పాతికేళ్ల అనుబంధానికి తెరపడింది

పాతికేళ్ల అనుబంధానికి తెర పడిపోయింది. భవిష్యత్తులో కలుస్తామో లేదో చెప్పలేం. ఆ అనుబంధపు జ్ఞాపకాలే ఇక మిగిలాయి. ఇదేదో కుటుంబ అనుబంధమో, రాజకీయ అనుబంధమో కాదు. తెలుగు పాఠకులకు ఓ మంచి మేగజైన్‌తో ఉన్న…

పాతికేళ్ల అనుబంధానికి తెర పడిపోయింది. భవిష్యత్తులో కలుస్తామో లేదో చెప్పలేం. ఆ అనుబంధపు జ్ఞాపకాలే ఇక మిగిలాయి. ఇదేదో కుటుంబ అనుబంధమో, రాజకీయ అనుబంధమో కాదు. తెలుగు పాఠకులకు ఓ మంచి మేగజైన్‌తో ఉన్న అనుబంధం. ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి పాతికేళ్లుగా వెలువడిన ప్రాంతీయ (తెలుగు) పత్రికతో ఉన్న అనుబంధం. దేశ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో, విదేశీ వ్యవహారాల్లో తలపండిన, చేయితిరిగిన, అనుభవజ్ఞులైన విశ్లేషకులు అందించే వ్యాసాలు, కథనాలు, విశ్లేషణలు ఇన్నేళ్లూ చదువుతూ వచ్చిన తెలుగు పాఠకులు (ఇంగ్లీషు అంతగా రాని వారు) ఇప్పుడు దాన్ని కోల్పోయారు. వారు కోల్పోయిన మేగజైన్‌ పేరు ‘ఇండియా టు డే’ (తెలుగు). ప్రస్తుతం చివరి సంచిక మార్కెట్లో ఉంది. ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌  ‘కామన్‌మేన్‌’ శైలిలో ఆ పత్రిక డిప్యూటీ చీఫ్‌ ఇలస్ట్రేటర్‌ నర్సిం వేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కేరికేచర్‌ ముఖచిత్రంగా గల ఇండియా టు డే చివరి సంచికను చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. ఆ పత్రిక పాత్రికేయులకు ఇదే (16.2.15) చివరిరోజు.

నేను మద్రాసులో  (ఇప్పటి చెన్నయ్‌) ‘ఈనాడు’ రిపోర్టర్‌గా నాలుగేళ్లు పనిచేసినప్పుడు నర్సిం మంచి మిత్రుడు. అప్పట్లో ఇండియా టు డేలో పనిచేసినవారు కొందరు గతంలోనే హైదరాబాద్‌కు వచ్చి కొన్ని పత్రికల్లో, టివి ఛానెళ్లలో చేరారు. అప్పట్లోనేవారు ఇండియా టు డే తెలుగు సంచిక మూతపడేలా కనబడుతోందని అన్నారు. కాని డెస్కులోకి కొందరు పాత్రికేయులను తీసుకోవడంతో అలా జరగకపోవచ్చని అనిపించింది. తెలుగు సంచికతో పాటు తమిళ, మళయాళ సంచికలు నష్టాల్లో ఉన్నాయని కొన్నేళ్లుగా వినిపిస్తోంది. కాని ఇది జాతీయ స్థాయి మీడియా సంస్థ కాబట్టి ప్రాంతీయ భాషా సంచికలను ఎలాగోలా నడిపిస్తారని అనిపించింది. కాని కొనసాగించలేకపోయారు. ఇండియా టు డే యాజమాన్యం చివరి సంచికలో ’ప్రచురణకర్తల నుంచి’ పేరుతో చిన్న నోట్‌ ప్రచురించింది. ఇది చిట్టచివరి సంచికని తెలియచేసేందుకు తాము చింతిస్తున్నామని పేర్కొంటూ మీడియా, సాంకేతిక రంగంలోరంగాల్లో  వస్తున్న మార్పుల కారణంగా ముద్రిత రూపంలో (ప్రింట్‌ ఫార్మాట్‌) ఈ వార పత్రికను కొనసాగించడం సాధ్యపడటంలేదని తెలిపింది. మరో కొత్త రూపంలో మీ ముందుకు అతి త్వరలోనే రావాలనుకుంటున్నాం అని ముక్తాయించింది. ఈ విషయంలో యాజమాన్యం వివరణ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఆ కొత్త రూపం ఎలా ఉంటుందో చెప్పలేం. 

ఆంగ్లంలో జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెంది, ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న ఇండియా టు డే గ్రూపు దేశంలోని కొన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఇండియా టు డే ప్రారంభించాలని నిర్ణయించి, 1990`91లో తెలుగుతో పాటు తమిళ, మళయాళ సంచికలను ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ కథనాలకు ఇండియాను చిరునామాగా చాలామంది భావిస్తారు. దేశంలోని పలు నగరాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నేరుగా, ప్రత్యక్షంగా కథనాలు అందించడంలో ఇండియా టు డే దిట్ట. ఇక గ్రాఫిక్స్‌, ఛాయాచిత్రాలు మొదలైనవి ఆకట్టుకుంటాయి. అలాగే ఎన్నికల సమయంలో, ముఖ్యమైన సందర్భాల్లో సర్వేలు కూడా నిర్వహిస్తుంది. అయితే ప్రాంతీయ భాషా సంచికలు ప్రారంభించకముందు ఇదంతా కేవలం పట్టణ, నగర ప్రాంతాల పాఠకులకు, ఆంగ్లం చదవి అర్థం చేసుకునేవారికే పరిమితమైంది. ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులు ఇండియా టు డేను కూడా అధ్యయనం చేసేవారు. ఈ అవకాశం గ్రామీణ ప్రాంతాలవారికి ఉండేది కాదు. ఎప్పుడైతే తెలుగు ఇండియా టు డే ప్రారంభమైందో దాని పట్ల గ్రామీణ ప్రాంతాలవారు కూడా బాగా ఆకర్షితులయ్యారు. ఆంగ్ల ఇండియా టు డేకు ఉన్న ఇమేజ్‌ కారణంగా తెలుగు పత్రిక కూడా ఆదరణ పొందింది. జాతీయ, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేస్తారు. ప్రాంతీయ పత్రిక ప్రారంభమైన కొత్తలో అనువాద కథనాలు ఇబ్బంది కలిగించేవి. కొరుకుడు పడకపోయేవి. ప్రాంతీయత (నేటివిటీ) లోపించింది. అంటే ఇంగ్లీషు పత్రికకు పూర్తి నకలుగా ఉండేది.     

కాని కాలక్రమంలో ప్రాంతీయ కథనాలకూ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ముఖచిత్రాల్లోనూ ప్రాంతీయ కనబడేలా చేశారు. దీంతో ఇది తెలుగు పత్రిక అనే అభిప్రాయం కలిగించారు. అప్పుడప్పుడు ప్రత్యేక సంచికలు వేశారు. చిరంజీవి, మహేష్‌ బాబు, అక్కినేని నాగేశ్వరరావు మొదలైనవారిపై స్పెషల్స్‌ వేశారు. తెలుగు సాహిత్యంపై రెండో మూడో ప్రత్యేక సంచికలు వేశారు. ఇలాంటివాటివల్ల పత్రిక తెలుగు పాఠకులకు దగ్గరైంది. ప్రారంభం తరువాత కొన్నేళ్లు పక్షపత్రికగా ఉన్న ఇండియా టు డే తరువాత వారపత్రికగా మారింది.  ఇండియా టు డే మాదిరిగానే  అరిందమ్‌ చౌధురి నేతృత్వంలోని ‘ఇది సండే ఇండియన్‌’ కూడా అదే పేరుతో తెలుగులో కొన్నాళ్లు వచ్చింది. కాని ఇది మార్కెట్లో కనబడక చాలా కాలమైంది. ఆగిపోయిందని పాత్రికేయ మిత్రులు చెబుతున్నారు. 

-ఎం.నాగేందర్‌

[email protected]