బాబు తక్షణ సమస్య మంత్రివర్గమే

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడానికి ఇంకో వారం సమయం వుంది. ఈ లోగా బాబు ముందు అనేకానేక సవాళ్లు వున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆకళింపు చేసుకోవడం, కొత్త రాష్ట్రాన్ని గాడిలో…

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడానికి ఇంకో వారం సమయం వుంది. ఈ లోగా బాబు ముందు అనేకానేక సవాళ్లు వున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆకళింపు చేసుకోవడం, కొత్త రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, ఆపై అభివృద్ధికి బాటలువేయడం ఇదంతా ఒక ఎత్తు. ఇక ఎన్నికల హామీలు నెరవేర్చడం మరో ఎత్తు. ఈ రెండింటి కన్నా ఎజెండాలో ముందున్న అంశం మంత్రివర్గ కూర్పు. ఎంత మెజారిటీ వచ్చేసినా, అయిదేళ్లపాటు తిరుగులేని పాలన అందించే అవకాశం వచ్చినా, తన మాట కాదనే పరిస్థితి, ఎదురుతిరగే అవకాశం పార్టీలో లేకున్నా, బాబుకు మంత్రివర్గ ఏర్పాటు అన్నది కాస్త సమస్యగానే వుందని వినికిడి. ఇందుకు చాలా కారణాలున్నాయి. అన్నింటికన్నా కీలకమైనది గెలిచిన సభ్యుల్లో చాలా మంది సీనియర్లే. పార్టీని చిరకాలంగా నమ్ముకున్నావారే. పైగా చాలా మంది గతంలో మంత్రులుగా చేసిన వారే. 

అదేసమయంలో సీనియర్లయినా కూడా ఇంతవరకు అవకాశం రాని వారు కూడా వున్నారు. అందువల్ల ఎవరినీ కాదన లేని పరిస్థితి. ఇదే సమయంలో మరో సమస్య కూడా వుంది. అది ఇతర పార్టీల నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని వచ్చినవారు. వారిలో కూడా అనుభజ్ఞులు, సీనియర్లు వున్నారు. ఇప్పుడు వాళ్ల సంగతేమిటి అన్నది చూడాలి. అన్నింటికన్నా మించి ఇంకో సమస్య వుంది. అదే కులాల సమతూకం. ఒక్కో జిల్లాలో ఒకే కులానికి చెందిన ఇద్దరు ముగ్గురు అర్హతగలవారున్నారు. కానీ అలా ఇవ్వడం అన్నది కాస్త ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. పైగా చాలా జిల్లాల్లో నాయకుల మధ్య పొరపొచ్చాలు వున్నాయి. ఇక్కడ అవి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంది. ఇప్పుడు వీటన్నింటినీ సమస్వయం చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. 

శ్రీకాకుళం నుంచి కడప, కర్నూలు వరకు ఆశావహులు ఎందరో వున్నారు. అందునా గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్లు డిప్యూటీ సిఎమ్ పదవి ఆశిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. యనమల బిసి, గంటా కాపు వర్గానికి చెందినవారు. యనమల వరకు ఓకె. కానీ గంటాకు ఇవ్వడం ద్వారా, పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు వుంటుంది. పోనీ గంటాకు మంత్రి పదవి ఇద్దామనుకుంటే అక్కడ అయ్యన్న, బండారు, వెలకపూడి వంటి సీనియర్లున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో కోడేల, ధూళిపాళ నరేంద్ర వంటి ఒకే కమ్యూనికి చేందిన పెద్ద నాయకులు వున్నారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ద ప్రసాద్ వంటి వారున్నారు. ఇస్తే ఓ మాట..ఇవ్వకుంటే నమ్ముకుని వచ్చినవారికి ఏమీ చేయనట్లు?

ఇదిలా వుంటే సాధారణంగా ఇంతవరకు రాష్ట్ర క్యాబినెట్ లో రెడ్లు, కమ్మవారు, ఆపైన బిసి, కాపులు లాంటి సమతూకం వుంటూ వస్తోంది. తెలుగుదేశం కమ్మవారికి, కాంగ్రెస్ రెడ్లకు కాస్త అధికంగా అవకాశాలు ఇవ్వడం కూడా మామూలే. అయితే ఈ సారి తెలంగాణ విడిపోవడంతో, రెడ్ల వాటా తగ్గే అవకాశం వుందని తెలుస్తోంది. దానికి బదులుగా బిసిలు, కాపుల వాటా ఇతోథికంగా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 

ఇప్పుడు పైకి ఎంత మిగిలిన వ్యవహారాలపై దృష్టి పెట్టినా బాబు మంత్రివర్గ కూర్పుపై తన కసరత్తు తాను చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాల బోగట్టా. మంత్రివర్గ సంఖ్య ఇరవైకి కాస్త అటుఇటుగా వుండాలని, అంతకు మించకూడదని, బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చాణక్య

[email protected]