రివ్యూ: జోరు
రేటింగ్: 2/5
బ్యానర్: శ్రీ కీర్తి ఫిలింస్
తారాగణం: సందీప్ కిషన్, రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ, బ్రహ్మానందం, సయాజీ షిండే, అజయ్ తదితరులు
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్ (శివ)
ఛాయాగ్రహణం: ఎం.ఆర్. పళని కుమార్
నిర్మాతలు: అశోక్, నాగార్జున్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
విడుదల తేదీ: నవంబర్ 7, 2014
సందీప్ కిషన్ హీరోగా ముగ్గురు హీరోయిన్లతో ‘గుండెల్లో గోదారి’ దర్శకుడు కుమార్ నాగేంద్ర చేసిన ‘జోరు’ పబ్లిసిటీ పరంగా బాగానే హోరు సృష్టించింది. మరి ఆ సౌండుకి తగ్గ సీను ఈ సినిమాకుందో లేదో సమీక్షించుకుందాం…
కథేంటి?
రోడ్ జర్నీలో అనుకోకుండా సందీప్‌కి (సందీప్ కిషన్) తారసపడుతుంది ఎన్నారై అన్నపూర్ణ అలియాస్ అను (రాశి). ఆమె వైజాగ్ ఎమ్మెల్యే సదాశివం (సయాజీ షిండే) కూతురని తెలుసుకున్న సందీప్ ఆమెని తన తండ్రి దగ్గరకి చేర్చే బాధ్యత తీసుకుంటాడు. ఇంతలో వారిపై వరుసగా ఎటాక్స్ జరుగుతుంటాయి. అను గతమేంటి… ఆమెపై దాడి చేస్తున్నదెవరు.. ఆమెకి సాయం చేయడానికి సందీప్ ఏం చేస్తాడనేది మిగతా కథ.
కళాకారుల పనితీరు:
సందీప్ కిషన్‌కి నటుడిగా ఎలాంటి పరీక్ష పెట్టని మామూలు పాత్ర ఇది. కాస్తో కూస్తో యాక్షన్ పార్ట్ ఉంది కానీ లేదంటే సందీప్ చేస్తున్న మిగతా సినిమాలకీ, దీనికీ అతనికి కూడా కొత్త అనుభూతినిచ్చే అంశమేదీ దీంట్లో లేదు. తన వరకు బాగానే చేసాడు. రాశి ఖన్నా తెరపై కనిపించగానే థియేటర్లో విజిల్స్ వినిపించాయి. ‘ఊహలు గుసగుసలాడే’తో యూత్‌లో కొంతమందిని రాశి బాగానే ఆకట్టుకుంది. దర్శకుడు, కెమెరామెన్ కూడా ఆమె మీదే మొత్తం ఫోకస్ పెట్టారు. ఆమె ఫేస్‌పై ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ చాలా పడ్డాయి. సందర్భం లేకపోయినా ఆమె కోసం ఒక బీచ్ సాంగ్ కూడా ఇరికించారు. డాన్స్ సరిగా రాకపోయినా కానీ రాశి గ్లామర్ షోతో మేనేజ్ చేసేసింది. నటిగా ఆమెకి కూడా ఎలాంటి ఉపయోగపడని పాత్ర ఇది. సుష్మ కూడా అవకాశం దొరికినపుడల్లా తన హొయలతో మెప్పించే ప్రయత్నం చేసింది. వీరిద్దరి ముందు ప్రియా బెనర్జీ తేలిపోయింది.
బ్రహ్మానందంకి మరో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చారు కానీ ఆయనని వాడుకోలేకపోయారు. సప్తగిరి చేసిన కామెడీ కూడా కొంత మందికే నచ్చుతుంది. మిగిలిన సినిమాల్లో తను స్క్రీన్‌పై ఉన్నప్పుడు అందర్నీ డామినేట్ చేసేసినట్టుగా ఈసారి సప్తగిరి క్లిక్ అవలేదు. తన సీన్లు సరిగా రాసుకోకపోవడంతో సప్తగిరి కూడా ఫెయిలయ్యాడు. అక్కడికీ అడపాదడపా తన మార్కు కామెడీతో నవ్వించగలిగాడు. చదవగా, చదవగా కాకరకాయ కీకరకాయ అయినట్టు… సయాజీ షిండే తెలుగుకి మరింత తెగులు సోకింది. ఇన్ని సినిమాల అనుభవం తర్వాత తెలుగు ఉఛ్ఛారణ మెరుగవ్వాల్సింది పోయి… ఇంకాస్త హీనంగా తయారైంది. తెరపై ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ అజయ్, పృధ్వీతో సహా అందరూ వేస్టయ్యారు.
సాంకేతిక వర్గం పనితీరు:
లో బడ్జెట్ సినిమా అయినా కానీ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. క్వాలిటీ ప్రోడక్ట్ అందించినందుకు నిర్మాతలని అభినందించాలి. పబ్లిసిటీతో ఈ చిత్రానికి ఆకర్షణ తీసుకురావడంలో కూడా నిర్మాతలు సక్సెస్ అయ్యారు. భీమ్స్ స్వరపరిచిన పాటలు వినడానికి, చూడ్డానికి కూడా బాగానే ఉన్నాయి. సన్నీ నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్‌కి మంచి మార్కులు పడతాయి. ఇంటీరియర్ సీన్స్‌లో కూడా క్వాలిటీ కనిపించింది. చిన్న సినిమాల్లో ఇది చాలా అరుదు. కలర్ గ్రేడిరగ్ కూడా బాగా చేసారు.
దర్శకుడు కుమార్ నాగేంద్రకి తన సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్‌పుట్ రాబట్టుకునే సత్తా ఉంది. అయితే ఒక సినిమాకి బేసిక్ అవసరం అయిన స్క్రిప్ట్ విషయంలోనే తప్పులు చేసేయడం వల్ల మిగతా ఆకర్షణలు ఎన్ని తోడయినా కానీ ‘జోరు’ అలరించలేకపోయింది. మొదటి సినిమాలో ఆఫ్‌బీట్ లక్షణాలు ఎక్కువగా చూపించిన నాగేంద్ర ఈసారి కమర్షియల్ దర్శకుడు అనిపించుకునేందుకు బాగా కృషి చేసాడు. కాకపోతే రచన విషయంలోనే తప్పటడుగులు వేసేసి తనకి తానే అవరోధం అయిపోయాడు.
హైలైట్స్:
- గ్లామర్ ఫ్యాక్టర్
- క్లయిమాక్స్
డ్రాబ్యాక్స్:
- విషయం లేని ఫస్ట్ హాఫ్
- కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే
- ఓవర్ ది టాప్ కామెడీ
విశ్లేషణ:
ఇంటర్వెల్ తర్వాత విలన్ ఇంటికి మొత్తం తారాగణం అంతా బదిలీ అయి కామెడీతో కంగాళీ చేయడమే ఎంటర్టైన్మెంట్ అని బలంగా నమ్ముతోన్న బాపతు సినిమానే ఇది కూడా. ద్వితీయార్థంలో ఆ గందరగోళంలోకి వెళ్లే ముందు అంతా దర్శకుడు రోడ్డు మీద అనవసరంగా కాలక్షేపం చేసాడు. మామూలుగానే రోడ్ ట్రిప్ మూవీస్ హ్యాండిల్ చేయడంలో మన వాళ్లు వీక్. చాలా కొద్ది మంది మాత్రమే ఈ తరహా సినిమాల్ని రక్తి కట్టించారు. కుమార్ నాగేంద్ర మాత్రం ద్వితీయార్థంలో కన్ఫ్యూజింగ్ కామెడీకి తెర తీసే ముందు గంట సేపు సమయం గడపడానికి రోడ్ ట్రిప్‌ని వాడుకున్నాడు.
ఫస్ట్ హాఫ్‌లో అస్సలు మేటర్ లేకపోవడంతో… రాశి ఖన్నా అటు ఇటు పరుగెత్తే షాట్లు… ఆమె ముఖంపై కెమెరా అదే పనిగా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయ్యే షాట్లు… సందీప్ కిషన్‌కి కొన్ని బిల్డప్ షాట్లు వేసి కాలం గడిపేసారు. రాశి ఖన్నా షో రీల్కే దాదాపు అరగంట కేటాయించినట్టు అనిపిస్తుంది. సప్తగిరితో ఒంటరిగా కామెడీ చేయించడమెలాగో తెలీక అతడికి ఎలుగుబంటికి సంగీతం నేర్పించే పని అప్పగించి టైమ్ పాస్ చేసారు. ఇందులో ఉన్న ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో చూసేసిందే కావడంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్‌గా వేస్ట్ అయిపోయింది.
సెకండ్ హాఫ్‌లో లీడ్ క్యారెక్టర్స్ అన్నీ ఏదో ఒక సాకుతో విలన్ ఇంట్లో చేరిపోయి అతడికి బుద్ధి చెప్పే రొటీన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాయి. ఎంత కామెడీ చేస్తున్నా కానీ నవ్వు రాకపోవడం ఈ చిత్రం స్పెషాలిటీ. కామెడీ చేయడం ఒక టైపు… కామెడీ చేస్తున్నామనుకోవడం మరో టైపు. ఇది రెండో టైప్ సినిమా అన్నమాట. బహుశా ఈ చిత్ర బృందం ఇప్పటికీ ఆ లోపాన్ని గుర్తించి ఉండకపోవచ్చు. అంత సేపు ప్రయాస పడినందుకు క్లయిమాక్స్‌లో కాస్త కామెడీ పండిరది. ఆ ఒక్క పాజిటివ్ పాయింట్‌కి తోడు ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ షో దీనికి మరో అడ్వాంటేజ్.
పబ్లిసిటీ ఘనంగా చేసుకున్నారు కనుక ఓపెనింగ్స్ వరకు బాగానే వచ్చాయి. కొద్ది రోజుల పాటు ఈ జోరు కొనసాగిస్తే తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా కనుక రికవర్ అయిపోవచ్చు. కమర్షియల్ అవుట్‌కమ్ గురించి పక్కన పెడితే సినిమాగా మాత్రం జోరు పరమ బోరు కొట్టిస్తుంది. అర్థం లేని సన్నివేశాలతో, పదార్థం లేని కామెడీతో సహనాన్ని పరీక్షిస్తుంది.
బోటమ్ లైన్: బేజారు!
-గణేష్ రావూరి