స్వచ్ఛ భారత్‌.. పబ్లిసిటీ స్టంట్‌లా మారిందా.?

స్వచ్ఛ భారత్‌.. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చారు. మన పరిసరాలు పరిశుభ్రంగా వుంటే మనం ఆరోగ్యంగా వుంటాం. ఇది జగమెరిగిన సత్యం. కానీ, పరిసరాల పరిశుభ్రత గురించి మనం ప్రదర్శించే…

స్వచ్ఛ భారత్‌.. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చారు. మన పరిసరాలు పరిశుభ్రంగా వుంటే మనం ఆరోగ్యంగా వుంటాం. ఇది జగమెరిగిన సత్యం. కానీ, పరిసరాల పరిశుభ్రత గురించి మనం ప్రదర్శించే నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. పరిశుభ్రత విషయంలో పాలకుల నిర్లక్ష్యమూ తక్కువేమీ కాదు. కోట్లు ఖర్చు చెయ్యడం తప్ప, పరిశుభ్రత విషయంలో పాలకులకు ఇప్పటిదాకా చిత్తశుద్ధి అనేది లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్‌ అనే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. సాధారణ ప్రజానీకం ఇప్పటికే ఈ కార్యక్రమంతో బాగా కనెక్ట్‌ అయ్యారు. చాలామంది సెలబ్రిటీలూ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఒకరిద్దరు మినహా ఎక్కువమంది స్వచ్ఛ భారత్‌ పట్ల ఖచ్చితమైన గౌరవంతోనే రంగంలోకి దిగుతుండడం ఆహ్వానించదగ్గ విషయమే.

అయితే, కొందరు మాత్రం మీడియా కెమెరాలు తమవైపు చూస్తున్నాయా? లేదా? అన్నట్టుగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి వస్తున్నారు. వీరిలో ఇంకొందరైతే ఏకంగా మీడియాని పిలిపించుకుని చెత్త ఊడ్చుతున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. వీరిలో పేరుమోసిన సెలబ్రిటీలే ఎక్కువ. ఆ రంగం ఈ రంగం అన్న తేడాల్లేవు.. ఈ పబ్లిసిటీ స్టంట్స్‌ విషయంలో.

స్వచ్ఛ భారత్‌ నినాదం ఓ సామాజిక బాధ్యతతో కూడుకున్నది. సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే గనుక, పబ్లిసిటీ కోసం కాకుండా, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మద్దతివ్వాల్సి వుంది. దీంట్లోనూ పబ్లిసిటీ వెతుక్కోవడమంటే అంతకన్నా భావదారిద్య్రం ఇంకేముంటుంది.? పబ్లిసిటీ కోసమే స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నవారిని పక్కన పెడితే, ప్రధాని పిలుపుతో దేశ వ్యాప్తంగా సామాన్యులు ఈ కార్యక్రమం పట్ల ఆకర్షితులవడం చాలా గొప్ప విషయమే.