ఛత్తీస్‌ఘడ్‌లో మావో నరమేధం.!

సాటి మనిషిని ఏ కారణంతో చంపడమైనా అది క్షమించరాని నేరం. మావోయిస్టుల్ని పోలీసులు, పోలీసులు మావోయిస్టుల్ని.. ఎన్‌కౌంటర్ల పేరిట, ఇంకో పేరుతో చంపేయడాన్ని సభ్య సమాజం హర్షించడంలేదు. అయినా ఎవరి దారి వారిదే. కూంబింగ్‌…

సాటి మనిషిని ఏ కారణంతో చంపడమైనా అది క్షమించరాని నేరం. మావోయిస్టుల్ని పోలీసులు, పోలీసులు మావోయిస్టుల్ని.. ఎన్‌కౌంటర్ల పేరిట, ఇంకో పేరుతో చంపేయడాన్ని సభ్య సమాజం హర్షించడంలేదు. అయినా ఎవరి దారి వారిదే. కూంబింగ్‌ పేరిట మావోయిస్టుల్ని ఏరివేయడం, ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చడం చాలాకాలంగా జరుగుతున్న విషయమై. పక్కా ప్లానింగ్‌తో మావోయిస్టులూ పోలీసుల్ని హతమార్చుతున్నారు.

ఛత్తీస్‌ఘడ్‌ అంటేనే మావోయిస్టులకు కేరాఫ్‌ అడ్రస్‌. అక్కడ మారణహోమం నిత్యకృత్యమైపోయింది. పలువురు రాజకీయ నాయకులే మావోయిస్టులకు బలైపోయిన రాష్ట్రమది. పోలీసు అధికారులు, మావోయిస్టులు.. ఇలా ఎవరో ఒకరు నిత్యం తుపాకీ తూటాలకై బలైపోతూనే వుంటారు. తాజాగా మరోమారు ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు నరమేధానికి తెరలేపారు.

మావోయిస్టులు పక్కా వ్యూహంతో జరిపిన మెరుపుదాడిలో 13 మంది జవాన్లు మృతి చెందారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ అధికారులు, మిగతావారంతా జవాన్లు అని తెలుస్తోంది. ఇదివరకు ఇంతకన్నా పెద్ద ఘటనలు ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకున్నాయి. పోలీసులకూ, మావోయిస్టులకూ అదో ‘యుద్ధ రంగం’గా తయారైంది.

నెత్తురోడే యుద్ధరంగంలో సాధించేదేంటి.? అని ఎవరికి వారు ప్రశ్నించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. 13 నిండు ప్రాణాలు బలైపోవడమంటే చిన్న విషయం కాదు కదా.! ఇప్పుడు పోలీసులు.. రేప్పొద్దున్న మావోయిస్టులు.. ఈ మారణహోమానికి ముగింపు ఎప్పుడు.?