‘క్రికెట్‌లో ఫిక్సింగ్‌కి అవకాశమిస్తే క్రికెట్‌ని చంపేసినట్లే..’ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలివి.
ఐపీఎల్‌లో ‘ఫిక్సింగ్’ కుంభకోణంపై జరుగుతున్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొందరు ఆటగాళ్ళు ఫిక్సింగ్‌కి పాల్పడిన విషయం వెలుగు చూడ్డంతో, దేశవ్యాప్తంగా అప్పట్లో క్రికెట్ అంటేనే అసహ్యం పుట్టింది చాలామందికి. ఈ ఎపిసోడ్‌లో యంగ్ క్రికెటర్ శ్రీశాంత్ సహా పలువురు అరెస్టయ్యారు. మంచి భవిష్యత్ వున్న శ్రీశాంత్, ఫిక్సింగ్ కారణంగా టీమిండియాకి దూరమైపోయిన విషయం విదితమే.
అసలు ఫిక్సింగ్ ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్న పదమేమీ కాదు. చాన్నాళ్ళ క్రితమే, అప్పటి స్టార్ క్రికెటర్, డాషింగ్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగానే అజారుద్దీన్ క్రికెట్‌కి దూరమయ్యాడు. అజారుద్దీన్ ఒక్కడే కాదు, అప్పట్లో టీమిండియా ఆటగాళ్ళు ఇద్దరు ముగ్గురు ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ కెరీర్‌కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. దేశం క్రికెటర్లని ఛీత్కరించుకున్న సందర్భమది.
వ్యవస్థలో ఒకటీ అరా చీడపురుగులున్నంతమాత్రాన, మొత్తం వ్యవస్థపై ఏహ్యభావం పెంచుకోలేం కదా. ఫిక్సింగ్ అయినా అంతే. అన్నట్టు, అజారుద్దీన్ సహా ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు క్రికెటర్లు ఆ వివాదం నుంచి ఎలాగో బయటపడ్డారనుకోండి.. అది వేరే విషయం. అలా ఇండియన్ క్రికెట్‌ని ఫిక్సింగ్ భూతం ఎప్పటినుంచో వెంటాడుతోంది. కొందరు క్రికెటర్లు ఆ రొంపిలోకి దిగితే, మరికొందరు ఆరోపణల కారణంగానే కెరీర్‌ని కోల్పోవాల్సి వచ్చింది.
అజారుద్దీన్ ఫిక్సింగ్ పాల్పడ్డాడా.? శ్రీశాంత్ ఏం చేశాడు.? అన్న విషయాల సంగతి అలా వుంచితే, ఈ ఎపిసోడ్‌లో బీసీసీఐ పాత్ర ఎంత? అన్నది అత్యంత కీలకం. దురదృష్టవశాత్తూ బీసీసీఐ ఇలాంటి విషయాల్లో ఆటగాళ్ళను వదిలించుకుని, చేతులు దులిపేసుకోవడం జరుగుతోంది. ఐపీఎల్ కుంభకోణంలో ఏకంగా, అప్పటి బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్‌పై ఆరోపణలు వచ్చేసరికి, బీసీసీఐ కూడా షాక్ తినాల్సి వచ్చింది.
ప్రస్తుతం ముద్గల్ కమిటీ ఐపీఎల్ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వగా, అందులో శ్రీనివాసన్‌కి కాస్త ఊరట దక్కింది. శ్రీనివాసన్ మళ్ళీ బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడ్తున్నారిప్పుడు. కాలం కలిసొస్తే ఆయన మళ్ళీ బీసీసీఐ అధ్యక్షుడయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఆటగాళ్ళేమో ఆరోపణలు ఎదుర్కొని కెరీర్‌ని నాశనం చేసుకోవాలా.? బీసీసీఐ పెద్దలకేమో అలాంటివేమీ వుండవా.? అన్న ప్రశ్న సహజంగానే క్రికెట్ అభిమానుల మెదళ్ళను తొలిచేస్తుంది.
తప్పో ఒప్పో.. తమ హయాంలో కుంభకోణాలు వెలుగు చూసినప్పుడు.. బీసీసీఐ పెద్దలు నైతిక బాధ్యత వహించాలి. కానీ, విచిత్రంగా, అలాంటి నైతికతకు బీసీసీఐ పెద్దలెవరూ కట్టుబడి వుండరేమో.!
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇక్కడ ఒకటి మాత్రం నిజం. జెంటిల్‌మెన్ గేమ్ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు వున్నదేంటంటే, జస్ట్ కమర్షియల్ గేమ్.!