అనుమానాలు పెంచుతున్న ‘సమీకరణ’

ఏ పని అయినా మొదలు పెట్టినపుడు బాలారిష్టాలు తప్పవు..అదే విధంగా ఏ ప్రాజెక్టుకైనా ముందు కాస్త వ్యతిరేకత వస్తుంది. తరువాత సర్దుకుంటుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన సీమాంధ్ర రాజదాని…

ఏ పని అయినా మొదలు పెట్టినపుడు బాలారిష్టాలు తప్పవు..అదే విధంగా ఏ ప్రాజెక్టుకైనా ముందు కాస్త వ్యతిరేకత వస్తుంది. తరువాత సర్దుకుంటుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన సీమాంధ్ర రాజదాని విషయంలో కూడా ఇలాగే జరుగుతుందనుకున్నారంతా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో నడుస్తోంది. ఆది నుంచి చాలా గుంభనంగా, అత్యంత గోప్యంగా నడుస్తోంది..నడిపిస్తోంది ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం. అసలు రాజధాని సరిహద్దులు స్పష్టమై ఇంకా వారం కాలేదు. కానీ కృష్ణ గుంటూరు జిల్లాల్లో రాజధాని అన్న హడావుడి నెలల క్రితమే మొదలైంది. ఇక్కడ ఓ సంగతి గమనించాలి. మొదట్నించీ గుంటూరు జిల్లాలోనే రాజధాని అని బాబు కన్నా నమ్మకంగా చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి ముప్పవరకు వెంకయ్యనాయుడు. బాబు మాత్రం కృష్ణ, గుంటూరు అనేవారు. ఆఖరికి ఇవ్వాళ వెంకయ్యనాయుడు మాటే నిజమైంది.

సరే ఆ సంగతి అలా వుంచితే,  గడచిన నెలల కాలంగా ప్రభుత్వం గుప్పిట మూసి వుంచి,. తమ చిత్తానికి ఒక్కో వేలు విడుస్తూ, రాజధాని రహస్యాన్ని ఇప్పటికి బయట పెట్టింది. అయితే ఇంకో గుప్పిట ఇంకా మూసే వుంది. అందులో ఈ భూ సమీకరణ వ్యవహారాలున్నాయి. దీనికి సంబంధించి ఒక్కటైనా అధికారిక ప్రకటన కానీ గెజిట్ నోటిఫికేషన్ కానీ, ప్రభుత్వ ఆదేశాలు కానీ వున్నాయా? అంటే లేవు. అధికారిక హోదాలో వున్నపెద్దల వ్యక్తిగత ప్రకటనలే తప్ప వేరు కావు. అక్కడికి కూడా ఒకటి రెండు వేళ్లు తప్ప మిగిలినవి మూసే వున్నాయి. అలా వాటిని మూసి వుంచే కథ నడిపించేద్దామనుకున్నారు వాస్తవానికి. 

కానీ మన భజన మీడియాల సంగతి అలా వుంచితే, జాతీయ మీడియా కథనాలు అందివ్వడం, రైతుల సమావేశాలు ప్రారంభమై, ప్రజా చైతన్యం బయటకు రావడంతో మన మీడియా కూడా అరకొరగా అయినా అటు దృష్టి పెట్టక తప్పలేదు. దీంతో అసలు సంగతుల మెలమెల్లగా బయటకు వస్తున్నాయి. రైతులందరికీ ఎక్కడో ఓ లే అవుట్ వేసి, చేతులు దులుపుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని, అక్కడి జనం పసిగట్టారు. సమీకరణలో తమకు జరుగుతున్న నష్టాన్ని, ప్రభుత్వానికి ఉన్న లాభాన్ని వారికి అర్థమయ్యేలా ప్రతిపక్షనాయకులు, రైతు నాయకులు, చెప్పగలిగారు.

ఇది జరిగేసరికే, చంద్రబాబు పరిస్దితిని అర్థం చేసుకుని, మంత్రులను రాయబారానికి పంపారు. ఇప్పుడు మంత్రులు పర్యటిస్తుంటే, రైతులు నిలదీస్తున్నారు. అప్పుడు కొత్త బేరాలు ప్రారంభమయ్యాయి.

వెయ్యి గజాలకు బదులు పన్నెండు వందల గజాలు..నగదు అడ్వాన్సు, 200 గజాల కమర్షియల్ ప్లాటు, ఇలా.డిమాండ్లు వినిపిస్తుంటే, ప్రభుత్వం దిగి వస్తున్నట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి. 1200 కు ఓకె అని, 200 గజాలు కూడ ఇస్తామని వ్యక్తిగత ప్రకటనలు., తెలిసింది….అన్న టైపు వార్తలు వెలికివస్తున్నాయి. ఇవి ఇలా ఓ పక్క సాగుతుంటే, మరోపక్క కొత్త అనుమానాలు, డిమాండ్లు పుట్టుకువస్తున్నాయి.

‘మాకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు, అప్పు తెచ్చుకునేందుకు పొలం వుండేది…ఇప్పుడు అదే లేకుంటే ఇంకేంటి?’ అన్నాడో రైతు. దాంతో ఎంపీ మురళీ మోహన్. రైతుల కోసం రెండు లక్షల విలువైన ఆరోగ్య పాలసీ అందిస్తామన్నారు. మురళీ మోహన్ ఎంపీ కావచ్చు. కానీ ఇదెంత పాలసీ మాటర్. ఆరోగ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ఈ విషయం ఎప్పుడో చెప్పాలి కదా..ఇప్పుడేలా తెరపైకి వచ్చింది. అంటే సమస్య ఉత్పన్నం కాగానే పరిష్కారాలు ఆలోచించుకుంటూ పోతున్నారన్నమాట. ఓ స్పష్టమైన విధివిధానం ఏదీ ప్రభుత్వం దగ్గర లేదు. ప్రతిపాదన వుంది. రైతులతో బేరం కుదరాలి..దానికి కాస్త అటు ఇటుగా వెళ్లి, అప్పుడు మొత్తం విధివిదానాలు ప్రకటిస్తారు.

అంతకన్నా ముందుగానే స్పష్టమైన విధివిధానాల గెజిట్ నోటిఫికేషన్ చేసి, వాటిపై సమావేశాలు నిర్వహించి, ఆ మేరకు సవరణలు చేయడం సబబుగా వుంటుంది. ఎందుకంటే ఇదేమీ వ్యక్తిగత రియల్ ఎస్టేట్ డీల్ కాదు..ప్రభుత్వ ప్రాజెక్టు. దీంట్లో ఇంత దాపరికం, ఎవరి చిత్తానికి వారు ప్రకటనలు చేయడం సమస్య ను మరింత జటిలం చేస్తాయి కానీ సులువు చేయవు.

చాణక్య

[email protected]