హిచ్ కాక్ సినిమాలను కాపీ చేసిన దుస్సాహసం!

పరీక్ష హాల్లో కాపీ కొట్టి గట్టెక్కాలని ప్రయత్నించే కుర్రాడు చాలా పకడ్బందీగా ఉండాలి. మూడో కంటికి తెలియకుండా తన పనిని పూర్తి చేయాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి…

పరీక్ష హాల్లో కాపీ కొట్టి గట్టెక్కాలని ప్రయత్నించే కుర్రాడు చాలా పకడ్బందీగా ఉండాలి. మూడో కంటికి తెలియకుండా తన పనిని పూర్తి చేయాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయాలి. అయితే… కాపీ కొట్టడంతో కూడా ఇష్టానుసారం చేస్తాం.. బహిరంగంగా కాపీ కొట్టేస్తాం.. ఎంతకైనా తెగిస్తాం.. అంటే కుదరదు! అలా చేస్తే పట్టుబడటమే కాదు.. చాలా ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ హాల్‌లో కాపీ కొట్టే వాళ్లే కాదు… సినిమా కథలను కాపీ కొట్టే వాళు కూడా కొన్ని పరిమితులు పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ల పరిస్థితి ప్రహసనంగా మారుతుంది. అచ్చం ఈ సినిమాల దర్శకుల వలె…

విదేశీ సినిమాలను చూసి సినిమాలు కాపీ కొట్టే వాళ్లు  భారతదేశంలోని ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నారు. స్టార్ రైటర్స్ గా, దర్శకులుగా చెలామణి అవుతున్న అనేక మంది తమ కెరీర్‌కు కాపీనే పునాదిగా చేసుకున్న వాళ్లు. నిర్భయంగా.. నిర్మొహమాటంగా వీళ్లు సినిమా సీన్లను, కథలను కాపీ కొట్టేస్తారు. అయితే ఇలాంటి కాపీ కొట్టే వారు చాలా పకట్బంధీగా వ్యవహరిచడాన్ని గమనిస్తూ ఉంటాం. ఎవరికీ పెద్దగా తెలియని సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం… పెద్దగా పాపులర్ కాని సినిమాల నుంచి సీన్లను లేపుకురావడం వీళ్లకు తెలిసిన విద్యలు. ఇంకా కొందరు కాపీ మేధావులు ఎక్కెడెక్కడో మారుమూల సినీ పరిశ్రమలకు సంబంధించిన సినిమాలను కూడా ఎంచుకొని కాపీ కొట్టేస్తూ ఉంటారు. వీళ్లందరూ ఒక క్యాటగిరీ సృజనకారులు. ఇలాంటి కాపీ కేటుగాళ్లలో కొందరు బాలీవుడ్ , సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ ఉన్న సృజనకారులుగా చెలామణి అవుతున్నారు.

వీళ్ల సంగతి ఇలా ఉంటే.. మరికొందరు మాత్రం యధేచ్ఛగా కాపీ కొట్టేస్తారు. కాపీ కొడుతూ పట్టుబడతామనే భయాలేమీ లేకుండా వీరు కాపీలు కొట్టేస్తూ ఉంటారు. విదేశీ సినిమాలను.. అందులోనూ బాగాహిట్టైన సినిమాలను కాపీ కొట్టడమే వీళ్ల ప్రత్యేకత! వీళ్లు స్ఫూర్తి పొందే సినిమాలు ప్రపంచ ప్రసిద్ధం అయినా.. కూడా వీళ్లు వెనక్కుతగ్గరు. వాటిని కథల వారీగా, సీన్ల వారీగా కాపీ కొట్టేస్తారు. ఒరిజినల్ రచయితలకు క్రెడిట్ ఇవ్వకుండా కాపీ పని కానించేస్తారు. పట్టుబడతామనే భయం ఏ మాత్రం లేకపోవడమే వీరి ప్రత్యేకత. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు అని వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తీసిన అనేక హారర్, థ్రిల్లర్ సినిమాలు విశ్వవ్యాప్తంగా బాగా ఆదరణ పొందాయి… అంతేనా.. ఆయన తీసిన సినిమాలు క్లాసిక్స్ అని కూడా వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి క్లాసిక్స్ నుకూడా కాపీ చేయడం మనోళ్ల ప్రత్యేకత. కొత్తగా కథలను సృష్టించుకోలేని మనవాళ్లు క్లాసిక్స్ ను కాపీ కొట్టి.. తమకు తోచినట్టుగా తీసి.. వాటి పరువును తీయడంతో పాటు వాళ్ల పరువును కూడా తీసేసుకున్నారు. విమర్శల పాలయ్యారు. ఇలా ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ సినిమాలను ఇష్టానుసారం చేసి ఆ ఒరిజినల్ సినిమాల అభిమానుల చేత వీల్లు తిట్టించుకున్నారు.

ఉదాహరణకు.. హిచ్ కాక్ రూపొందించిన ‘స్ట్రేంటజర్స్ ఇన్ ఏ ట్రైన్’ సూపర్ హిట్. మామూలు సినిమ కాదు.. ఆ థ్రిల్లర్ దశాబ్దాలు గడిచిపోయినా ఎలాంటి వన్నె తగ్గలేదు. హిచ్ కాక్ అభిమానులు, సగటు సినీ ప్రేమికులు కూడా అలాంటి ఎపికల్ స్టేటస్ ఉన్న సినిమాను చూసే ఉంటారు. మరి అలాంటి సినిమాను తెచ్చి రీమేక్ చేయడానికే చాలా గట్స్ ఉండాలి. అది కూడా హిచ్ కాక్ క్రెడిట్ ఇవ్వకుండానే వీళ్లు దాన్ని కాపీ కొట్టారు. ఆ స్ఫూర్తితో సినిమాలు రూపొందించారు. దక్షిణాదిలో స్ట్రేంజర్స్ ఇన్ ఏ ట్రైన్ సినిమా స్ఫూర్తితో రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి ‘‘విశాఖ ఎక్స్ ప్రెస్’. అల్లరి నరేష్ , రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో వచ్చిన ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో వచ్చింది. ముళ్లపూడి వర దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అంతకు మించి విమర్శలపాలైంది. ప్రసిద్ధ సినిమాను అర్థం పర్థం లేకుండా కాపీ చేసిన ఘనతను మూటగట్టుకుంది ఈ సినిమా యూనిట్. తెలుగు సంగతిలా ఉంటే.. కొంతకాలం క్రితం ఈ సినిమాను తమిళంలో కూడా రీమేక్ చేశారు! చేరన్ నటించగా రూపొందించిన ఈ సినిమా పేరు ‘‘మురాన్’’ కాపీ కొట్టడంతో తమిళులు విజయవంతం అయ్యారు. అక్కడ సినిమా సూపర్ హిట్. ఎంతగా హిట్ అంటే… ఒక సంవత్సరానికి ఇండియా తరపు నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కు ఎంట్రీ కోసం ఈ సినిమాను జాతీయ కమిటీ పరిశీలనకు పంపించింది మురాన్ యూనిట్. 

అయితే ఇండియా తరపు నుంచి ఆ అవకాశం దక్కలేదు! ఎందుకంటే.. ఇది ప్రసిద్ధ ‘‘స్ట్రేంజర్స్ ఇన్ ఏ ట్రైన్’’ సినిమాకు కాపీ కాబట్టి. కాపీ సినిమాలను ఇలా ఆస్కార్స్‌కు పంపి భారతదేశం పరువు తీయడం ఇష్టం లేక… కమిటీ ఈ సినిమాను తిప్పి పంపింది. తమిళ వెర్షన్ కనీసం కమర్షియల్‌గా నైనా వర్కవుట్ అయ్యింది కానీ… ఆ క్లాసిక్ కాపీలో తెలుగు వెర్షనే మరీ నిరాశపరిచింది.

మరి ఇలాంటి దుస్సాహసాల్లో మరోటి ‘‘ఇందుమతి’’ అనే తెలుగు సినిమా. ఈ సినిమాను హిచ్ కాకే రూపొందించిన మరో సినిమా ‘‘సైకో’ ఆధారంగా రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత థ్రిల్లర్, హారర్ సినిమాల జాబితాలో టాప్ ఫైవ్‌లో నిలబడే ‘‘సైకో’ సినిమాను కూడా మనోళ్లు తమదైన స్టైల్లో కాపీ కొట్టారు. శివాజీ ముఖ్యపాత్రలోనటించిన ‘ఇందుమతి’ సినిమా ‘‘సైకో’’కి ట్రిబ్యూట్ కాకపోగా.. ఒక వృథా ప్రయత్నం అయ్యింది. షోలే సినిమాను రీమేక్ అంటూ రామ్ గోపాల్ వర్మ ‘‘ఆగ్’’ రూపంలో అసలు వెర్షన్‌ను ఎలా చెడగొట్టాడో… ‘‘స్ట్రేంజర్స్ ఇన్ ఏ ట్రైన్’’ ‘సైకో’ సినిమాలను కూడా దక్షిణాది సినీ రూపకర్తలు అలాగే చెడగొట్టారు. కనీసం వర్మ తను ‘‘షోలే’’ ను రీమేక్ చేస్తున్నాను అంటూ.. ప్రకటించుకున్నాడు. అయితే హిచ్ కాక్ సినిమాలను కాపీ చేసిన వారు మాత్రం అవేవో తమ సొంత కథలు అయినట్టుగా ప్రకటించుకున్నారు.

అయినా ఇలా ప్రపంచ ప్రసిద్ధి పొందిన సినిమాలను కాపీ చేయడం కూడా ఒక కళ. అలాంటి కళను అద్భుతంగా ప్రదర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. ఒరిజినల్ నుంచి కథాంశాన్ని కాపీ కొట్టి.. తమదైన శైలిలో ఆ కథకు సొబగులు అద్ది వాటికి ఫ్రెష్ లుక్ ను తీసుకు వచ్చిన వారు కూడా ఉన్నారు. ఆ జాబితాలో ప్రియదర్శన్ పేరును చేర్చాలి.  హాలీవుడ్ రొమాంటిక్ కామెడీల్లో ఎవరిగ్రీన్ గా చెప్పుకోదగ్గ సినిమాను తనదైన శైలిలో కాపీ చేశాడు ప్రియన్. 1995లో వచ్చిన ‘‘వైల్ యువ్ వర్ స్లీపింగ్’’ సినిమా హాలీవుడ్ టాప్ హండ్రెడ్ రొమాంటిక్ కామెడీల్లో ఒకటి. ఈ సినిమాను ఆసాంతం కాపీ కొట్టి ప్రియన్ తయారు చేసిన స్క్రిప్టే ‘‘చంద్రలేఖ’’ ముందుగా మలయాళంలో వచ్చి సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. అక్కడ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా తెలుగులో నాగార్జునతో, హిందీలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ అయ్యింది. ఇంతకీ ఒరిజినల్ కు ప్రియన్ చేసిన మార్పులు ఏమిటంటే… ఇండియన్ వెర్షన్ లో హీరోయిన్ పాత్ర యాక్సిడెంట్‌కు గురై.. బెడ్‌కు అంకితం అవుతుంది. ఆమె పాత్ర కోమా స్టేజీలో ఉండగా సినిమా మొత్తం సాగుతుంది. 

అయితే ఒరిజినల్‌లో మాత్రం హీరో అనుకోదగ్గ ఒక పురుష పాత్ర కోమా స్టేజీలో ఉండగా హీరోయిన్ ఒరియెంటెడ్‌గా సినిమా సాగుతుంది. ఇండియన్ వెర్షన్ లో రమ్యకృష్ణ పాత్ర బెడ్ మీద ఉంటుంది. ఆమె కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని నాగార్జున పాత్ర తన కుటుంబ పరిస్థితులను చెక్కబెట్టుకుంటాడు, రమ్యకు చెల్లి పాత్రలో ఉండే అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరకు ఆమెనే పెళ్లి చేసుకొంటాడు. హాలీవుడ్ వెర్షన్ దీనికి రివర్స్ గా ఒక వ్యక్తి కోమాలో ఉండగా.. హీరోయిన్ అతడి కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని తన కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకుని.. చివరకు అతడి తమ్ముడితో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంటుంది. ఒరిజినల్ నుంచి మూలపాయింట్ ను తీసుకొని.. దాన్ని చక్కగా ఇండియనైజ్ చేసి ప్రియదర్శన్ ఒక రొమాంటిక్ కామెడీని రీమేక్ చేశాడు. అయితే ఈయన కూడా ఈ కథ తనదిగానే టైటిల్ కార్డ్స్ లో వేసుకున్నాడు. ఒక గొప్ప సినిమాను కాపీ కొట్టి రూపొందించిన సినిమాతో పర్వాలేదనిపించుకుని పరువునైతే నిలుపుకున్నాడు!