ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు మాంచి ఆదాయ వనరుగా మారింది. హిట్ కొడితే వారం రోజుల్లోనే కొటి నుంచి మూడు కోట్లు ప్రాఫిట్ వచ్చే అవకాశం వుందక్కడ. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కూడా రాను రాను ఓవర్సీస్ రేట్లు పెంచేస్తున్నారు. త్వరలో సెట్ మీదకు వెళ్లబోయే చరణ్-శ్రీనువైట్ల సినిమాకు ఓవర్ సీస్ రేటు అయిదు కోట్ల వరకు చెబుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి మగధీర మినహా మిగిలిన చరణ్ హిట్ లు అన్నీ ఇక్కడ పే చేసినంతగా అక్కడ పే చేయలేదు. రెండు నుంచి మూడు కోట్లు అన్నది చరణ్ సినిమాలకు సరైన రేటు అన్నది ట్రేడ్ వర్గాల బోగట్టా. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఆరు కోట్లు చెబుతున్నారట. శ్రీనువైట్ల డైరక్టర్ కావడం, వీరిది తొలి కాంబినేషన్ కావడం, దీనికి తోడు కోన అండ్ కో మళ్లీ శ్రీనువైట్లతో జతకట్టడం వంటివి అందుకు కారణాలుగా వున్నాయి. అంచనాలు పెరుగుతున్నాయి. సరైన హిట్ కొడితే అయిదుకోట్లు బరాబర్ గా సరిపోతుంది.
టెంపర్ సినిమాను మూడు కోట్లకే ఓవర్ సీస్ రైట్లు ఇచ్చేసారు. ఇప్పుడు ఆరు కోట్లకు వసూళ్లు చేరచ్చని అంచనా వేస్తున్నారు. అందులో ఖర్చులు పోను మిగిలేది నాలుగు నుంచి నాలుగున్నరే. అందువల్ల చరణ్ ఓవర్ సీస్ ట్రాక్ రికార్డు సంగతి పక్కన పెట్టి, కొత్త కాంబినేషన్ ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆరు కోట్లు కాస్త ఎక్కువే. నాలుగు కోట్ల దగ్గర తెగినా ఫర్వా లేకపోవచ్చు.