క‌రాటే కిక్స్‌తో స్నాచ‌ర్ ని మ‌ట్టి క‌రిపించిన యువ‌తి…

రాత్రి 9గంట‌లు. అంద‌మైన ఇద్ద‌రు యువ‌తులు. అందులో ఒక‌మ్మాయి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద న‌డుస్తోంది. ఇంత‌లో వెనుక నుంచి వ‌చ్చి ప‌డ్డాడో స్నాచ‌ర్ . ఆమెను వెనుక నుంచి ప‌ట్టుకున్నాడు. అరుస్తుందేమో అని…

రాత్రి 9గంట‌లు. అంద‌మైన ఇద్ద‌రు యువ‌తులు. అందులో ఒక‌మ్మాయి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద న‌డుస్తోంది. ఇంత‌లో వెనుక నుంచి వ‌చ్చి ప‌డ్డాడో స్నాచ‌ర్ . ఆమెను వెనుక నుంచి ప‌ట్టుకున్నాడు. అరుస్తుందేమో అని ఊపిరాడ‌కుండా ప‌ట్టు బిగించాడు. ఆమె భుజానికి వేలాడుతున్న బ్యాగ్‌ను, సెల్‌ఫోన్ లాక్కోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. 

ఇంత‌లో ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. ఆమెను ప‌ట్టుకున్న చేతిని వ‌దిలేసి  “హ‌మ్మా” అంటూ పొట్ట ప‌ట్టుకున్నాడా దుండ‌గుడు. ఆ దెబ్బ నుంచి తేరుకునేలోపే మోకాలిపై మ‌రో పంచ్‌, జ‌రిగిందేమిటో తెలుసుకునేలోపే డొక్క‌ల్లో మ‌రో కిక్‌… అంతే ఇక తేరుకోలేదా  దొంగ‌. అలాగే కుప్ప‌కూలిపోయాడు ఆ న‌డిరోడ్డు మీద‌. 

వాడిని అలా చిత‌క్కొట్టి, అమ్మాయిల‌ను కాపాడ‌డానికి ఈ సంఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి సినిమాలోలా హీరో రాలేదు. పోలీసులూ రాలేదు. ఆ అమ్మాయిలోని క‌రాటే ఫైట‌ర్ బ‌య‌ట‌కి వ‌చ్చింది. రేప్‌ల‌కు, టీజింగ్‌కు కేరాఫ్ లాంటి ఢిల్లీ న‌గ‌రంలో చోటుచేసుకుందీ సంఘ‌ట‌న‌. సుర‌భి రాల్హాన్ అనే అమ్మాయి త‌న చెల్లెలు సిమ్రాన్‌తో క‌లిసి ఖ‌న్నా మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా ఓ దుండ‌గుడు దాడి చేస్తే అత‌డ్ని ధైర్యంగా ఎద‌రించి త‌న క‌రాటే నైపుణ్యాన్ని చూపించింది. 

“ఎదురుదాడి ఉంటుంద‌ని వాడు ఊహించ‌లేదు. నేను భ‌య‌ప‌డి అరుస్తాన‌ని, వాడిని వ‌దిలేస్తాన‌ని అనుకున్నాడు” అంటున్న సుర‌భి… తాను కొట్టిన దెబ్బ‌ల నుంచి తేరుకుని ఆ దుండ‌గుడు ప‌రిగెడుతున్నా వ‌ద‌ల‌క‌పోవ‌డం విశేషం. చెల్లెలితో స‌హా అరుస్తూ వాడిని వెంబ‌డించింది. అలా ప‌రిగెడుతూనే పోలీసుల‌కు ఫోన్ చేసింది. షాదిపూర్ మెట్రో స్టేష‌న్ ద‌గ్గ‌ర వాడిని ప‌ట్టుకుంది. ప‌టేల్ న‌గ‌ర్ పోలీసుల‌కు అప్ప‌గించింది. అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ వాడి కాల‌ర్ ప‌ట్టుకుని నెట్టుకుంటూ 100 మీట‌ర్ల దూరంలో ఉన్న  పోలీస్ స్టేష‌న్‌కు లాక్కెళ్లారు. 

ప్ర‌స్తుతం బిఆర్ అంబేడ్క‌ర్ కాలేజ్‌లో లా చ‌దువుతోంది సుర‌భి. “ఢిల్లీ పోలీసులు మా స్కూల్‌లో నిర్వ‌హించిన సెల్ఫ్ డిఫెన్స్ః క్లాస్‌లకు నేను అటెండ్ అయ్యాను. అయితే అలుమ్ని ఫంక్ష‌న్ కోసం నా పాత ఫ్రెండ్స్‌ను క‌లిసే అవ‌కాశం దొరుకుతుంద‌ని మాత్ర‌మే అక్క‌డికి వెళ్లా త‌ప్ప‌, అక్క‌డ నేర్చుకున్న కొన్ని ర‌కాల ఫైటింగ్ టెక్నిక్స్ ఇలా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అనుకోలేదు”అంటోంది సుర‌భి.  

ఎవ‌రో వ‌స్తార‌ని ఏదో చేస్తార‌ని ఎదురుచూస్తూ ఎంత కాలం మోస‌పోతారు? ఇప్ప‌టి మ‌హిళాలోకానికి కావాల్సింది ఇదే ధైర్యం ఇదే తెగువ‌… కీపిట‌ప్‌… సుర‌భి.