Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: లౌక్యం

సినిమా రివ్యూ: లౌక్యం

రివ్యూ: లౌక్యం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: భవ్య క్రియేషన్స్‌
తారాగణం: గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సంపత్‌ రాజ్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, చంద్రమోహన్‌, రఘుబాబు, పృధ్వీ, హంసా నందిని, ప్రగతి తదితరులు
కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన
కథనం: కోన వెంకట్‌ ` గోపీమోహన్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: వెట్రి
నిర్మాత: వి. ఆనంద్‌ ప్రసాద్‌
దర్శకత్వం: శ్రీవాస్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 26, 2014

విలన్‌ క్యారెక్టర్స్‌తో సూపర్‌ పాపులర్‌ అయి, ఆ తర్వాత హీరోగాను వరుస సక్సెస్‌లు అందుకున్న గోపీచంద్‌ అటుపై మూస సినిమాలతో పరాజయాలు కొని తెచ్చుకున్నాడు. కొంతకాలంగా చెప్పుకోతగ్గ విజయం లేని గోపీచంద్‌ ఈసారి తనతో ‘లక్ష్యం’లాంటి హిట్‌ తీసిన శ్రీవాస్‌ డైరెక్షన్‌లో ‘లౌక్యం’ చేసాడు. వీరిద్దరి కాంబినేషన్‌ అంటే మరో మాస్‌ మెచ్చే యాక్షన్‌ సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. కానీ ఈసారి ట్రెండ్‌ మార్చి గోపీచంద్‌తో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు. 

కథేంటి?

బాబ్జీ (సంపత్‌) అనే గూండా చెల్లెలికి పెళ్లి జరుగుతుంటే... అక్కడ్నుంచి ఆమెని తప్పించి తీసుకెళ్లి తను ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తాడు వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ (గోపీచంద్‌). దాంతో వెంకీ కోసం వెతుకుతూ హైదరాబాద్‌కి వస్తాడు బాబ్జీ. హైదరాబాద్‌లో చంద్రకళని (రకుల్‌) చూసి ప్రేమలో పడతాడు వెంకీ. ఆమె కూడా అతడిని ప్రేమించిన తర్వాత కానీ వెంకీకి తెలిసిరాదు.. చంద్రకళ కూడా బాబ్జీ చెల్లెలే అని. తన పెద్ద చెల్లికి పెళ్లి చేసింది తాను అనేది తెలియకుండా తప్పించుకుంటూ చంద్రకళని పెళ్లి చేసుకోవడానికి బాబ్జీ ఒప్పించడం వెంకీ ముందున్న మిషన్‌. 

కళాకారుల పనితీరు:

గోపీచంద్‌ ఇందులో బుద్ధి బలంతో నెగ్గుకొచ్చే హీరో పాత్ర చేసాడు. తన ఇమేజ్‌కి ఇది సూట్‌ కాని క్యారెక్టర్‌ అయినా కానీ ఈసారి గోపీచంద్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాడు. కామెడీ మీదే ఫోకస్‌ పెట్టిన ఈ చిత్రంలో గోపీచంద్‌ కాకుండా ఎవరు హీరోగా నటించినా కానీ ఏ డిఫరెన్స్‌ ఉండదు. తనకి పెద్దగా కామెడీ టైమింగ్‌ లేకపోయినా కానీ తల పండిన కమెడియన్ల మధ్యన ఫర్వాలేదన్నట్టుగా నెట్టుకొచ్చేసాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫర్వాలేదనిపించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో నటనకి అవకాశమున్న పాత్ర చేసి మెప్పించిన రకుల్‌ ఇందులో సగటు కమర్షియల్‌ సినిమా హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేసింది. 

బ్రహ్మానందం ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేసాడు. తనకి ఈమధ్య ప్రతి సినిమాలో ఇస్తోన్న తరహా క్యారెక్టరే అయినా కానీ తన ఎక్స్‌పీరియన్స్‌తో అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించాడు. చంద్రమోహన్‌కి ‘ఢీ’ తర్వాత మళ్లీ అలాంటి క్యారెక్టర్‌ ఇందులో దక్కింది. ఆయన కూడా బాగానే నవ్వించాడు. సంపత్‌ రాజ్‌కి బిల్డప్‌ ఇచ్చినా కానీ హీరో చేతిలో బఫూన్‌ అయ్యే క్యారెక్టరే. అతను ఓకే అనిపిస్తాడు. ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమ్‌ పృధ్వీ ఇందులో ‘బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ’గా ఆకట్టుకున్నాడు. కామెడీ పరంగా ఇందులో తన క్యారెక్టరే హైలైట్‌గా నిలిచింది. హంసా నందిని వ్యాంప్‌ తరహా క్యారెక్టర్‌ చేసింది. ప్రగతి షరా మామూలుగా ఓవరాక్ట్‌ చేసింది. 

సాంకేతిక వర్గం పనితీరు:

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. పాటలన్నీ సినిమాకి స్పీడ్‌ బ్రేకర్స్‌గా మారి సిగరెట్‌ బ్రేక్స్‌గా పనికొస్తాయి. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. శ్రీధర్‌ సీపాన సంభాషణలు కొన్ని నవ్వించినా కానీ ప్రాస మీద అతిగా ఆధార పడే ఈ రచయిత ఇందులో ప్రతి డైలాగులోను ప్రాస ఉండాలని తపించిపోయాడు. రిథమిక్‌ డైలాగులెన్ని ఉన్నా కానీ రచయితకి పేరు తెచ్చి పెట్టే మాటలు మాత్రం ఇందులో అస్సల్లేవు. ఈ తరహా కథలకి వినోదాత్మక కథనం అందించడంలో సిద్ధ హస్తులైన కోన వెంకట్‌, గోపీ మోహన్‌ తమ స్ట్రెంగ్త్‌ ఇందులోను చూపించారు. తమకి అలవాటైన పద్ధతిలోనే కథని నడిపించినా కానీ ఇంకోసారి తమ ఫార్ములా వర్కవుట్‌ అయ్యేట్టు చూసుకున్నారు. 

సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎక్కడా ల్యాగ్‌ లేకుండా ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది. దర్శకుడు శ్రీవాస్‌ ఈ చిత్రంలో పూర్తిగా కామెడీ మీదే డిపెండ్‌ అయ్యాడు. ఇప్పుడు ఆడియన్స్‌ కామెడీ బాగా ఉన్న సినిమాల్నే ఆదరిస్తున్నారనేమో ఇతను మాస్‌ని మెప్పించే అంశాలు ఉండాలని కూడా ప్రయత్నించలేదు. శ్రీను వైట్ల తరహాలో కామెడీ ట్రీట్‌మెంట్‌తో తనకి ఉన్న వనరులన్నీ వాడుకున్నాడు. ద్వితీయార్థంలో కామెడీ బాగానే పండిరచినా కానీ ప్రథమార్థంలో మాత్రం దర్శకుడు ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. 

హైలైట్స్‌:

  • బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ    
  • సెకండాఫ్‌లో కామెడీ 

డ్రాబ్యాక్స్‌:

  • హీరో హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌
  • సాంగ్స్‌
  • రొటీన్‌ ట్రీట్‌మెంట్‌

విశ్లేషణ:

అగ్ర హీరోల చిత్రాలపై అంచనాలు ఘనంగా ఉంటాయి కనుక కేవలం కామెడీతో నెట్టుకొచ్చేద్దామంటే కుదరదు. అదే మీడియం రేంజ్‌ హీరోల దగ్గరకి వచ్చేసరికి కథ, కథనాలు ఎంత రొటీన్‌గా ఉన్నా కానీ కామెడీ బాగుంటే పాస్‌ అయిపోతున్నాయి. ‘లౌక్యం’ కూడా అలా నేటి ట్రెండుకి తగ్గట్టుగా సేఫ్‌ దారి చూసుకున్న చిత్రమే. ఇందులో ఏది బాగున్నా బాగోకపోయినా కానీ కామెడీ అయితే వర్కవుట్‌ అయింది... ముఖ్యంగా ద్వితీయార్థంలో. ఆల్రెడీ అనేకానేక చిత్రాల్లో చూసిన తంతే అయినా కానీ మళ్లీ దాంతో నవ్వించగలిగినందుకు రచయితలకి క్రెడిట్‌ ఇచ్చేయాలి. 

ద్వితీయార్థంలో విలన్‌ ఇంట్లో హీరోతో పాటు కామెడీ గ్యాంగ్‌ అంతా చేరడం రొటీన్‌ వ్యవహారం అయిపోతోందని కోన వెంకట్‌, గోపీమోహన్‌కి కూడా అనిపించినట్టుంది. అందుకే ఈసారి కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. సెటప్‌ విలన్‌ ఇంటి నుంచి హీరో ఇంటికి షిఫ్ట్‌ చేసారు. ‘ఏంటండీ ఇది... మళ్లీ అదే రెడీ టైప్‌లో చేస్తున్నారు?’ అని అడిగితే ‘భలేవారే... అది విలన్‌ ఇంట్లో ఉంటుంది.. ఇక్కడ మొత్తం హీరో ఇంట్లోనే జరుగుతుంది. ఇది వెరైటీ’ అని బదులిచ్చినా ఇస్తారు. ఏ తెలుగు సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం... అన్నిట్లోను ‘నవ్వించడానికి నానా విధాలుగా పాట్లు పడడం తప్ప’ అనుకుని దీనిని కూడా జనం ఎంజాయ్‌ చేసేస్తారు. 

ఫస్ట్‌ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్‌ హాఫ్‌ చాలా చాలా బెటర్‌గా ఉంది. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం అర్థం లేని సీన్లతో కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ దగ్గర ఇచ్చిన ట్విస్ట్‌ కూడా పరమ రొటీన్‌గా ఉంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కామెడీ సీన్లు బాగానే వర్కవుట్‌ అయ్యాయి. ‘కట్టిన చీరే కట్టి.. తిప్పి తిప్పి కట్టి..’ అంటూ ‘అసెంబ్లీ రౌడీ’లోని బ్రహ్మానందం డైలాగ్‌ ఇప్పుడు తనకే అన్వయించుకోవచ్చు. ‘చేసిన క్యారెక్టరే చేసి... మార్చి మార్చి చేసి..’ బ్రహ్మీ ఇప్పటికీ నవ్వులు పంచగలుగుతున్నాడు. ఫైట్స్‌ వీలయినంత తగ్గించేసి పూర్తిగా కామెడీ మీదే దృష్టి పెట్టడం కూడా లౌక్యం చిత్రానికి కలిసి వచ్చింది. కాకపోతే దీని వల్ల గోపీచంద్‌ మాస్‌ ఫాన్స్‌ హర్ట్‌ అయ్యే అవకాశముంది. 

కామెడీ పార్ట్‌ అయిపోయింది... ఇక మిగిలింది రొటీన్‌ క్లయిమాక్సే అనుకుంటూ ఉండగా.. ‘బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ’ని ఇంకోసారి ప్రవేశపెట్టి గిలిగింతలు పెట్టారు. ఈ ఐడియా ఎవరిదో కానీ వారికి ఫుల్‌ మార్కులు పడతాయి. థియేటర్‌ బయటకి వచ్చేటపుడు ఏది గుర్తున్నా లేకపోయినా కానీ బబ్లూ మాత్రం గుర్తుంటాడు. కాలక్షేపం కోరుకుంటే లౌక్యం చిత్రంతో అది భేషుగ్గా జరిగిపోతుంది. కామెడీకి లోటు లేని ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కూడా పాస్‌ మార్కులు వేయించేసుకుంటుంది. 

బోటమ్‌ లైన్‌: రొటీన్‌ కామెడీనే కానీ ‘లౌక్యం’తో నెగ్గుకొచ్చారు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?