దర్శకులను బలి చేస్తున్నారు

ఈ లైన్ ఇక్కడ వాడుతున్నందుకు సారీ…కుక్కను చంపేయాలంటే, దాన్ని పిచ్చిది అని ముద్ర వేయాలట. అలాగ్గానే వుంది, గబ్బర్ సింగ్ 2 పై పవన్ వ్యవహారం. సంపత్ నందిని దర్శకుడిగా పెట్టుకుని, స్క్రిప్ట్ మొత్తం…

ఈ లైన్ ఇక్కడ వాడుతున్నందుకు సారీ…కుక్కను చంపేయాలంటే, దాన్ని పిచ్చిది అని ముద్ర వేయాలట. అలాగ్గానే వుంది, గబ్బర్ సింగ్ 2 పై పవన్ వ్యవహారం. సంపత్ నందిని దర్శకుడిగా పెట్టుకుని, స్క్రిప్ట్ మొత్తం తయారుచేయించుకుని, ఓకె చేసి, సినిమాకు ఓపెనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించుకున్నారు. 

అక్షరం అక్షరం పూర్తయిన బౌండ్ స్క్రిప్ట్ ను సంపత్ నంది దగ్గర ఆయన సన్నిహితులు చాలా మందే చూసారు. రాజకీయ కారణాలతో గబ్బర్ సింగ్ 2ను వెనక్కు జరుపుకుంటూ వచ్చారు. ఆపై గోపాల గోపాల కోసం మరి కొంత వెనక్కు నెట్టారు.

ఆఖరికి సంపత్ నందిని తప్పించాలని డిసైడైపోయారు. తప్పులేదు..తమకు ఇష్టం లేనపుడు దూరంపెట్టేసుకోవచ్చు. కానీ ఓ దర్శకుడు కెరీర్ తో ఆడుకోకూడదు కదా..లైన్ మొత్తం చెప్పినా, కథ అల్ల లేకపోయాడని, పవన్ మెప్పించలేకపోయాడనీ ఏవో రూమర్లు వ్యాప్తి చేస్తూనే వున్నారు. ఇవి పవన్ కు తెలిసి జరగకపోవచ్చు. కానీ చేస్తున్నవాళ్లు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. 

బహుశా పవన్ మాటతప్పిన మనిషి కాదని చాటి చెప్పడానికి ఇలా చేస్తున్నారా? లేక సంపత్ నందిని విజయవంతంగా పక్కకు తప్పించినవారే, ఇప్పుడు ఆ అపవాదు పవన్ పై పడకూడదని ఇలా చేస్తున్నారా? సినిమా రంగంలో హీరోల ఆధిపత్యం నడుస్తుంది. అందువల్ల బహుశా ఇప్పుడు సంపత్ నంది మాట్లాడకుండా మౌనం వహించి వుండొచ్చు. 

అదే తెగించి ఆ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం బయటపెడితే, ఎవరు దోషులవుతారు? కానీ టాలీవుడ్ లో అలా జరగదని అందరికీ తెలుసు. 

మొన్నటికి మొన్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరిదీ ఇదే కేసు. భాయ్ సినిమాను నాగార్జున అభీష్టానికి అనుగుణంగానే తీర్చి దిద్దాడు. నాగ్ తన గెటప్ లు అన్నీ తానే డిజైన్ చేసుకున్నారు. ఆయనే చాలా సార్లు తను, తన హెయిర్ స్టయిలర్ కలిసి డిజైన్ చేసుకున్నాం అని  చెప్పారు. భాయ్ అద్భుతం అని సినిమా విడుదలకు ముందు నాగ్ చాలా సార్లు చెప్పారు. 

తీరా సినిమా ఫెయిలయ్యాక, మొత్తం తప్పు దర్శకుడు చౌదరిపైకి నెట్టే ప్రయత్నాలు చేసారు. ఎప్పటికప్పడు నర్మగర్భంగా మాట్లాడుతూ దర్శకుడిని టార్గెట్ చేసారు. దాంతో ఇప్పటి వరకు ఆ దర్శకుడికి అవకాశాలు లేవు. ఒక సినిమా పోయినా హీరోకి మరో సినిమా రావడం కష్టం కాదు. కానీ ఓ సినిమా పోతే మరో సినిమా రావడం అన్నది దర్శకుడికి చాలా కష్టం. 

సినిమా నిర్మాణంలోవున్నపుడు కాళ్లు, చేతులు అన్నీ పెట్టి కెలికేయడం అన్నది టాలీవుడ్ లో వర్థమాన హీరోల  నుంచి టాప్ హీరోల వరకు తొంభై శాతం మంది చేసే పని. హిట్ అయితే తమ ఘనత..ఫ్లాప్ అయితే దర్శకుడి చేతకాని తనం అనడం మామూలైపోయింది. సినిమా అవకాశాల కోసం దర్శకులు మౌనంగా హీరోల కెలుకుడు భరించాల్సి వస్తోందన్నది వాస్తవం. దీన్ని దాదాపు ప్రతి దర్శకుడు ఆప్ ది రికార్డుగా అంగీకరిస్తారు. ఇదీ టాలీవుడ్ తీరు..దీన్ని ఎవరూ మార్చలేరు.