హక్కుల కోసం, అస్తిత్వం కోసం రాయలసీమ యువత సంఘటితం కావడం స్పూర్తిదాయకం. సమస్యల ప్రస్తావన, పరిష్కారం కేవలం కొన్ని ప్రాంతాలు లేదా కొంత మంది యువ కిశోరాలతో సరిపోదు.రాయలసీమ ఒకటే అని చెప్పినా ప్రతి జిల్లా, ప్రతి మండలం ఒక వైరుధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇలాంటి వైరుధ్యం లో సఖ్యత సాధించడం ఎలా? సాంస్కృతిక, సాంఘిక అనుసంధానం, పండిత, పామర, మేధో సంగమంతో తెలంగాణా ఉద్యమం ఒక పరిష్కారం చూపించింది. ఖమ్మం స్థితిగతులు వేరు, గద్వాల పరిస్థితులు వేరు .. కాని వాళ్ళిద్దరూ ఒక్కటి ఎలా అయ్యారు? అదిలాబాదు వేరు, మెతుకు సీమ సమస్యలు వేరు.. అయిన కలిసిపోయారు, ఎలా?
ఉద్యమం అంటే దానికి నిర్దిష్ట లక్ష్యం వుండాలి? అస్తిత్వం అంటే ఏమిటి? ప్రత్యేక రాయలసీమ కావాలనా? లేక రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి కావాలనా, తేల్చుకోవాలి? ప్రత్యేక రాయలసీమ అని అడిగితే మన భవిష్యత్తు భరోసా ఎలా? సాగు, తాగు నీరు వనరుల లేమి, విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక వెనుకబాటు..మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు తరలి పోయిన రాయల సీమ రత్నాలు, ఇక్కడ చూస్తే నైపుణ్యత లేని మానవ వనరులు, ..ఇన్ని పురిటి కష్టాలతో ప్రత్యేక రాష్ట్ర మనుగడ సాధ్యమేనా? కృష్ణ బేసిన్ లో ఎగువ రాష్ట్రము అయితే నికర, మిగులు జలాల హక్కులు ఎమౌవుతాయి? ప్రత్యేక కాని, గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎక్కడ జరగాలి? అది అందరికి సమ్మత మౌతుందా? ఇక్కడ వ్యవసాయం ముఖ్యమైనది దానికి ప్రత్యామ్నయం చూపకపోతే మన జాతి, సంస్కృతి అంతరిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం లో రాజకీయంగా అన్ని వర్గాల ప్రాతినిధ్యం, మనుగడ సాధ్యమేనా? అవకాశవాదులు, వ్యవస్థీకృత రాజకీయ వాతావరణం ప్రజలను పెనం లోంచి పోయ్యిలోనికి తొయ్యరని భరోసా ఉందా?
వుమ్మడి రాష్ట్రం లో ఉంటూ వైరుధ్యాలతో కూడుకున్న రాయలసీమ లో సర్వతోముఖాభ్వ్రిద్ధి అంటే ఏమిటి? నత్త నడకన సాగుతున్న సాగు నీటి ప్రాజెక్టు పనులు పూర్తయిపోతే మొత్తం రాయలసీమ బాగుపడుతుందా?మనలేక, మనుగడ లేక ఊళ్లకు ఊళ్ళు వదిలిపెట్టిపోయిన ప్రజలను రప్పించడం ఎలా? వ్యవసాయం తో పాటు చేతి వృత్తులు వికసించిన పల్లెలలో తిరిగి వైరుధ్య సాంఘిక సమాజ స్థాపన సాధ్యమేనా?ఒకప్పటి రాయలసీమ పల్లె సమాజం లో ప్రతి కులం, వర్గం రైతులే! ధూప,దీప నైవేద్యాలతో పాటు పూజారి మనుగడ కోసం దేవుని మాన్యాలు వుండిన ప్రాంతం. పూర్తయిన ప్రాజెక్టులతో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది కాని రైతుల ఉత్పాదక శక్తీ పెంచడం, పండిన వాటికి మార్కెటింగు సదుపాయం, రైతు మౌలిక సమస్యలు కరెంటు, ఎరువులు, సరళీకృత రుణాలు, అనుసంధానిత వ్యవసాయ విద్య లాంటి వాటికి పరిష్కారం చాల అవసరం. ప్రాజెక్టులతో పాటు పారిశ్రామీకరణ కూడా చాల అవసరం, ఈ తరుణం లో లక్ష్యాన్ని విస్తరించడం అనవసరం అనిపించ వచ్చు కాని అందరికి ఫలాల/నిధుల పంపకం లో ఈ ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు.. వ్యవసాయాధారిత పరిశ్రమలు, అపార ఖనిజ సంపద ఆధారిత పరిశ్రమల మనుగడ ప్రస్తతం వున్న రాజకీయ పరిస్థితులలో సాధ్యమేనా?
పాతుకు పోయిన పేరుకు పోయిన సమాజం బాగుపడిన తరువాత వుద్యమించమని చెప్పడం లేదు కాని ఉద్యమం లో బహుముఖ పార్శ్వాలు వుండాలంటున్నా! ప్రభుత్వం మాత్రమె కాకుండా ఈ ప్రగతి లో ప్రతి రాయలసీమ వాసి భాగస్వామి కావాలి, దానికి ఏమి చేయాలి? విజ్ఞులు, మేధావులు తమ రచనలతో, ఆలోచనలతో సమాజాన్ని జాగృతం చేయాలి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి అందుకు తగిన రాజకీయ వాతావరణం కల్పించాలి. ఏదో ప్రభుత్వం వేసే పథకాలను అందరు పంచుకోవడం అందుకు కొట్టుకోవడం కాకుండా మనలో వున్న సృజనాత్మకత, ఉత్పాదకత లను వెలికి తీసే సాధనాలను ఒడిసి పట్టి మన పారిశ్రామిక వేత్తలను, బయటి వారిని ఆకర్షించాలి, అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. ఆత్మా విశ్వాసం కొరవడిన, ఆత్మ న్యూనత ఆవహించిన యువతని తట్టి లేపి వాడికి సరైన నైపుణ్యత కల్పించి వాడి శక్తి ని రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి కి ఉపయోగించాలి.
ఒకటే ఉనికి రావాలంటే సాంస్కృతిక అనుసంధానం చాలా ముఖ్యం. ఎందుకు మన వాడు గజ్జె కట్టి ఆడటం లేదు, పాడటం లేదు, అవన్నీ కొన్ని ప్రాంతాలకే ఎందుకు పరిమితమైనాయి? జానపదాలు, జాతరులు మనలనని కలుపగలవు, దానికి కవుల సహకారం కావాలి.మన ఉనికి తెలియజెప్పే ఉత్సవాలు నిర్వహించాలి అందుకు తెలంగాణ బతుకమ్మ, బోనాలు మనకు స్ఫూర్తి. ఉపాధ్యాయులు తమ వంతుగా వివేకవంతులైన యువత ని తాయారు చేయటం లో ముఖ్య భూమిక పోషించాలి. లాయర్లు సమాజ జాగృతి కోసం, రాజకీయ చైతన్యం కోసం యాత్రలు చేపట్టి చైతన్య జ్యోతి వెలిగించాలి. మొత్తం సమాజం తన భూమిక ను ఉద్యమానికి ఊపిరులు ఊదాలి. రాజకీయ నాయకులు ఇప్పటికైనా తమ నిజాయితి నిరూపించుకోవాలి, స్వార్థ రాజకీయ సోపానాలకు ఈ ఉద్యమాన్ని బలి చెయ్యరాదు.రాజకీయ సోపానాల కలలకు ఈ ఉద్యమం వేదిక కారాదు. ఉద్యమాల లోంచి నాయకులూ పుడతారు, ఉద్యమాన్ని ఉపయోగించుకొని మాత్రం కాదు, అప్పుడు మాత్రమే మనం కోరుకున్న “రతనాల సీమ” సాధ్యం.
రంగ ఓంకారం