సినిమాలకు మళ్లీ థియేటర్ల కొరత వచ్చేలా కనిపిస్తోంది. గడచిన నెల రోజులకు పైగా ప్రతి వారం వరుసపెట్టి సినిమాలు విడుదల అవుతుండడం, అలాగే కొన్ని సినిమాలు థియేటర్లలో ఒక వారానికి మించి నిల్చోవడం వంటి పరిణామాలతో థేయేటర్ల కు సమస్య వస్తోంది. గడచిన నెల రోజుల వ్యవధిలో, ఆగడు తరువాత వరుసగా లౌక్యం, గోవిందుడు అందరి వాడేలే, దిక్కులు చూడకు రామయ్యా, రోమియో, పాఠశాల, ఒక లైలా కోసం, పూజ, కార్తికేయ, కరెంటు తీగ తదితర సినిమాలు విడుదలయ్యాయి.
ఇవికాక చిన్నా చితకా సినిమాలు వీటికి రెండింతలు వుంటాయి. అయితే గోవిందుడు, లౌక్యం వసూళ్లు మందగించిన నాటికి థియేటర్లు ఖాళీగా వున్నాయి. దాంతో చిన్నా చితకా సినిమాలకు కూడా థియేటర్లు దొరికాయి. కానీ ఇప్పుడు లౌక్యం, ఒకలైలా కోసం, పూజ, కార్తికేయ, కరెంటు తీగ దాదాపు ఒక్కొక్కటి మూడు వందలకు పైగా స్రీన్లలో వున్నాయి. అంటే దాదాపు 1500 స్రీన్లు అనుకోవచ్చు. పైగా వీటి కలెక్షన్లు మరీ తీసి పారేయవిగాలేవు. అలా అలా ఖర్చులకు సరిపోవడం లేదా, మిగలడం అన్న స్టేజ్ లో వున్నాయి. పూజ అనూహ్యంగా బిసి ల్లొ బాగానే పాగా వేసింది. ఇప్పుడు కరెంటు తీగది కూడా అదే పరిస్థితి.
ఇలాంటి నేపథ్యంలో ఈ వారం జోరు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి విడుదలవుతున్నాయి. ఇప్పుడు వీటికి థియేటర్లు కాస్త వెదుకులాడాల్సి వచ్చింది. అయితే జోరు కాస్త లక్కీ,. ఎందుకంటే వాళ్లు నైజాంలో ఆసియన్ సునీల్ కు పంపిణీ ఇచ్చారు. అలాగే సీడెడ్ లో ఎన్ వి ప్రసాద్ తీసుకున్నారు. వీళ్లకి థియేటర్లు చేతిలో వున్నాయి కాబట్టి ఫరవాలేదు అని అనుకోవడానికి లేదు.
ఇప్పటికే ఆ థియేటర్లలో వున్న సినిమాల రన్ బాగానే వుంది. ఉన్నట్లుండి తీసేయలేరు. అలాగని తమ సినిమా కాదని ముందుకు వెళ్లలేరు.. అలాగే బ్రదర్ ఆప్ బోమ్మాళి నైజాంలో దిల్ రాజు కు అందించారు. ఆయనకు ధియేటర్లు వున్నాయి, వాటికీ ఇలాంటి సమస్య వుంది. అందుకే కిందా మీదా పడి అడ్జస్ట్ చేస్తున్నారు. ఎటొచ్చీ రెండు సినిమాలకు కూడా ఆంధ్రలోనే సమస్య. దాదాపు ప్రతి సెంటర్ లో మెయిన్ థియేటర్లలో దగ్గర దగ్గర అయిదు సినిమాలు వున్నాయి.
ఏదో థియేటర్ దోరికితే సరిపోదు.ప్రతి ఊరికి కొన్ని థియేటర్లకు పేరు వుంటుంది. వాటిని బట్టి కూడా కలెక్షన్లు ఆధారపడి వుంటాయి. ఇప్పుడు వీళ్లకీ ఆ ధియేటర్లే కావాలి. అంటే వున్నవాటిని లేపాలి. అది మాట రాకుండా ఇబ్బంది పడకుండా చేయాలి. అదీ సంగతి. దీంతో కిందా మీదా పడుతున్నారు.
ఇప్పుడే ఇలా వుంటే మరి 14కు మరో రెండు సినిమాలు వచ్చి పడుతున్నాయి. అవి కూడా పంపిణీ రంగంలో వున్న దాసరి, అల్లు అరవింద్, దిల్ రాజు ల నుంచే. ఆ సినిమాలను దృష్టిలో వుంచుకుని ఇప్పటి నుంచీ బ్లాక్ చేయాల్సి వుంది. అదో సమస్య. ఈ నెల అంతా ఇంకా సినిమాలు షెడ్యూలు అయి వున్నాయి. ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా, ఏవరేజ్ టాక్ వచ్చినా రెండు వారాలు కనీసం థియేటర్లలో వుంటాయి.
మొత్తానికి మళ్లీ థియేటర్ల సమస్య వస్తోంది టాలీవుడ్ కి.
‘చిత్ర’గుప్త