ఆంధ్రప్రదేశ్లో గన్ కల్చర్ పెరుగుతోంది. కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై ఆ మధ్య ముగ్గురు వ్యక్తుల్ని ముంబైకి చెందిన హంతక ముఠా తుపాకులతో కాల్చి చంపిన ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. పాత కక్షల నేపథ్యంలోనే ఆ హత్యలు జరిగాయి. అయితే జ్యోతిష్యం చెప్పుకునే వ్యక్తుల్ని ముంబై మాఫియా తరహాలో కల్చి చంపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కోట్లకు పడగలెత్తిన జ్యోతిష్యుల మధ్య వివాదం ఈ ఘటనకు కారణం.
ఆ తర్వాత కృష్ణా జిల్లా నందిగామలో ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఇక్కడా ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణం. కోటి రూపాయల బాకీ ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొంది. కిరాయి హంతకుడ్ని తీసుకొచ్చి మరీ తుపాకీతో హత్య చేశారు ఈ ఘటనలో. ఇటీవలే విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించగా, అదృష్టవశాత్తూ ఆ తుపాకీ పనిచేయకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడా వ్యక్తి.
తాజాగా గుంటూరు జిల్లాలో రెండు తుపాకులు పోలీసులకు చిక్కాయి. పోలీసులు జరిపిన సోదాల్లో రెండు తుపాకీలు దొరకడం గుంటూరు జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం జరగనున్న జిల్లాలో తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గందరగోళానికి కారణమైంది. తుపాకీలను కలిగినవున్న వ్యక్తులు గతంలోనూ తాము తుపాకీలను విక్రమించామని చెబుతుండడం మరింత ఆందోళనకరమైన అంశం.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామనీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపుతామనీ ఏపీ సర్కార్ చెబుతున్నా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మాఫియా / గన్ కల్చర్ పెరిగిపోతోందనడానికి గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ఇదివరకెన్నడూ లేని విధంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు చోటుచేసుకోవడం పట్ల సామాన్య ప్రజానీకం భయంతో బెంబేలెత్తుతున్నారు.