింది. 

అయినా, ఐపీఎల్‌ హంగామా మాత్రం తగ్గడంలేదు. వెలుగులైతే ఇదివరకట్లా లేవనుకోండి.. అది వేరే విషయం. ఇక, తాజాగా ఐపీఎల్‌ కొత్త సీజన్‌కి సంబంధించి ఆక్షన్‌ షురూ అయ్యింది. ఈ ఆక్షన్‌లో 14.5 కోట్ల రూపాయలకు ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ని పూణే జట్టు సొంతం చేసుకుంది. 'జాక్‌ పాట్‌' అంటే ఇదే మరి. ఐపీఎల్‌లో డబ్బులు చెట్లకు కాస్తాయంతే. ఇంతా ఖర్చు చేస్తే, సదరు ఆటగాడు మైదానంలో చెలరేగిపోతాడా.? ఏమో, అదైతే అనుమానమే. 

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోంటే, ఆటగాడు తన ప్రతిభకు తగ్గట్టు ఎలా ఆడతాడు.? ఛాన్సే లేదు. కోట్లు కుమ్మరించిన ఆటగాళ్ళు ఆయా జట్లకు చాలా సందర్భాల్లో 'పీడకల'లా మిగిలిపోతున్నారు. చెత్త ప్రదర్శనతో సరిపెట్టేసి, అందినకాడికి దండుకుని, విమానమెక్కేస్తున్నారు విదేశీ ఆటగాళ్ళు. అయినాసరే, ఆక్షన్‌లో కోట్లు గుమ్మరించడం మాత్రం తగ్గడంలేదు. దటీజ్‌ ఐపీఎల్‌.