ఆ అమ్మాయిల కేసు అలా మలుపుతిరిగిందేంటి!

ఏ వ్యవహారంలోవైపు అయినా సరే..మీడియా ఒక చూపు చూసిందంటే.. దాని గతి మారిపోతుంటుంది. అది కూడా జాతీయ మీడియా అయితే.. మరీ ఓవర్. తాము అనుకొన్నదే దేశం ఆలోచించాలనే దుగ్ధతో పనిచేస్తున్నాయి ఇంగ్లిష్ ,…

ఏ వ్యవహారంలోవైపు అయినా సరే..మీడియా ఒక చూపు చూసిందంటే.. దాని గతి మారిపోతుంటుంది. అది కూడా జాతీయ మీడియా అయితే.. మరీ ఓవర్. తాము అనుకొన్నదే దేశం ఆలోచించాలనే దుగ్ధతో పనిచేస్తున్నాయి ఇంగ్లిష్ , హిందీ వార్త చానళ్లు అన్నీ. అయితే చివరకు మీడియా చూపింది ఒకటి.. జరిగింది మరోటి కావడంతో కథలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి బదౌన్ అమ్మాయిల కథ.

ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో అక్కా చెల్లెళ్ల మరణం గురించి సీబీఐ తన తుది నివేదికను ఇచ్చింది. జాతీయ అత్యున్నత దర్యాప్తు సంస్థ.. ఈ సంఘటనలో మరణించిన అమ్మాయిలవి ఆత్మహత్యలు అని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయస్థానానికి తన విచారణ నివేదికను  సీబీఐ సమర్పించింది.

మరి ఈ కేసు ఆదిలో సృష్టించిన సంచలనానికి సీబీఐ ఇచ్చిన నివేదికకు ఏ మాత్రం సంబంధం లేదు! కనీసం అణువంత కూడా సంబంధం లేదు. బదౌన్ లో ఇద్దరు అమ్మాయిలు ఉరేసుకొని చెట్టుకు వెళాడుతున్నారంటూ.. జాతీయ మీడియా దేశాన్ని మొత్తం అలర్ట్ చేసింది. వారిని ఎవరో అత్యాచారం చేసి.. చెట్టుకు ఉరి వేశారని మీడియా అభిప్రాయపడింది.

ఇక ఒక్కొక్కరుగా జాతీయ మీడియా ప్రతినిధులు అంతా ఆ గ్రామంలో దిగిపోయారు. ఢిల్లీకి దగ్గరగానే ఉండటంతో వారికి ప్రయాస లేకుండా పోయింది. ఇంతలోనే కేసుకు దళిత కోణాన్ని కూడా కలిపారు. “దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను ఎవరో కొందరు అగంతకులు అత్యాచారం చేసి ఊరి చివరన ఉన్న చెట్టుకు ఉరివేసి చంపారు..'' అనే కథనం రెడీ అయ్యింది. 

దానికి మరింత మసాలా చాలా ఆటోమెటిక్ గా జోడీ అయ్యింది. అగ్రవర్ణాలకు చెందిన యువకులు ఈ పనిచేశారన్న వాదన వినిపించింది. మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చే సరికి దేశమంతా “అయ్యొయ్యో..'' అనుకొంది. అభాగ్యుణులపై ఎంత దాష్టికం జరిగిందని అందరూ బాధపడ్డారు.

అత్యాచారం చేయడమే గాకుండా..అంత దారుణం వారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో అ రాక్షసులకు అనుకొన్నారు. ఇంతలో రాజకీయ నేతలు అలర్ట్ అయ్యారు. ఇందులో దళిత్ కోణం ఉండటంతో కావాల్సినంత రాజకీయం చేసుకోవచ్చని వారు గ్రహించారు.

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్… రంగంలోకి దిగాడు. వారి కుటంబానికి న్యాయ సహాయం చేస్తామని ఆయన ప్రకటించాడు. మరి ముఖ్యమంత్రి రంగంలోకి దిగాకా పోలీసుల ఊరుకే ఉండలేరు కదా.. అనుమానితులు అంటూ కొంతమంది అగ్రవర్ణాల అబ్బాయిలను అదుపులోకి తీసుకొని అరెస్టులను చూపించారు!

ఆ రోజున ఆ అమ్మాయిలు సరదాగానో.. బహిర్భూమికో ఊరి చివరకు వెళితే.. అక్కడే ఉన్న వీళ్లంతా వారిని రేప్ చేసి .. ఎవరికైనా చెబుతారనే భయంతో ఉరేసి చంపారని పోలీసులు ఒక కథనాన్ని తయారు చేశారు. ఇంతటో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంట్రీ. బదౌన్ కు వెళ్లి ఆ అమ్మాయిల తల్లిదండ్రులను ఆయన పరామర్శించాడు. వారికి ఊరటనిచ్చాడు. అటు మోడీ సర్కార్ హాయంలో.. ఇటు అఖిలేష్ సర్కార్ హయాంలో.. అమ్మాయిలకు, ప్రత్యేకించి దళితులకు రక్షణ లేకుండా పోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనలన్నీ వరసగా జరుగుతున్న తరుణంలో మీడియా తనదైన రోల్ ను పోషించింది. ఎక్కడా వేడి తగ్గకుండా చూసుకొంది.

అయితే అంతర్గతంగా ఈ వ్యవహారంలో కొన్ని సందేహాలున్నాయి. అమ్మాయిల మరణం గురించి క్లారిటీ లేదు. మీడియా హడావుడిలో ఆ సందేహాలు హైలెట్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారం గురించి సీబీఐ విచారణకు కోరగా.. కేంద్రం కూడా ఈ కేసు తీవ్రత దృష్ట్యా.. ఒక విధమైన భయంతో సీబీఐ విచారణకు అదేశించింది. 

సీబీఐ ఈ కేసును మాత్రం కొంచెం త్వరగానే తేల్చింది. ఆ అమ్మాయిల పోస్టు మార్టం రిపోర్టులను పరిశీలించింది. వారు అత్యాచారానికి గురి కాలేదని ఆ పోస్టు మార్టంలో స్పష్టం అయ్యింది! సీబీఐ ఆ విషయాన్ని ప్రకటించడంతో మీడియా అవాక్కయ్యింది. ఇంతకు ముందు తాను చేసిన అతిని అంతా జాతీయ మీడియా పక్కనపెట్టేసింది. ఈ కేసు పూర్వాపరాల గురించి విచారణ జరిపిన సీబీఐ ఆ అమ్మాయిలది ఆత్మహత్య అని ధ్రువీకరించింది. నివేదికను కోర్టు సమర్పించింది!

మరి మీడియా హడావుడి అనేది తిమ్మిని బమ్మిని ఎలా చేయగలదో… ఎంతమందిని ఎన్ని రకాలుగా ఫూల్ చేయగలదో.. అర్థం కాని స్థితిలో కి నెట్టి.. తను సృష్టించిన వాతావరణానికి అనుకూలంగా ముఖ్యమంత్రులను.. పార్టీల జాతీయాధ్యక్షులను కూడా స్పందించేలా చేయగలదో.. ఈ బదౌన్ ఘటన అనేది ఒక రుజువు.