పరాకాష్టః ఐటమ్ గర్ల్స్ ను వ్యభిచారుణులుగా ప్రకటించాలట!

మరి ఇలాంటి వాళ్లంతా ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నారో కానీ… తమ మాటలతో కొత్త కొత్త దుమారాలను సృష్టించే ప్రయత్నాలు పరాకాష్టకు చేరుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను రక్షించడంలో తమకు మించిన వారు లేరని ఫీలయ్యే ఈ…

మరి ఇలాంటి వాళ్లంతా ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నారో కానీ… తమ మాటలతో కొత్త కొత్త దుమారాలను సృష్టించే ప్రయత్నాలు పరాకాష్టకు చేరుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను రక్షించడంలో తమకు మించిన వారు లేరని ఫీలయ్యే ఈ నేతలు మాట్లాడే మాటలు చాలా చోద్యంగా ఉంటున్నాయి. తాజాగా హిందూ మహాసభ నేత ఒకరు చేసిన ప్రకటన అత్యంత హస్యాస్పదంగా ఉంది!

సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు డ్యాన్సులు చేసే వాళ్లను వ్యభిచారిణులుగా ప్రకటించాలని హిందూ మహాసభ నేత త్యాగీ కోరుతున్నాడు! ఎందుకలా..? అంటే, వారు అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తున్నారనేది ఈ నేత అభియోగం. పాపం.. ఈయనకు ఐటమ్ గర్ల్సే దొరికారు!

వాళ్లేదో బువ్వ కోసం డ్యాన్సులు చేసుకొనే వాళ్లు. వాళ్లను చూస్తూ విజిల్స్ కొట్టే వాళ్లు భారతదేశ మంతా ఉన్నారు. వాళ్లను రకరకాల భంగిమల్లో చూపుతూ మార్కెటింగ్ చేసుకొనే దర్శకులు, హీరోలు, నిర్మాతలు స్టార్లుగా, సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు.

పాటల్లో అమ్మాయిలను అత్యంత శృంగార భరితంగా చూపే దర్శకులకు మనం పద్మశ్రీలు, పద్మభూషణ్ లూ ఇచ్చి సత్కరించుకొంటున్నాం. వాళ్లంతా కళామతల్లికి చేస్తున్న సేవకు ఆ అవార్డులు ప్రతిరూపమని చెప్పుకొని మురిసిపోతుంటాం!

మరి వాళ్లంతా మంచి వాళ్లు.. మహానుభావులు.. వాళ్లు చెప్పినట్టుగా చేసే వాళ్లు మాత్రం వ్యభిచారిణులు అవుతారా?! అసలు వ్యభిచారిణులుగా ప్రకటించాలనే డిమాండ్ చేయడం ఎంత మూర్ఖత్వమో?!  ఇంత అనాలోచితంగా మాట్లాడటానికి మళ్లీ హిందుత్వ ట్యాగ్ ఒకటి! ఇదేనా హిందూ బాంధవులు కోరుకొనే హిందుత్వ వాదం?!